ప్రగతి వేగం పెంచండి

ABN , First Publish Date - 2021-06-14T05:13:28+05:30 IST

పల్లెలు, పట్టణాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు

ప్రగతి వేగం పెంచండి

  • అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలి 
  • సమస్యలపై వార్డు కమిటీలు వెంటనే స్పందించాలి
  • ప్రగతిలో వెనుకబడిన ప్రాంతాలపై దృష్టిపెట్టాలి
  • ఉత్తమ మండలాలు, గ్రామాలకు ప్రశంసలు
  • పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సీఎం సమీక్ష


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : పల్లెలు, పట్టణాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అందరినీ భాగస్వాములు చేయాలని సీఎం కేసీఆర్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతిపై ఆదివారం సీఎం వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పల్లె, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పల్లెలను, పట్టణ ప్రాంతాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని అభినందించారు. వార్డుకమిటీలను పటిష్టం చేయాలని సూచించారు. ప్రజల సమస్యలపై వేగంగా స్పందించే విధంగా కమిటీలు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పల్లె ప్రగతి. పట్టణ ప్రగతిపై దిశానిర్ధేశం చేశారు. అధికారులంతా అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు కార్యాచరణలోకి దిగాలని సూచించారు. 


అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు

పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల అమలు తీరుపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కార్యక్రమ అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డిజిల్లాలో 21 మండలాల్లోని 551 గ్రామాలు ఉన్నాయి. ఇందులో పల్లెప్రగతి కార్యక్రమాల అమలు విషయంలో నిర్లక్ష్యం వహించిన 19 మంది ఎంపీఓలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఇందులో  ముగ్గురిని సస్పెండ్‌ చేశారు. అలాగే మేడ్చల్‌ జిల్లాలో ఇద్దరు, వికారాబాద్‌ జిల్లాలో 18 మంది ఎంపీఓలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. అలాగే రంగారెడ్డిజిల్లాలో 174మంది సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.  పనితీరు మార్చుకోని 19మందిని సస్పెండ్‌ చేశారు. మరికొందరు పంచాయతీ కార్యదర్శులపై కూడా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 185మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చి ఇందులో ఏడుగురిని సస్పెండ్‌ చేశారు. మరొకరిని విధుల నుంచి తొలగించారు. ఇక మేడ్చల్‌ జిల్లాలోని 5 మండలాల్లో 61 గ్రామపంచాయతీలు ఉండగా, ఇందులో 13మంది సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఇందులో ఒకరిని సస్పెండ్‌ చేశారు. ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులపై కూడా చర్యలు తీసుకున్నారు. 17 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చి ఇందులో ఒకరిని సస్పెండ్‌ చేశారు. అలాగే వికారాబాద్‌ జిల్లాలో 18 మండలాల్లో 566 గ్రామపంచాయతీలు ఉండగా, ఇందులో 119 మంది సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఇందులో ఒకరిని సస్పెండ్‌ చేశారు. ఇందుకు సంబంధించి 102మంది పంచాయతీ కార్యదర్శులపై కూడా చర్యలు తీసుకున్నారు. వీరిలో 9 మందిని సస్పెండ్‌ చేశారు. 


ఉత్తమ మండలాలు ఇవే

రంగారెడ్డిజిల్లా : ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కొత్తూరు

వికారాబాద్‌ జిల్లా : వికారాబాద్‌, కోట్‌పల్లి, మర్పల్లి

మేడ్చల్‌ జిల్లా : ఘట్‌కేసర్‌, శామీర్‌పేట, మూడుచింతలపల్లి


అధ్వాన్ మండలాలు ఇవే

రంగారెడ్డిజిల్లా : తలకొండపల్లి, కేశంపేట, చౌదరిగూడ

వికారాబాద్‌ జిల్లా : బషీరాబాద్‌, దౌల్తాబాద్‌, బొమ్మరాశిపేట

మేడ్చల్‌ జిల్లా : మేడ్చల్‌, కీసర


ఉత్తమ గ్రామాలు ఇవే

రంగారెడ్డిజిల్లా : సిరిగిరిపూర్‌ (మహేశ్వరం), సర్వస్వతిగూడ (కందుకూరు), రాచలూరు (కందుకూరు)

వికారాబాద్‌ జిల్లా : పుల్‌మామిడి, సాల్వీడ్‌, తొర్రుమామిడి

మేడ్చల్‌ జిల్లా : మునీరాబాద్‌, గోధుమకుంట, కాచివాని సింగారం


అధ్వాన్న గ్రామాలు ఇవే

రంగారెడ్డిజిల్లా : బైర్‌ఖాన్‌పల్లి (కేశంపేట), చుక్కాపూర్‌ ( తలకొండపల్లి),గట్టుప్పలపల్లి ( తలకొండపల్లి)

వికారాబాద్‌ జిల్లా : ప్యాలమద్ది, సంగాయిపల్లితండా, మంతనగూడ తండా

మేడ్చల్‌ జిల్లా : ఆదర్శపల్లి, సైదోనిగడ్డతండా, మర్పల్లిగూడ

Updated Date - 2021-06-14T05:13:28+05:30 IST