అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2022-07-06T05:20:19+05:30 IST

కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్‌ గుర్తింపు కోసం వెళ్తున్న నేపథ్యంలో కళాశాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎస్‌ జూనియర్‌ కళాశాల, ఇంజనీరింగ్‌ కళాశాల, రాశివనం సందర్శించి అంశాల వారీగా సంబంధిత అధికారులు, ఇంజనీర్లు, సిబ్బందితో చర్చించారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కళాశాల సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

కామారెడ్డి టౌన్‌, జూలై 5: కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్‌ గుర్తింపు కోసం వెళ్తున్న నేపథ్యంలో కళాశాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎస్‌ జూనియర్‌ కళాశాల, ఇంజనీరింగ్‌ కళాశాల, రాశివనం సందర్శించి అంశాల వారీగా సంబంధిత అధికారులు, ఇంజనీర్లు, సిబ్బందితో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాలల విద్యాకమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్‌ కళాశాల భవనంలో బాలుర వసతి గృహం ఏర్పాటుకు మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని తెలిపారు. జీవీఎస్‌ జూనియర్‌ కళాశాల భవనంలో కళాశాల విద్యార్థినుల కోసం బాలికల వసతి గృహం ప్రారంభించాలని, అందుకు జీవీఎస్‌ యాజమాన్యం సహకరించాలని కోరారు. ఈ రెండు వసతి గృహాల వల్ల న్యాక్‌ గుర్తింపులో అదనపు పాయింట్లు వస్తాయన్నారు. కళాశాల రాశివనంలో తేనె టీగల బ్లాకులు ఏర్పాటు చేసి ఆదాయ వనరులు సృష్టించుకోవాలని, విద్యార్థులకు ఈ విషయమై సంబంధిత సంస్థ చేత శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. కళాశాలలోని బాటనీ, ఫారెస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో నర్సరీ అభివృద్ధిపరచాలని సూచించారు. అందులో ఔషధ, సుగంధ మొక్కలు ఉత్పత్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. దురాక్రమణకు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్న కళాశాల భూములలో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. మిగతా హద్దులలో హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు. కళాశాలలో విద్యార్థుల కోసం వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్‌ పరికరాలు ఏర్పాటు చేయడానికి, అలాగే రక్షణ దళాల పోటీ పరీక్షల విద్యార్థులకు పుస్తకాలు అందిస్తామన్నారు. పనులు వేగంగా పూర్తిచేసి న్యాక్‌లో అత్యుత్తమ గ్రేడ్‌ సాధించుటకు సంఘటితంగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్‌ కిష్టయ్య, విద్యాసంస్థల మౌలిక సదుపాయాల విభాగం ఈఈ దేవిదాసు, డీఈ సాయన్న, ఏఈ సుబ్బారాయుడు, సుమన్‌, అనూష, అధ్యాపకులు శంకర్‌, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, రామస్వామి, శివకుమార్‌, కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


ధరణిలోని పెండింగ్‌ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి: ధరణిలోని పెండింగ్‌ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో తహసీల్దార్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదిముబారక్‌ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. అటవీ, రెవెన్యూ భూములపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఆర్డీవో శ్రీను, కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:20:19+05:30 IST