పాట విశ్వరూపం గేయ చతుర్ముఖుడు

ABN , First Publish Date - 2021-12-01T09:39:19+05:30 IST

ప్రతి తెలుగు గుండెపై పాటనే తన సంతకంగా చేసి నిండు నూరేళ్ళు పాటగా మనతోనే ఉండబోతానని నిన్న వరకూ తన శ్వాసనే మనకాశగా చూపిన గేయ చతుర్ముఖుడు...

పాట విశ్వరూపం గేయ చతుర్ముఖుడు

పాట విశ్వరూపం

చీకటిని చీల్చిన వెన్నెల... వెండితెర సిరివెన్నెల...

రాగతాళాల వన్నెల వెన్నెల... పాటకోసం పుట్టినోడు....

పాటల పాలు తాగి పెరిగినోడు... బతుకంతా పాటైనోడు....

సీతారామశాస్త్రి పాటల వేదం... పాట విశ్వరూపం...

జూలూరు గౌరీశంకర్

గేయ చతుర్ముఖుడు

ప్రతి తెలుగు గుండెపై పాటనే తన సంతకంగా చేసి 

నిండు నూరేళ్ళు పాటగా మనతోనే ఉండబోతానని 

నిన్న వరకూ తన శ్వాసనే మనకాశగా చూపిన

గేయ చతుర్ముఖుడు అందని దూరాలకు వెళ్ళిపోయిన వేళ

ఏమని పాడను 

పాటరాజహంస కనరాని దూరాలకెగిరిపోయిన వేళ

ఏ పాట రాసినా ఏడిపించావు

ఉప్పొంగిన హృదయం కురిసిన ఆనందబాష్పాలతోనో

కలతపడ్డ మనసు రూపమై కన్నీటి వరదగానో

పాటకు ప్రాణం పోసి 

మాటకు కొత్త ఊపిరులూది

పదంపదంలో తొణికిసలాడే జీవితసత్యం

లోకం పోకడనతి నిశితంగా చూసే నైజం

తెలుగు పాటకు రెండు కళ్ళుగా చేశావు

ఎవ్వరైనా బ్రతుకుబాటలో చవిచూడక తప్పని

సుఖదుఃఖాల జాడలను నీ మనసు అద్దంలో చూపించినట్టుగా

పాటలెన్నో మాకు అందించినావు

నీ పాటనూ నువ్వే రాసుకున్నావు

మౌనరాగాలు సైతం మాట్లాడుకున్నట్టు

ఈ వేళలో నీవు ఏంచేస్తువుంటావోనని వలపుగీతమే రాసినా

సామజవరగమన అని చిలిపి గేయాన్ని చేసినా

నీకు మాత్రమే చెందు పాట నేదారినైనా

నడిపించి మురిపించు నైపుణ్య కలిమి

ఎక్కడని వెదకను విషాదమే నీ ఉనికైన వేళ

పాట నీ ఆత్మగా చేసుకున్నోడివి

ఎక్కడున్నా ఈ పాట నిను చేరుకుంటుంది

విశ్వమే ఇది మా మాటగా నీకు చెబుతుంది

అంగలకుర్తి విద్యాసాగర్

Updated Date - 2021-12-01T09:39:19+05:30 IST