మూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!

ABN , First Publish Date - 2021-05-17T06:26:18+05:30 IST

నిర్మల్‌ పట్టణంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ప్రస్తుతం మంచిర్యాల చౌరస్తా నుంచి బైల్‌ బజార్‌ వరకు రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. టౌన్‌ బ్యూటీఫికేషన్‌ పేరిటా చేపట్టిన ఈ రోడ్డు వెడల్పుతో ఇక ప్రధాన మార్గమంతా మరింత విశాలంగా మారనుంది.

మూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!
బస్టాండ్‌ ముందు ఉన్న షెడ్లను తొలగించిన దృశ్యం

నిర్మల్‌ బస్టాండ్‌ సమీపంలో రోడ్ల వెడల్పు కోసం పండ్ల దుకాణాల తొలగింపు
వ్యాపారులతో చర్చించి ఒప్పించిన మున్సిపల్‌ చైర్మన్‌  

నిర్మల్‌, మే 16(ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ పట్టణంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ప్రస్తుతం మంచిర్యాల చౌరస్తా నుంచి బైల్‌ బజార్‌ వరకు రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. టౌన్‌ బ్యూటీఫికేషన్‌ పేరిటా చేపట్టిన ఈ రోడ్డు వెడల్పుతో ఇక ప్రధాన మార్గమంతా మరింత విశాలంగా మారనుంది. ఇప్పటికే మంచర్యాల చౌరస్తా నుంచి వివేకానంద చౌక్‌ వరకు రోడ్డుపై ఉన్న టేలాలను, పండ్ల దుకాణాలను, ఇతర చిన్న చిన్న కొట్టులను తొలగించేశారు. అయితే బస్టాండ్‌ ముందర గల పండ్ల దుకాణాలను తొలగించడం మున్సిపల్‌ యంత్రాంగానికి ఓ సమస్యగా మారింది. గత 30 సంవత్సరాల నుంచి బస్టాండ్‌ ప్రాంతంలో ఈ దుకాణాలను తొలగించేందుకు సంబందిత అధికారులు చాలాసార్లు ప్రయత్నించారు. దీనికి వ్యాపారులు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగిన సంఘటనలున్నాయి. అయితే రోడ్డు వెడల్పు పనులకు ఇది ఓ ప్రధాన సమస్యగా మారిపోయింది. తొలగింపు వ్యవహారంలో రాజకీయ జోక్యాలు కూడా పెరిగిపోయిన కారణంగా అధికారులకు ఇది సాధ్యం కాలేదు. అయితే మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ ఈ వ్యవహారాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళారు. మంత్రి సూచనలతో చైర్మన్‌ పండ్ల వ్యాపారులతో పాటు ఆర్టీసీ అధికారులతో సైతం చర్చించారు. అటు ఆర్టీసీ అధికారులను ఇటు పండ్ల దుకాణాల కోసం షెడ్లను వేసుకున్న వారందరితో చైర్మన్‌ చర్చించారు. రోడ్డు వెడల్పు ప్రధాన్యతపై వారికి వివరించి వారందరిని షెడ్లు తొలగించుకునే విధంగా ఒప్పించారు. దీంతో షెడ్లను తొలగించేందుకు వారు ముందుకు రావడంతో సమస్యకు పరిష్కారం లభించినట్లయ్యింది. ఆదివారం ఉదయం చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, డిఈ వినయ్‌, వైస్‌ చైర్మన్‌ సాజిద్‌తో పాటు కౌన్సిలర్‌లు ఆర్టీసీ డియం అంజనేయులు తదితరులంతా ఈ షెడ్ల తొలగింపును పర్యవేక్షించారు. షెడ్ల తొలగింపుతో బస్టాండ్‌ ప్రాంతంలో రోడ్డు వెడల్పు పనులకు ఇక ఆటంకాలు తొలగిపోయినట్లేనంటున్నారు. ప్రస్తుతం బస్టాండ్‌ ప్రాంతంలో ఓ వైపు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలతో పాటు జన సంచారం కారణంగా ఆ ప్రాంతమంతా పద్మవ్యూహంగా మారిపోతోంది. రోడ్డు వెడల్పు తక్కువగా ఉండడం , జనం రద్దీ విఫరీతంగా పెరిగిపోతుండడంతో బస్టాండ్‌ ప్రాంతంలో జనం నడిచేందుకు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చేపట్టబోయే రోడ్డు వెడల్పు పనులు దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపబోతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-05-17T06:26:18+05:30 IST