కళాకారుల ఆత్మబంధువు

ABN , First Publish Date - 2022-01-13T09:13:42+05:30 IST

కొందరు తమ అసాధారణ ప్రతిభతో తాము పుట్టిన ప్రాంతానికి వన్నె తెస్తారు. మరి కొందరు ఆ ప్రాంతంలో పుట్టడం మూలంగానే ప్రతిభావంతులు అవుతారు. ఈ రెండిటి మధ్యా వ్యత్యాసం ఎరిగిన వాళ్ళు అరుదుగా ఉంటారు...

కళాకారుల ఆత్మబంధువు

కొందరు తమ అసాధారణ ప్రతిభతో తాము పుట్టిన ప్రాంతానికి వన్నె తెస్తారు. మరి కొందరు ఆ ప్రాంతంలో పుట్టడం మూలంగానే ప్రతిభావంతులు అవుతారు. ఈ రెండిటి మధ్యా వ్యత్యాసం ఎరిగిన వాళ్ళు అరుదుగా ఉంటారు. ఆ ప్రాంతం తెనాలి అయితే ఆ ఎరుక ఉన్న వ్యక్తి నాగళ్ల దుర్గాప్రసాద్. దుర్గ అని మేము ప్రేమగా పిలుచుకునే దుర్గా ప్రసాద్‌ను సరిగ్గా ఏడాది క్రితం కరోనా మింగేసింది. మృత్యువు వెయ్యికాళ్ల జెర్రిలా విస్తరిస్తున్న కల్లోల కరోనా కాలంలో అవనతం అవుతున్న అనేక చిత్తరువుల్లో మరచిపోలేని మరొక జ్ఞాపకం నాగళ్ల దుర్గాప్రసాద్. ఆయన నిష్క్రమణతో ఆంధ్ర, తెలంగాణ మేధో సమాజానికీ, తెనాలి గతానికీ వర్తమానానికీ ఉన్న లంకె తెగిపోయింది అనడం అసంబద్ధం అయితే కాదు.


తెనాలి పక్కనే ఉన్న అనంతవరంలో యాభై రెండు ఏళ్ళ కింద పుట్టిన దుర్గ బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. ఇంటర్ వరకే చదివినా వామపక్ష విద్యార్ధి ఉద్యమాలలో పనిచేసాడు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన ప్రధాన వ్యాపకాలు వ్యవసాయం, సాహిత్యం. పద్యం పాడడం ఆయన ప్రవృత్తి. పదిమందికి పద్య సౌరభం అందాలని తపించేవాడు. ఏదో పనిమీద బెజవాడ పోయినప్పుడు జయధీర్ సర్, సాయిచంద్‌తో కలిసి దుర్గాప్రసాద్ కన్న ఊరుకు మొదటిసారి పోయా. రెండు విస్తారమైన కాలువల మధ్య పచ్చటి చెట్టు మీద మరో వెచ్చని పిచ్చుక గూడులా అనిపించింది ఆ ప్రాంతం. బ్రతుకంతా నీళ్లకు వగచిన దక్షిణ తెలంగాణ వాడికి ఆ పచ్చదనాన్ని, అక్కడి స్నేహపు వెచ్చదనాన్ని, ఆ మనుషులను చూస్తే అసూయ కలిగింది. అక్కడి మనుషుల నాగరికం మీద మరీ. కాలవల్లో నీళ్ళు పారినట్టే ప్రతి గొంతునూ చీమకుర్తి నాగేశ్వరరావు, బండారు రామారావు ఆవహిస్తారు.


తెనాలి, దాని చుట్టూ ఆవరించిన సాంస్కృతిక మూలాలు ఇప్పటివి కావు. సినిమా, నాటకం, సాహిత్యం నాస్తిక హేతువాద స్రవంతులకు కూడలి తెనాలి. గొప్పవాళ్ళు అంతా తెనాలిలో పుట్టారు లేకుంటే తెనాలికి అల్లుళ్ళు అయినా అయ్యారు అనేవాడు మా దుర్గ. జాషువా రెండో దశ వైవాహిక జీవిత మూలాలు అక్కడే ఉన్నాయి. కమ్యూనిస్టు మేనిఫెస్టో ఆ ఊరి మీదుగానే శ్రీశ్రీకి అందింది. మొదటి కమ్యూనిస్టు పార్టీ సెల్ మూలాలు అక్కడే ఉన్నాయి. అభ్యుదయ రచయితల సంఘం అక్కడే ఏర్పడింది. కాలం నెత్తిమీద పిడుగులా పడ్డ చుండూరు కాఠిన్యం కూడా అక్కడే పురుడుపోసుకుంది. నాస్తిక హేతువాద సూత పురాణ లోకాయత చార్వాక ఆలోచనలు అందుకున్న తొలితరం అక్కడే ఉంది. అభ్యుదయ రచయితల సంఘ మూల విగ్రహాలు అక్కడే మొలిచాయి. ఇరవయ్యో శతాబ్దపు ప్రథమ దశకంలోనే లండన్‌తో విద్యా సంబంధాలు దండిగా ఉన్న గ్రామాలు అవి. గతించిన వైభవానికీ, వర్తమాన కెరీరిస్టు సమాజాల మధ్య వారధి దుర్గ. ఒక చిన్న వ్యవసాయదారుడు సాహిత్య వాకిళ్లలోకి ఎందుకు వచ్చాడో తెలియదు. ఆయన చేసిన పనులు అసాధారణమైనవి. అందుకు నిదర్శనాలు–


తెనాలి పట్టణ రంగస్థల సంఘం, ప్రజ్వలిత సాంస్కృతిక కుటుంబం. ఒక నాటి వైభవం కళ్ళముందే కాలగర్భంలో కలిసిపోతుంటే ఆ కళామూర్తుల వైభవాలను ఎలాగూ రప్పించలేము గనుక కనీసం ఆ మహిమాన్వితుల ఛాయా చిత్రాలు అయినా రాబోయే తరాలకు అందాలని దుర్గాప్రసాద్ తపనపడ్డాడు. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘానికి మరో వైభవం తేవాలనుకున్నాడు. తాను అధ్యక్షుడుగా ఉన్న రోజుల్లోనే కళాకారుల సంఘానికి ఒక భవనం అవసరం అని నిర్మాణం ప్రారంభించాడు. ఎంతో మంది తెనాలి కళా వైభవాన్ని ఆ మహనీయుల నిలువెత్తు ఛాయా చిత్రాలను గోడలకు వేలాడదీశాడు. మరి కొన్నాళ్ళకు రెండో అంతస్తునూ పూర్తి చేశాడు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఒక వైపు, ప్రజ్వలిత సాహిత్య సాంస్కృతిక సంఘం మరో వైపు తెనాలిని సాంస్కృతిక సంబరాలలో ముంచెత్తాయి. ఈ సంబరాల సందర్భంగానే దుర్గాప్రపసాద్‌తో నాకు పరిచయమయింది. అది స్నేహ బంధంగా కుసుమించింది.


హైదరాబాద్ భెల్‌లో ఒకనాటి ఇంజనీర్ కుమారుడయిన దుర్గాప్రసాద్, తండ్రి అకాల మరణంతో కుటుంబానికి నిట్టాడి అయ్యాడు. అదే శ్రద్ధతో, వందేళ్ల కళా, సాహిత్య, సాంస్కృతిక కేంద్రంగా అలసి సొలసిపోయిన తెనాలి సౌరభానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ‘మాది తెనాలి, మేము చెబితే వినాలని’ అతిశయంతో అంటాడు కానీ ఒళ్ళంతా ఆ మట్టి పరిమళాన్ని పూసుకుని తిరిగిన సాంస్కృతిక వారధి మా దుర్గ. నాలుగైదు రోజుల్లో చనిపోతాడనగా హైదరాబాద్ వచ్చాడు. కలవమంటే వెళ్ళి కలిశాను. ఆ రాత్రి నాకు ఆయనే స్వయంగా వడ్డించాడు. ‘ఏంట్రా తిండి తగ్గించావు’ అంటూ ఒక తల్లి తన బిడ్డకి కొసరి కొసరి పెట్టినట్టు పెట్టాడు. అదే దుర్గతో లాస్ట్ సప్పర్. తిరిగి తెనాలి వెళ్ళాక అక్కడి రంగస్థల ధూళిలో ధూళి అయ్యాడని తెలిసింది.


నిజం చెప్పాలంటే తెనాలి ఒక గతం. చరిత్రలో తప్పిపోయిన ఒక గాలిపటం తెనాలి. కవిరాజు సూతాశ్రమం అక్కడే ఉంది. కుటుంబరావు, చలం ఎన్నో విలువైన రచనలు ఆ ఊరిలోనే రాశారు. వందేళ్ళకు పైగా పద్యనాటక ప్రాభవానికి అదొక చిరునామా. సంగీత సాహిత్య, సినిమా, నాటక రంగాలకు అదొక కూడలి. ఐదు దశాబ్దాల దుర్గ బాల్య యవ్వనాలు ఎలా గడిచాయో నాకు తెలియదు కానీ తన జీవితపు చివరి రెండు దశాబ్దాలు కళలే జీవితంగా, పద్య నాటకాలే శ్వాసగా ఆయన జీవించాడు. మృత్యువుని పరిహసించాడు. ప్రపంచం అంతా వణికిపోతున్నా ‘దుర్గా జాగ్రత్త’ అని సన్నిహితులు పదే పదే హెచ్చరిస్తున్నా నా మిత్రుడు తన బ్రతుకు తాను బ్రతికాడు. అక్షరం కోసం పద్యం కోసం బ్రతికాడు. పద్య గమకాల పదఘట్టన శ్వాసగా మిగలాలి అని మా దుర్గ అనుకున్నాడు.


అలాంటి మా దుర్గ పోయి అప్పుడే ఏడాది అయ్యిందా? ఆయన లేకుండా నిజంగా తెనాలి మిగిలే ఉందా అనే అతిశయోక్తి అవసరం లేదు కానీ దుర్గం లేని రాజ్యం, దుర్గ లేని తెనాలి ఊహే కష్టంగా ఉంది. తెనాలి కోసం, అక్కడి సాంస్కృతిక పురావైభవం కోసం బ్రతికిన కొద్దికాలం అయినా ఒక విలువైన సార్థకమైన జీవితం గడిపాడు. తెనాలి మీద ఒక బృహత్ గ్రంథం తీసుకొని రావాలనేది దుర్గ చిరకాల కోరిక. ఆ రాయని పుస్తకంలో ఒక పుట అయిపోయి చరిత్రలో కలిసిపోయాడు. దుర్గాప్రసాద్ లక్ష్యం కోసం పని చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.

గుఱ్ఱం సీతారాములు

(నేడు తెనాలిలో నాగళ్ల దుర్గాప్రసాద్ ప్రథమ వర్ధంతి సభ)

Updated Date - 2022-01-13T09:13:42+05:30 IST