కలిచెర్ల ప్రభాకరరెడ్డి
మదనపల్లె, జనవరి 16: తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకరరెడ్డి పరిస్థితి మరింత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న పెద్దాయన స్వగ్రామం కలిచెర్లకే పరిమితమయ్యారు. కొన్నేళ్లుగా నరాల బలహీనతతో ఇబ్బంది పడుతున్నారు. నాలుగేళ్లక్రితం కర్నూలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమవడంతో తలకు ఆపరేషన్ జరిగింది. కలిచెర్ల ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. శ్వాస సంబంధిత సమస్య ఎక్కువ కావడంతో మదనపల్లెకు, అక్కడి నుంచి రెండువారాల క్రితం బెంగళూరుకు తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న అప్ప ఆరోగ్యం మెరుగుపడాలని నియోజకవర్గ ప్రజలు, అభిమానులు కోరుకుంటున్నారు.