ఉద్యమాల వేగుచుక్క

ABN , First Publish Date - 2020-10-11T06:11:48+05:30 IST

శ్రీకాకుళం సాయుధ పోరాట యోధురాలు చంద్రక్క ఉద్యమాల్లో పుట్టి ఉద్యమాల్లోనే పెరిగి ఉద్యమాలు చేస్తూనే ఊపిరి విడిచారు...

ఉద్యమాల వేగుచుక్క

శ్రీకాకుళం సాయుధ పోరాట యోధురాలు చంద్రక్క ఉద్యమాల్లో పుట్టి ఉద్యమాల్లోనే పెరిగి ఉద్యమాలు చేస్తూనే ఊపిరి విడిచారు. శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరు మండలం రాజాం గ్రామంలో జన్మించిన చంద్రక్కను బాల్యంలోనే నక్సల్‌బరీ వసంత కాల గానం ఉత్తేజపరిచింది. తాను పుట్టి పెరిగిన ఉద్దానం కేంద్రంగా ఆ గ్రామాల్లో ఉంటూ ప్రజా ఉద్యమాలకు ఆమె నాయకత్వం వహించారు. ఆకలి, అన్యాయం అణచివేతలు లేని కొత్త సమాజం రావాలని జీవితాంతం ఎన్నో త్యాగాలు చేశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఉద్యమ బాట వీడని నిబద్ధత ఆమెది. గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎన్నో పోరాటాలు చేశారు. ఆదివాసీల భూములు వారికే చెందాలని 1/70 చట్టం అమలు కోసం 5వ షెడ్యూల్‌లో ఆదివాసి గ్రామాలు చేర్చాలంటూ అటవీశాఖ అధికారుల దురాగతాలకు వ్యతిరేకంగా అలుపెరగని రీతిలో ఉద్యమం చేశారు. సుధీర్ఘకాలం అజ్ఞాతవాసంలో గడిపారు. అలాగే 9 సంవత్సరాలకు పైగా జైలు జీవితాన్నీ అనుభవించారు. అయినా సరే పోరాటబాట వీడక మళ్లీ రహస్య జీవితంలోకి వెళ్లారు. ప్రజలనే కన్న బిడ్డలుగా భావించి చివరివరకు జీవించిన ఉదాత్తురాలు చంద్రక్క. నిత్యనిర్భందాల మధ్య చెరగని విశ్వాసంతో, 72 ఏళ్ల వయోభారం మీద పడ్డా ఆశయాల సాధన కోసం తాను అనుసరించిన మార్గమే తన శాస్వగా జీవించారు.

మాధవరావు

(నేడు పలాసలో చంద్రక్క సంతాప సభ)

Updated Date - 2020-10-11T06:11:48+05:30 IST