ఉద్యమ స్ఫూర్తి.. గ్రంథాలయ కీర్తి

ABN , First Publish Date - 2022-08-12T05:38:04+05:30 IST

బ్రిటీష్‌ పాలకుల అరాచకాలు, అకృత్యాలు.. భానిసత్వ పోకడలు.. నిరంకుశ విధానాలు.. దోపిడీలు.. దండనలు.. అణచివేతల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రజలను పోరుబాట వైపు నడిపించడంలో గ్రంథాలయాలు ముఖ్య భూమిక పోషించాయి.

ఉద్యమ స్ఫూర్తి.. గ్రంథాలయ కీర్తి
గాంధీపార్కులో నిర్వహిస్తున్న వెన్‌లాక్‌ లైబ్రరీ భవనం ఇదే


స్వాతంత్య్ర సంగ్రామంలో వెన్‌లాక్‌ లైబ్రరీ కీలక భూమిక
1894లో ప్రారంభించిన ఉమ్మడి మద్రాస్‌ గవర్నర్‌


బ్రిటీష్‌ పాలకుల అరాచకాలు, అకృత్యాలు.. భానిసత్వ పోకడలు.. నిరంకుశ విధానాలు.. దోపిడీలు.. దండనలు.. అణచివేతల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రజలను పోరుబాట వైపు నడిపించడంలో గ్రంథాలయాలు ముఖ్య భూమిక పోషించాయి. అక్కడకు చదువుకోవడానికి వచ్చే జన సమూహంలో అనేక అంశాలు చర్చకు రావడంతో పాటు కరపత్రాలను చదివి అవగాహన చేసుకుని నరనరాన పోరాట స్ఫూర్తిని నింపుకునేవారు. అలాంటి గ్రంథాలయాల్లో విజయనగరంలోని లార్డ్‌ వెన్‌లాక్‌ లైబ్రరీ కూడా ఒకటి. పేర్ల నారాయణ చెట్టీ దీనిని ఏర్పాటు చేసి స్వాతంత్య్ర పోరాట పథం వైపు ప్రజలను నడిపించారు.

విజయనగరం (ఆంధ్రజ్యోతి), ఆగస్టు 11:
స్వాతంత్య్ర ఉద్యమంలో విజయనగరం వాసుల పాత్ర అనిర్వచనీయం. బ్రిటీష్‌ పాలకుల నుంచి భరత మాత ధాస్యశృంఖలాలు తెంచేందుకు ఎందరో మహానుభావులు మేము సైతం అంటూ గళం కలిపారు. ఆ సమయంలో అనేక మందిలో ఉద్యమ విత్తనాన్ని నాటిన లార్డ్‌వెన్‌లాక్‌ గ్రంథాలయం పాత్ర చిరస్మరణీయం. అప్పట్లో విజయనగర గ్రంథాలయంగా పేరొందింది. నేడు కనీస నిర్వహణ లేక దయనీయంగా తయారైంది. కాగా స్వాతంత్య్ర ఉద్యమ రోజుల్లో జిల్లా కేంద్రంలోని పేర్లవారి కుటుంబానికి చెందిన పేర్ల నారాయణ చెట్టి బ్రిటీష్‌ వారి ఆగడాలను చూస్తూ మనసు నొచ్చుకునేవారు. వారిని ప్రతిఘటించాలని  బలం గా అనుకునేవారు. అందుకు యువశక్తి అవసరమని సంకల్పించి గ్రంథాలయ స్థాపనతో బీజం పడాలని నిర్ణయించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు ఇచ్చిన పిలుపును పట్టణ వాసులకు తెలిపేందుకు కూడా ఓ వేదిక అవసరమని గుర్తించి అందుకు నడుంబగించారు. ఇందులో భాగంగా 1894 ఆక్టోబరు 3న ఉమ్మడి మద్రాస్‌ గవర్నర్‌ బైలీ బరోన్‌ లార్డ్‌ వెన్‌లాక్‌ విజయనగరం పర్యటనకు వచ్చారు. మహారాజా పూసపాటి ఆంధ్రభోజ ఆనందగజపతిని కలిశారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన నారాయణ చెట్టి తన నిర్ణయాన్ని వెన్‌లాక్‌కు వివరించారు. గ్రంథాలయం ఏర్పాటుకు వెన్‌లాక్‌ అనుమతించడంతో(ప్రస్తుతం గాంధీ పార్కుగా పిలుస్తున్న ప్రాంతం) పాటుపట్టణంలో ఎకరాకు పైగా స్థలాన్ని ఆయన విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత లైబ్రరీ ఏర్పాటుకు  నారాయణ చెట్టి ముందుపడి  ఏర్పాటుకు ఒక్కో అడుగు వేశారు.  పెంకులతో నిర్మించిన భవనంలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. 1897 సెప్టెంబర్‌ 10న విక్టోరియా మహారాణి వెన్‌లాక్‌ లైబ్రరీని సందర్శించారు. అందులో గ్రంథాలు, విలువైన పుస్తకాలను చూసి నారాయణచెట్టిని అభినందిస్తూ ఓ ప్రశంసాపత్రాన్ని అందచేశారు. కాగా మహాత్మాగాంధీ 1934లో ఈ  గ్రంథాలయాన్ని సందర్శించి నిర్వహణను చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో ఈ గ్రంథాలయం కీలక పాత్ర పోషించింది. పోరాటం నలుదిశలా విస్తరించడానికి దోహదపడింది.
ఫ కంటోన్మెంట్‌లో ఉన్న పూసపాటి మహారాజుల కుటుంబం ఏర్పాటు చేసిన రాణీ సత్యవతి దేవి రీడింగ్‌ రూం కూడా స్వాతంత్ర ఉద్యమానికి సాయపడిందని చెప్తారు.  



Updated Date - 2022-08-12T05:38:04+05:30 IST