విశాఖ భూ అక్రమాలపై సిట్‌ నివేదిక బుట్టదాఖలు?

ABN , First Publish Date - 2022-08-05T09:27:01+05:30 IST

విశాఖ భూ అక్రమాలపై సిట్‌ నివేదిక బుట్టదాఖలు?

విశాఖ భూ అక్రమాలపై సిట్‌ నివేదిక బుట్టదాఖలు?

ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రికార్డుల తారుమారుపై సర్కారుకు నివేదిక

ఏడాది దాటినా బయటపెట్టరేం?


అమరావతి/విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రికార్డుల తారుమారు తదితర ఉల్లంఘనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) చేపట్టిన విచారణ నివేదికను జగన్‌ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందా..? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో భూముల ఆక్రమణలపై ఆ పార్టీ నేతలు హడావిడి చేయడంతో ప్రభుత్వం 2019 అక్టోబరు 17న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ విజయకుమార్‌ నేతృత్వంలో మరో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి వైవీ అనూరాధ, రిటైర్డ్‌ జడ్జి టి.భాస్కరరావులను సభ్యులుగా నియమించింది. ఇవే ఆరోపణలపై టీడీపీ హయాంలో అప్పటి డీఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో నియమించిన సిట్‌ నివేదికను పక్కనపెట్టి, కొత్తగా ఈ కమిటీని వేశారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న ప్రభుత్వ భూములను జిరాయితీగా మార్పులు చేయడం, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే భూములకు నిరభ్యంతర పత్రాలు జారీ, ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించడం, ప్రైవేటు వ్యక్తులకు ఇష్టానుసారంగా ప్రభుత్వ భూముల కేటాయింపు, రికార్డుల తారుమారు వంటి అంశాలపై 2019 నవంబరులో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సిట్‌ బృందం గత ఏడాది జనవరి 31న మధ్యంతర నివేదిక ఇచ్చింది. తరువాత మరికొన్నాళ్లు విచారించి ఆ ఏడాది జూన్‌ తర్వాత ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక సమర్పించింది. అనేక రికార్డులు పరిశీలించి భారీస్థాయిలో ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించింది. రూ.వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం, రికార్డుల గోల్‌మాల్‌ వంటి అంశాలపై అధికారులు, కబ్జాదారుల పాత్రను, అన్ని పార్టీలకు చెందిన వ్యక్తుల ప్రమేయాన్ని నివేదికలో ప్ర స్తావించినట్లు తెలిసింది. టీడీపీ హయాంలో వేసిన సిట్‌ నివేదిక బహిర్గతం చేయలేదని, ఆ పార్టీకి చెందిన ప్రముఖులను చంద్రబాబు కాపాడుతున్నారని 2019 ఎన్నికలముందు వరకు వైసీపీ నేతలు అనేక ఆరోపణలు చేశారు. విశాఖ నగరం, పరిసరాల్లో టీడీపీ నేతలే ఎక్కువగా భూములు ఆక్రమించుకున్నారని పదేపదే ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వమే నియమించిన సిట్‌ నివేదికను బయటపెట్టాలని డిమాండ్‌ చేయకపోవడం విడ్డూరం. కొందరు వైసీపీ నేతల ప్రమేయం కూడా ఉండడంతో ప్రభుత్వం కావాలనే నివేదికను తొక్కిపెట్టిందనే వాదన వినిపిస్తోంది.

Updated Date - 2022-08-05T09:27:01+05:30 IST