Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పాలకుల పాపం.. ప్రజలకు శాపం!

twitter-iconwatsapp-iconfb-icon
పాలకుల పాపం.. ప్రజలకు శాపం!

ఆక్సిజన్‌ కోసం ఆర్తనాదాలు, మందుల కోసం ఆక్రందనలు, ఆస్పత్రులలో బెడ్ల కోసం పడిగాపులు, పైరవీలు, శ్మశానాలలో శవాలను దహనం చేయడానికి భారీ క్యూ లైన్లు... ఇదీ నేటి భారతావని ముఖచిత్రం! దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజలు ఇంత నిస్సహాయ స్థితిలో ఎప్పుడూ లేరు. మన దేశానికి పనిచేసే ప్రభుత్వం కావాలని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌ తన ఆవేదనను దేశ ప్రజలతో పంచుకున్నారు. ఆమె మాత్రమే కాదు, ఈ దేశ సగటు పౌరుడు కూడా ప్రస్తుతం ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో సగటున రోజుకు నాలుగు లక్షల మందికి పైగా కరోనా బారినపడుతూ ఉండగా, నాలుగు వేల మంది వరకూ చనిపోతున్నారు. వాస్తవ గణాంకాలు ఈ లెక్కలకు అనేక రెట్లు ఎక్కువగా ఉంటాయని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. కరోనా విపత్తు నుంచి ప్రజల ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకోవాల్సిన పాలకులు రాజకీయ ప్రయోజనాల వేటలో బిజీగా ఉంటున్నారు. ఫలితంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ముప్పు తీవ్రంగా ఉండబోతోందని మార్చి నెలలోనే పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరించినా ప్రభుత్వం చెవికెక్కలేదు. దీంతో పరిస్థితులు చేయి దాటిపోయాయి. ప్రపంచదేశాలన్నీ భారతదేశం వైపు జాలిగా చూస్తున్నాయి. మనదేశం నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఈ దుస్థితికి ఎవరు కారకులు? ప్రపంచదేశాలను ప్రభావితం చేయగల స్థితిలో ప్రస్తుతం భారతదేశం ఉందని, అందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వమే కారణమని నిన్నటిదాకా పొగిడిన వారే ఇప్పుడు మోదీ పేరు ఎత్తితే చాలు మండిపడుతున్నారు. చిన్నా చితకా దేశాలు సైతం మన దేశాన్ని వెక్కిరిస్తున్నాయి. ప్రపంచదేశాల ముందు భారతీయులు అవమాన భారంతో తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. తెలుగు రాష్ర్టాలకు చెందిన వారు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లకుండా ఆంక్షలా? దేశం ఒకటే అయినా వివిధ రాష్ర్టాల మధ్య రాకపోకలపై ఆంక్షలు విధించడం ఇప్పుడే చూస్తున్నాం. భారతీయ జనతాపార్టీ నాయకులు కూడా ప్రస్తుత పరిస్థితిని సమర్థించుకోలేకపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఇప్పటిదాకా ఈగ వాలనివ్వని వారు సైతం ఇప్పుడు విమర్శకులతో గొంతు కలుపుతున్నారు. నాయకుడిలోని నాయకత్వ పటిమ... సంక్షోభాలు తలెత్తినప్పుడే బయటపడుతుంది. ప్రధానిగా ఏడేళ్లుగా విజయాలను మాత్రమే చవిచూస్తూ, ప్రశంసలకు మాత్రమే అలవాటుపడిన మోదీ ఇప్పుడు మొదటిసారిగా ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అంటూ ఒకటి ఉందా అన్న అనుమానం సగటు పౌరుడికి కూడా కలుగుతోందంటే అందుకు కారకులు ఎవరు? శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టింది ఎవరు? అందుకు వారికి ఏ శిక్ష విధించాలి? ప్రజల ధన, మాన, ప్రాణాలకు భారత రాజ్యాంగం గ్యారంటీ ఇస్తోంది. అంటే మన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలపై ఉన్నట్టే కదా! మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ‘దేవుడినే నమ్ముకోండి’ అని మన ఖర్మకు మనల్ని వదిలేశాయి. ఇలాంటి ప్రభుత్వాలకు అధికారంలో కొనసాగే హక్కు ఉంటుందా? ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అన్న తేడా లేకుండా వివిధ రాష్ర్టాల హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టు సైతం కరోనా సంక్షోభంపై మానవత్వంతో స్పందిస్తూ ఆదేశాలు ఇస్తున్నప్పటికీ పాలకులకు చీమ కుట్టినట్టయినా లేదు. సెకండ్‌ వేవ్‌ మన దేశాన్ని చుట్టిముట్టి నెలన్నర అవుతున్నా ఆక్సిజన్‌ కొరత కూడా తీర్చలేకపోవడం ఏమిటి? వైరస్‌ బారిన పడిన వారికి ఆస్పత్రుల్లో పడకలు కూడా లభించకపోవడం దుర్మార్గం కాదా? వైద్యరంగంలో మనదేశపు డొల్లతనాన్ని ప్రస్తుత పరిస్థితులు బట్టబయలు చేస్తున్నాయి. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడే విషయంలో విఫలమవుతున్న పాలకులను ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సర్వోన్నత న్యాయస్థానం పరిష్కారం చూపుతుందో లేదో వేచిచూద్దాం!


ఇదా మన దుస్థితి?

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌కంటే కూడా భారతదేశం బలహీనంగా ఉందా? కానే కాదు! అలాంటప్పుడు ఇలాంటి దుర్భర దుస్థితి ఎందుకు దాపురించిందీ అంటే అందుకు పాలకులు మాత్రమే కారకులు. సంకుచిత మనస్తత్వంతో కూడిన నాయకులు అధికారంలోకి రావడం వల్ల ప్రజల విశాల ప్రయోజనాలు గాలికిపోతున్నాయి. ఈ దేశంలో ఒక్కటంటే ఒక్క వ్యవస్థ కూడా స్వతంత్రంగా పని చేయలేని స్థితిలో ఉందంటే అందుకు ఎవరు బాధ్యులు? వ్యవస్థలు పటిష్ఠంగా ఉంటే ఇలాంటి విపత్కర పరిస్థితులలో పాలకులతో నిమిత్తం లేకుండా అవి తమ పని తాము చేసుకుపోయేవి. ఇప్పటిదాకా మన దేశంలో అమలవుతున్న జాతీయ టీకా విధానం ఇప్పుడెందుకు అమలు  కావడం లేదు? కరోనా టీకాల విషయంలో ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి కల్పించారు. టీకాలకు వివిధ రేట్లు నిర్ణయించడం ఏమిటి? ఓట్ల వేటలో భాగంగా సంక్షేమం పేరు చెప్పి వేలాదికోట్ల రూపాయలు తగలేస్తున్న ప్రభుత్వాలకు ప్రజల ప్రాణాలు కాపాడటంకంటే మించిన సంక్షేమం ఉండదని తెలియదా? టీకాల సరఫరా, విక్రయంపై ప్రభుత్వాల పెత్తనం ఏమిటి? ఈ అధికారం తీసుకున్న పాలకులు ప్రజలందరికీ టీకాలు ఇస్తున్నారా? అంటే అదీ లేదు! విదేశీ టీకాలను సకాలంలో అనుమతించరు. స్వదేశీ తయారీదారులకు ఉత్పత్తి పెంచడానికి ఆర్థిక సహాయం కూడా చేయరు. అయినా టీకాలపై ప్రభుత్వాల పెత్తనం ఉండాల్సిందే అంటారు. పద్దెనిమిదేళ్లు నిండిన వారికి కూడా మే 1వ తేదీ నుంచి టీకాలు ఇస్తామని ప్రకటించిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు ముఖం చాటేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కొరతతో తమ బాధ్యత నుంచి తప్పుకొంటున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు సొంతంగా టీకాలు కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించిన కేంద్రప్రభుత్వం అక్కడ కూడా మెలికపెట్టింది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి టీకా వేయించుకోవాలనుకున్న వారు కూడా కోవిన్‌లో తమ పేరు రిజిస్టర్‌ చేయించుకోవాలన్న నిబంధన పెట్టారు. కరోనా బారిన పడుతున్నవారు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం లేక ప్రైవేటు ఆస్పత్రులలో చేరి లక్షల కొద్దీ బిల్లులు చెల్లిస్తున్నారు. ఒక్కొక్కరు కనీసం రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకూ చెల్లించాల్సిన పరిస్థితి. అయినా ప్రాణాలతో బతికి బయటపడతారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రులను కూడా ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది. కరోనా టీకాలను అనుమతించిన వెంటనే బహిరంగ మార్కెట్‌లో వాటిని విక్రయించుకోవడానికి అనుమతించి ఉంటే ప్రభుత్వాలపై ఒత్తిడి తగ్గేది కదా? ప్రైవేట్‌ ఆస్పత్రులకు లక్షల్లో బిల్లులు చెల్లిస్తున్న వారు రెండు మూడు వేల రూపాయలు ఖర్చు చేసి టీకా వేయించుకోలేరా? ఇంత అసంబద్ధ విధానం ఏమిటో తెలియదు? ప్రజలందరికీ టీకాలు ఇవ్వాలంటే 30వేల కోట్ల రూపాయలు అవసరమని ఒక అంచనా. కేంద్రప్రభుత్వం ఆ మాత్రం ఖర్చుచేయలేదా? దేశంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్లు ఎక్కడున్నాయి? వాటికి సమీపంలో ఉన్న ఆస్పత్రులు ఏవి? ఆయా ఆస్పత్రుల్లో ఏ తరహా వేరియంట్‌ సోకి ప్రజలు చనిపోతున్నారు? సంబంధిత ఆస్పత్రులకు ఏ తరహా మందులు సరఫరా చేయాలి? సిబ్బంది కొరతను తీర్చడానికి వైద్య విద్యార్థులను ఉపయోగించాల్సిన అవసరం ఉందా? వంటి వివరాలతో మ్యాపింగ్‌ రూపొందించి సమగ్ర కార్యాచరణ అమలు చేసి ఉంటే ప్రస్తుత ముప్పు కొంతైనా తప్పి ఉండేది. ఈ బాధ్యతను నెరవేర్చవలసిన కేంద్రప్రభుత్వం గాఢనిద్ర పోతున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రజలను అయోమయానికి గురిచేసే విధంగా కేంద్ర ఆరోగ్య శాఖ రోజుకో ప్రకటన విడుదల చేస్తోంది. దేశవ్యాపితంగా టీకా ఉత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రకటించగా... తెలుగు నాట ఇప్పుడు మొదటి విడత టీకాకు కూడా దిక్కులేకుండా పోయింది. కేంద్ర రాష్ర్టాల మధ్య ఇంత సమన్వయ లోపమా? విమర్శలను జీర్ణించుకోలేని స్థితికి ఢిల్లీ నుంచి గల్లీ వరకు పాలకులు చేరుకున్నందున సలహాలు, సూచనలు ఇచ్చేవారు ముందుకు రావడంలేదు. ప్రభుత్వ యంత్రాంగాలు ఇంత బేలతనం ప్రదర్శించడానికి పాలకులే కారణం. అధికారానికి భయపడి వ్యవస్థలు ముఖం చాటేస్తున్నప్పటికీ... ఇవాళ దేశప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ వైపు వేలెత్తి చూపుతున్నారు. కరోనాను నివారించడంలో గానీ, వైరస్‌ బారినపడిన వారికి కనీస అవసరాలు తీర్చడంలోగానీ ప్రధాని మోదీ విఫలమయ్యారని సర్వత్రా వినిపిస్తున్న విమర్శ. ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి మోదీ భక్తులు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఏ సోషల్‌ మీడియా ఆధారంగా నరేంద్ర మోదీ ప్రచారం పొందారో అదే సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఎందరో ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నది నిజం కాదా? అదుపు తప్పుతున్న పరిస్థితులను చక్కదిద్దడానికి దేశ వ్యాపితంగా లాక్‌డౌన్‌ విధించడం ఒక్కటే మార్గమని అంతర్జాతీయంగా వస్తున్న సూచనలను కేంద్రప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. లాక్‌డౌన్‌ విషయంలో రాష్ర్టాలే నిర్ణయం తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం బాధ్యతారాహిత్యం కాదా? ఈ కారణంగా ఆంధ్రా, తెలంగాణ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోలేదా? తెలంగాణ ముఖ్యమంత్రి లాక్‌డౌన్‌ దండగని తేల్చిపారేశారు. రాత్రిపూట అందరూ పడుకున్నాక కర్ఫ్యూ పెడితే చాలని ఆయన భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ పెడితే ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుందని కేసీఆర్‌ అంటున్నారు. నిజమే కావచ్చు. వేలాదిమంది కాటికి చేరుకుంటూ ఉండగా గల్లాపెట్టె గలగలలాడి మాత్రం ఏమి ప్రయోజనం? లాక్‌డౌన్‌ పెట్టిన రాష్ర్టాలలో కూడా కరోనా వ్యాప్తి తగ్గలేదని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో పరిస్థితి అదుపులోకి రావడమే ఆయన వ్యాఖ్యలకు సమాధానం అవుతుంది. కరోనా సోకుతున్న వారి సంఖ్యతోపాటు మరణాలను తక్కువ చేసి చూపించడం వల్ల ప్రయోజనం ఏమిటో ప్రభుత్వాలకే తెలియాలి. అధికార యంత్రాంగాన్ని బానిస మనస్తత్వం ఆవహించడం వల్ల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు, నిర్ణయాలే ఫైనల్‌ అవుతున్నాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ర్టాల్లో మంత్రిమండళ్లు అలంకార ప్రాయంగా మారిపోయాయి. అక్కడ ప్రధాని, ఇక్కడ ముఖ్యమంత్రి మనసెరిగి ప్రవర్తించినవాళ్లే మంత్రులుగా కొనసాగుతారు. తాము స్వతంత్రంగా వ్యవహరించవచ్చునన్న విషయం మంత్రులు మర్చిపోయారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడి ఉంటే... లాక్‌డౌన్‌ వల్ల ఫలితం ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అనగలిగి ఉండేవారా? పాలకుల నియంతృత్వ పోకడల వల్ల వ్యవస్థలు పతనమై ప్రజలను ఆదుకునే దిక్కు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైతే చక్కదిద్దడానికి కేంద్రప్రభుత్వం ఉండేది. ఇప్పుడు కేంద్రప్రభుత్వమే విఫలమైంది కనుక ఇక ప్రజలకు ఆ దేవుడే దిక్కు!


ఎన్నికలు... జాతరలు...

కరోనా ముప్పు గురించి శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినప్పటికీ లక్షలాది మంది పాల్గొనే కుంభమేళాను అనుమతించిన పాలకులను ఏమనాలి? శుభకార్యాలు, అశుభకార్యాలకు యాభై మందికి మించి హాజరు కాకూడదని నిబంధనలు విధించిన కేంద్రప్రభుత్వం కుంభమేళాకు అనుమతించడం నేరం కాదా? వందేళ్ల క్రితం ఇదే కుంభమేళా కేంద్రంగా ప్రబలిన కలరా వ్యాధి భారతదేశాన్ని దాటి అనేక దేశాలకు విస్తరించడం, లక్షలాది మందిని కబళించడం నిజం కాదా? చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోవడం మరో అదనపు నేరం కిందకు రాదా? హిందూ మత ఉద్ధారకులుగా తమకు తాము సర్టిఫికెట్లు ఇచ్చుకునే పాలకులు కుంభమేళాను అనుమతించడం ద్వారా కరోనా విజృంభణకు అవకాశం కల్పించి అదే మతాన్ని, అదే ధర్మాన్ని ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబెట్టడం ఎలాంటి విజ్ఞత అనిపించుకుంటుంది? మరోవైపు, కరోనా మహమ్మారి ముంచుకొస్తున్న వేళ కూడా ఎన్నికల షెడ్యూలును కుదించకుండా మొండిగా వ్యవహరించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేం సంజాయిషీ ఇస్తారు? ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగా వ్యవహరించగలిగే పరిస్థితి ఉండి ఉంటే పశ్చిమబెంగాల్లో రెండు నెలల పాటు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగి ఉండేవా? కరోనా విరుచుకుపడిన తర్వాతైనా చివరి మూడు దశలను కుదించి ఉండేవారు కదా! కేంద్రప్రభుత్వ పెద్దల మనసెరిగి ప్రవర్తించాల్సిన దుస్థితికి వ్యవస్థలు చేరకున్నాయనడానికి ఇదే నిదర్శనం. అందుకే కడుపు మండిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు ఎన్నికల కమిషన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న పట్టుదలతో నరేంద్ర మోదీ, అమిత్‌ షా ద్వయం ప్రభుత్వ బాధ్యతలను గాలికి వదిలేసి తమ సర్వశక్తులూ ఒడ్డి ఎన్నికల్లో పోరాడారు. కరోనా వంటి ఉత్పాతాలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పదిహేను రోజుల పాటు పశ్చిమబెంగాల్‌కే పరిమితమయ్యారు. మరోవైపు ఆదాయపుపన్ను శాఖ అధికారులు రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేస్తూ ప్రభుభక్తిని చాటుకున్నారు. అయినా ఆ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోయి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలోకంటే అధికంగా సీట్లు సాధించి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. వ్రతం చెడినా ఫలితం దక్కాలంటారు. మోదీ, షా ద్వయానికి ఫలితం దక్కకపోగా అపకీర్తి మూటగట్టుకున్నారు. నిన్నటివరకూ ప్రధాని మోదీని ఢీకొనేవాళ్లు దేశ రాజకీయాలలో ఒక్కరు కూడా లేరన్న అభిప్రాయం ఉండేది. ఒక మహిళ అయిన మమతా బెనర్జీ బెంగాల్‌ బెబ్బులిలా మోదీ, షాలను ఎదిరించి కలబడి నిలబడ్డారు. కేంద్రప్రభుత్వ నిరంకుశ ధోరణులకు పశ్చిమ బెంగాల్‌ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. దేశంలో ప్రతిపక్ష రాజకీయాలకు కొత్త ఊపిరి వచ్చింది. మమతా బెనర్జీపై అభిమానంతో కాకపోయినా కేంద్ర ప్రభుత్వ అణచివేత చర్యలపై వ్యతిరేకత వల్ల ఆ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోవాలని ఎందరో కోరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ఛాతీ వైశాల్యంకంటే మనసు వైశాల్యం పెంచుకోవాలి. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేధించడం వల్ల అన్నివేళలా అనుకూల ఫలితాలు రావు. భారతదేశంలో జాతీయ మీడియాను గుప్పిట బిగించి పట్టుకున్నప్పటికీ ఇవాళ అంతర్జాతీయ మీడియా ప్రధాని నరేంద్ర మోదీని తూర్పారపడుతోంది. మోదీని విఫల ప్రధానమంత్రిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టింది. అణచివేత కారణంగా తాత్కాలికంగా తలొగ్గిన వ్యక్తులు, వ్యవస్థలు త్వరలోనే తలలు ఎగరేసే అవకాశం లేకపోలేదు. నాయకుడి పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిన తర్వాత ఎన్ని విరుగుడు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం ఉండదు. రాజకీయ అధికారం శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడు చేసే మంచిపనులే ఎవరికైనా కీర్తిప్రతిష్ఠలను మిగుల్చుతాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు యావత్‌ భారతావనిని తమ అధీనంలోకి తెచ్చుకోవాలన్న మోదీ, షా ద్వయం అభిలాష ప్రకృతి విరుద్ధం. కేంద్రప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా రాజకీయాలను పక్కకు పెట్టి తమను ఆదుకునే ప్రభుత్వం ఉందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం వారికే మంచిది. నిరంకుశ ధోరణులు ఎల్లకాలం సాగవు. చరిత్రలో ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు.


కక్ష సాధింపులో సీఎంలు బిజీ..

తెలుగు రాష్ర్టాల విషయానికి వస్తే... మన ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్మోహన్‌ రెడ్డి కూడా ఢిల్లీ పెద్దలను ఆదర్శంగా తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద తల వంచితే చాలు, తమ రాష్ర్టాలలో తాము కూడా రెచ్చిపోవచ్చన్నట్టు ఈ ఇరువురు ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారు. కేసుల భయం అదనంగా ఉన్న జగన్‌ రెడ్డి, మోదీ భక్తిని చాటుకోవడంలో కేసీఆర్‌ కంటే ముందున్నారు. ప్రధాని మోదీని ఎంతో తెగువతో విమర్శించిన జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ను తప్పుపడుతూ జగన్‌ చేసిన ట్వీట్‌ ఇపుడు దేశమంతా చర్చనీయాంశంగా మారింది. విభేదాలు ఎన్ని ఉన్నా దేశం కోసం మోదీని బలపరచాలంటూ ఆ ట్వీట్‌లో జగన్‌ పిలుపునిచ్చారు. తన బెయిలు రద్దు పిటిషన్‌ త్వరలో విచారణకు రానున్న నేపథ్యంలోనే జగన్‌ ఈ స్థాయికి దిగజారినట్టు సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కంటే రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే ముఖ్యమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంతోపాటు రోగులకు వైద్య సదుపాయాలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించడానికి ఆయనకు టైం ఉండటం లేదు. తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించి, ‘బెడ్ల సంఖ్య పెంచండి! అందరికీ ఉచితంగా వైద్యం అందించండి’ అంటూ ప్రకటనలు చేస్తూ అవి అమలు జరిగిపోయినట్టుగా ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఒకే మంచంపై ఇద్దరిద్దరు కరోనా రోగులకు చికిత్స చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? శవం పక్కనే కరోనా రోగీ పడుకొని చికిత్స పొందే దుర్భర పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ముఖ్యమంత్రి చెప్పాలి. సంగం డెయిరీపై దశాబ్దం కింద నమోదైన కేసును తిరగదోడి ధూళిపాళ్ల నరేంద్రను ఇప్పుడు అరెస్టు చేయడాన్ని బట్టి జగన్‌ రెడ్డి ప్రాధాన్యతలు ఏమిటో తెలియడం లేదా! నరేంద్రకు ఇప్పుడు జైల్లో కరోనా కూడా సోకినందున పాలకులకు ఆనందం కలిగి ఉండవచ్చు. దశాబ్దాలుగా నడుస్తూ పేరొందిన జువారీ సిమెంట్స్‌, అమర్‌ రాజా బ్యాటరీస్‌ వంటి సంస్థలను కాలుష్య నియంత్రణ మండలిని అడ్డంపెట్టుకొని మూసివేయాలని ఆదేశించడం ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు పరాకాష్ఠ కాదా? రాష్ట్రంలో అత్యధిక మొత్తంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న కంపెనీలలో అమర్‌ రాజా బ్యాటరీస్‌ ఒకటి. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో ఉంటున్న గల్లా రామచంద్ర నాయుడిని ఒప్పించి రాష్ర్టానికి రప్పించి ఆ సంస్థను నెలకొల్పేలా ప్రోత్సహించారు. వేలాదిమందికి ఉపాధి కల్పించే సంస్థకు రాత్రికి రాత్రే కరెంటు కట్‌ చేయడాన్ని మించిన దారుణం ఏముంటుంది? కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను కూడా రాజకీయ కక్షతో మూసివేయిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిని ఎలా అభివర్ణించాలో తెలియడం లేదు. జువారీ, అమర్‌ రాజా విషయంలో ప్రభుత్వ ఆదేశాలను సస్పెండ్‌ చేసిన విధంగానే సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ జారీ చేసిన జీవోను కూడా హైకోర్టు కొట్టివేసిందంటే ప్రభుత్వ అధికారులు కూడా ఎంత అసంబద్ధంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. జగన్‌ రెడ్డి ప్రభుత్వ పరపతి పూర్తిగా మసకబారడంతో కరోనా టీకాలను అరువుపై సరఫరా చేయడానికి ఆయా సంస్థలు నిరాకరిస్తున్నాయి.


ఇక తెలంగాణ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాస్తవాలు చూడ్డానికి, వినడానికి కూడా ఇష్టపడరు. అందుకే రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలను అధికారులు తక్కువగా చూపిస్తున్నారు. ఒకవైపు కరోనా వైరస్‌ కారణంగా నానా అగచాట్లు పడుతుంటే కేసీఆర్‌ మాత్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెరతీశారు. కొంతకాలంగా ధిక్కారస్వరాన్ని వినిపిస్తున్న ఈటల రాజేందర్‌పై కత్తి దూశారు. ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయడంతో పాటు, భూకబ్జా ఆరోపణలపై అరెస్టు చేసే దిశగా పావులు కదుపుతున్నారు. కబ్జా ఆరోపణలను నిర్ధారించడానికై నలుగురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేశారు. ఇందులో ఇద్దరు జిల్లా కలెక్టర్లే ఉన్నారు. ఆ కలెక్టర్లు కరోనా మహమ్మారి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించకుండా గడచిన నాలుగు రోజులుగా దేవరయాంజల్‌ చుట్టూ తిరుగుతున్నారు. అసైన్డ్‌ భూములను, దేవాలయ భూములను కబ్జా చేశారంటున్న ఈటల రాజేందర్‌ను ఇంతకాలం మంత్రిగా ఎందుకు కొనసాగించారో కేసీఆర్‌ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు దేశంలో, తెలుగు రాష్ర్టాలలో ఉన్న పరిస్థితులేమిటి? ప్రధానమంత్రితోపాటు తెలుగు ముఖ్యమంత్రుల ప్రాధాన్యతలు ఈ విధంగా ఉన్నాయి మరి! పాలకుల నుంచి ప్రజలు ఆశిస్తున్నది ఏమిటి? వారు చేస్తున్నది ఏమిటి? ఇలాంటి వారికి అధికారం కట్టబెట్టి ప్రజలు తప్పు చేశారో లేదో తెలియదు గానీ, అమాయకులైన ప్రజలను కరోనా విపత్తు నుంచి కాపాడాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం!

ఆర్కే

పాలకుల పాపం.. ప్రజలకు శాపం!

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.