అయోధ్యకు పుణ్య నదుల మట్టి, నీళ్లు

ABN , First Publish Date - 2020-08-03T09:06:23+05:30 IST

తిరుమల క్షేత్రంలో సెలయేళ్లు కూడా ‘హరిహరి’ అంటూ పారుతాయి.. బద్రీనాథ్‌లోని నారాయణ కొండపైనుండే మృత్తిక సకల రోగ నివారిణి.. గంగాస్నానం సర్వపాప హరణం.. యాదాద్రి

అయోధ్యకు పుణ్య నదుల మట్టి, నీళ్లు

  • ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, 
  • ఇతర పుణ్యక్షేత్రాల నుంచి మృత్తిక సేకరణ
  • ప్రతి రాష్ట్రంలో పుణ్యనదుల తీర్థాలు
  • వీహెచ్‌పీ ఆధ్వర్యంలో అయోధ్యకు చేరవేత
  • 151 నదుల జలాలను తెచ్చిన ఇద్దరు సోదరులు


(సెంట్రల్‌ డెస్క్‌): తిరుమల క్షేత్రంలో సెలయేళ్లు కూడా ‘హరిహరి’ అంటూ పారుతాయి.. బద్రీనాథ్‌లోని నారాయణ కొండపైనుండే మృత్తిక సకల రోగ నివారిణి.. గంగాస్నానం సర్వపాప హరణం.. యాదాద్రి గుండం అన్నిరోగాల నుంచి స్వస్థత చేకూర్చే జలాలకు నిలయం.. పుణ్యభూమి అయిన భారతావనిలో ప్రతి దేవాలయం, ప్రతి నదీజలానికి పవిత్రత ఉందనేది భక్తుల విశ్వాసం. అందుకే, అయోధ్య రాముడి ఆలయ నిర్మాణానికి ఇప్పుడు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల నుంచి మృత్తిక, ప్రతి నది నుంచి జలాలు తరలి వెళ్లాయి. వీటన్నింటినీ శ్రీరామ మందిర నిర్మాణానికి ఉపయోగిస్తారు. బీజేపీ, దాని అనుబంధ సంస్థలైన వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌కు చెందిన కార్యకర్తలు, నాయకులు దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలు, నదులు, సముద్ర జలాలను అయోధ్యకు తరలించారు. అయోధ్యకు అన్ని ప్రాంతాల నుంచి కొరియర్లు, పోస్టుల ద్వారా మృత్తిక, నదీజలాలు చేరుకున్నాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విభాగాలకు చెందిన వీహెచ్‌పీ నేతలు తెలిపారు. ‘‘ద్వాదశ జ్యోతిర్లింగాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చార్‌ధామ్‌, స్వయంభూ క్షేత్రాలు, శ్రీలంకలోని శాంకరీదేవిని మొదలుకుని అష్టాదశ శక్తిపీఠాల నుంచి మృత్తికను అయోధ్యకు తరలించాం. ప్రతి రాష్ట్రంలోని వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్‌ యూనిట్లు నదీ జలాలను పార్శిల్‌ ద్వారా పంపించాయి. ఏపీ నుంచి కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, వంశధార, నాగావళి నదుల జలాలను సేకరించి, వేర్వేరుగా పంపించాం. తెలంగాణ నుంచి కృష్ణా, గోదావరి, మంజీర, భీమా నదుల నీటిని పార్శిల్‌ చేశాం. ఇలా మూడు రోజుల క్రితమే అన్ని రాష్ట్రాల నుంచి మృత్తికాజలాలు అయోధ్యకు చేరాయి’’ అని వివరించారు. కాగా, శ్రీరాముడిపై భక్తితో.. రాధేశ్యామ్‌ పాండే, శబ్ద్‌ వైజ్ఞానిక్‌ మహాకవి త్రిఫాలా అనే సోదరులు 151 నదుల నుంచి నీటిని సేకరించారు. అ యోధ్య ఆలయ నిర్మాణం ఎప్పటికైనా జరగకపోతుందా? అనే ఆశతో వీరు 1968 నుంచే నదీజలాలను సేకరించడం విశేషం. వాటితో వారిద్దరూ ఏడుపదుల వయసులో ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు.



Updated Date - 2020-08-03T09:06:23+05:30 IST