ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ABN , First Publish Date - 2021-07-27T05:10:15+05:30 IST

కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని నెలల నుంచి నిలిచిపోయిన ‘స్పందన’ విభాగం ఎట్టకేలకు తెరచుకుంది. కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 172 వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ మాట్లాడుతూ.. ‘స్పందన’కు వచ్చిన సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు..
ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- ‘స్పందన’ మళ్లీ ప్రారంభం

- జడ్పీలో 172 వినతుల స్వీకరణ

- సమస్యలు పరిష్కరించండి

- అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/కలెక్టరేట్‌, జూలై 26)

కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని నెలల నుంచి నిలిచిపోయిన ‘స్పందన’ విభాగం ఎట్టకేలకు తెరచుకుంది. కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 172 వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ మాట్లాడుతూ.. ‘స్పందన’కు వచ్చిన సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుకూ పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. మండల, డివిజన్‌ స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌లు శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్‌, శ్రీరాములునాయుడు, డీఆర్వో దయానిధి తదితరులు పాల్గొన్నారు. 


 వినతులివీ..

- లావేరు మండలం చినమురపాక గ్రామానికి చెందిన తవిటినాయుడు తనకు ఇంటి స్థలం మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. 

- పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామానికి చెందిన ఎం.రాంబాయమ్మ.. తన భర్త మరణించారని, ప్రభుత్వం నుంచి ఆర్థిక  సాయం అందజేయాలని కోరారు. 

- పోలాకి మండలం అప్పాలం గ్రామానికి చెందిన జి.రామమూర్తి తన భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు అప్‌డేట్‌ కాలేదని ఫిర్యాదు చేశారు. 

- ఎచ్చెర్ల మండలం బలిజిపేటకు చెందిన గుండు పెద్దగోవిందరావు,  సంతబొమ్మాళి మండలానికి చెందిన సీహెచ్‌ సావిత్రిలు తమకు ఫించన్‌ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. 

- పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన వారణాసి పార్వతి.. అనారోగ్య కారణాల నేపథ్యంలో తనకున్న 20 సెంట్ల భూమిని విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. 

- లావేరు మండలానికి చెందిన ఓంకార్‌ పాత వికలాంగ సర్టిఫికెట్లు రద్దు చేయాలని కోరారు. 

-  సరుబుజ్జిలి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన కె.రాజు తన ఇంటి స్థలానికి హద్దులు చూపించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఇలా మొత్తంగా 172 అర్జీలు అందాయి. 

Updated Date - 2021-07-27T05:10:15+05:30 IST