Sep 28 2021 @ 20:45PM

లత నోట ఆ పాట.... నెహ్రూ కంట కన్నీటి ధార...

సుస్వర సంపన్నమైన లతాజీ పాటంటే భావోద్వేగాల మూట... ఆ నోట వెలువడిన ఏ పాటైనా సరే హృదయాల్ని హత్తుకోవాల్సిందే. అందుకే దశాబ్దాలు గడిచినా... తరాలు మారినా... లతా మంగేష్కర్ పాటంటే తేనెల తేటల ఊటే... మధుర ఘట్టాలెన్నింటితోనో పెనవేసుకున్న ఆమె జీవితంలోని ఒక గొప్ప సందర్భాన్ని లతాజీ 92వ పుట్టిన రోజు నేపథ్యంలో గుర్తు చేసుకుందాం....


దాదాపు ఎనిమిది దశాబ్దాల తన కెరీర్‌లో వేలాది పాటలు పాడారు లత. ప్రత్యేకించి ఆమె గళం నుంచి వెలువడిన 'ఏ మేరే వతన్ కే లోగోం....' అనే దేశభక్తి గీతం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో అమరులైన భారత సైనికుల గౌరవార్థం ఇది వ్రాయబడింది. జనవరి 27, 1963న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ముందు లత ఈ పాటను పాడారు. అంతకు ముందు ఏం జరిగిందంటే....


ఏ మేరే వతన్ కే లోగోం... గీతాన్ని పాడాల్సిందిగా లతను కోరిన నిర్వాహకులు, కేవలం ఒక రోజు ముందు మాత్రమే ఆమెకు సమాచారం ఇచ్చారు. కానీ, ఒక్క రోజులో ఆ పాటకు న్యాయం చెయ్యడం సాధ్యం కాదని భావించిన లత అందుకు తిరస్కరించారు. అయితే గీత రచయిత అయిన కవి ప్రదీప్ గట్టిగా పట్టుబట్టి ఆ పాటను పాడమని అభ్యర్థించినంత పని చెయ్యడంతో చివరికి ఆమె అంగీకరించక తప్పలేదు. కార్యక్రమంలో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారి సమక్షంలో ఈ పాట పాడటానికి ముందు కేవలం ఒక్కసారి మాత్రమే రిహార్సల్ చేసే అవకాశం లతకు లభించింది. 


లత ఆ పాట పాడటం పూర్తయ్యాక.... లతతో తాను మాట్లాడాలనుకుంటున్నానని నెహ్రూ అన్నారట. దాంతో లతకు భయం పట్టుకుంది. ఆ క్షణాలను గుర్తు చేసుకున్న లత.... "మొదట నేను పాట సరిగ్గా పాడలేదేమో... తప్పు జరిగిందేమోనని భావించి భయపడ్డాను, కానీ నెహ్రూజీని కలిసినప్పుడు, ఆయన కళ్లలో నీళ్లు కనిపించాయి. లతా... ఇవాళ నువ్వు నన్ను ఏడిపించావు.... అని అన్నారు. అంటూ నాటి జ్ఞాపకాలను లత గుర్తు చేశారు. ఏ మేరే వతన్ కే లోగోం... గీతం రాసి 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2014లో ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో లత ఆనాటి విషయాల్ని గుర్తు చేసుకున్నారు.


లత మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలతో పాటుగా చలనచిత్ర రంగంలో అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, దేశంలోని అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న పురస్కారాలను అందుకున్నారు. లత 92వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మధురమైన స్వరం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని, వ్యక్తిగతంగా, ఆమె ఆశీర్వాదాలు గొప్ప బలమని పేర్కొన్నారు. లతా దీదీ సుదీర్ఘకాలంపాటు ఆరోగ్యకరమైన జీవితం గడపాలని తాను ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.