పెరిగిన ధరల పాపం కేంద్రానిదే

ABN , First Publish Date - 2022-05-27T06:05:47+05:30 IST

ప్రధాని మోదీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం 2014లో అధికార పగ్గాలు చేపట్టకముందు పెట్రోల్‌ రూ.66, డీజిల్‌ రూ.50.32 ఉంటే, 2022లో పెట్రోల్‌ రూ.119, డీజిల్‌ రూ.110కి పెరిగాయి. 2014లో గ్యాస్‌ ధర రూ.423 ఉంటే, ఇప్పుడు రూ.1050లకు చేరింది...

పెరిగిన ధరల పాపం కేంద్రానిదే

ప్రధాని మోదీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం 2014లో అధికార పగ్గాలు చేపట్టకముందు పెట్రోల్‌ రూ.66, డీజిల్‌ రూ.50.32 ఉంటే, 2022లో పెట్రోల్‌ రూ.119, డీజిల్‌ రూ.110కి పెరిగాయి. 2014లో గ్యాస్‌ ధర రూ.423 ఉంటే, ఇప్పుడు రూ.1050లకు చేరింది. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌పై ఇచ్చిన సబ్సిడీని క్రమంగా ఎత్తివేసే స్థాయికి తీసుకువచ్చారు. చమురు, గ్యాస్‌ ధరల పెరుగుదలతో ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా క్షీణించింది. రవాణా ఛార్జీలు పెరిగి, నిత్యావసరాలు, కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ద్రవ్యోల్బణం రేటు రికార్డు స్థాయిలో 8 శాతానికి పెరిగింది. ఎల్‌పిజి గ్యాస్‌ ధర పెరగడంతో ప్రధాని గొప్పగా చెప్పుకునే పేద గృహిణులకు అందించిన పిఎం ఉజ్వల పథకం నిరుపయోగంగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 90 లక్షల మంది గ్యాస్‌ను రీఫిల్‌ చేసుకోలేదని, మరో కోటి మంది ఒక్కసారి మాత్రమే రీఫిల్‌ చేసుకున్నారని ఇటీవల సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న దరఖాస్తు ద్వారా బైటపడింది. దీంతో లబ్ధిదారులు తిరిగి కట్టెల పొయ్యి మీద వండే పాత పద్ధతిలోకి వెళ్ళిపోతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో పథకాలు ఎలా డొల్లగా మారుతున్నాయో తెలియజేస్తోంది.


ఇటీవల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను చల్లార్చేందుకు పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం సెస్‌, సర్‌ఛార్జ్‌లను లీటర్‌కు రూ.9వరకు తగ్గించి, ఎల్‌పిజిపై రూ.200 వరకు సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. ఇది బారాణా పెంచి చారాణా తగ్గించినట్లుగా ఉన్నది. వాస్తవానికి తగ్గించేదేదో నేరుగా చమురు కంపెనీలే పెట్రోలు, డీజిల్‌ ధర తగ్గిస్తే అందుకు అనుగుణంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం విధించే పన్నులు, సెస్సులు తగ్గుతాయి. అలా కాకుండా కేంద్రం తెలివిగా రాష్ట్రాలకు వాటా పంచాల్సిన అవసరం లేని సెస్‌, సర్‌ఛార్జీలను భారీగా పెంచి, ఖజానాను నింపుకొని, ఇప్పుడు తగ్గించి, రాష్ట్రాలు కూడా తగ్గించాల్సిందిగా కోరుతోంది.


వ్యవసాయ రంగానికి, వాణిజ్య వస్తువుల రవాణా, వైద్యం ఇతర అత్యవసర సేవలకు వాహనాలు కావాలి. వాటికి వాడే డీజిల్‌ ధరలు పెరగడంతో ఆయా సంస్థలు కుంగిపోయాయి. అత్యాధునిక పద్ధతులు వచ్చిన తరువాత ఎక్కువగా యంత్రాలతోనే వ్యవసాయం చేస్తున్నారు. ట్రాక్టర్‌, హార్వెస్టర్స్‌, వరికోతలు తదితర యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ డీజిల్‌తో నడిచేవే. డీజిల్‌ రేట్లు పెరగడంతో వీటి వాడకం ఖరీదైంది. అద్దె ధర రెట్టింపు అయింది. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని సాకుగా చూపి దేశంలో వంటనూనె ధరలు విపరీతంగా పెంచేశారు. అక్రమ నిల్వలను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. వంటనూనెల ధరలే కాకుండా పప్పులు, ఉప్పులు, చింతపండు, కారం లాంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.


పెరుగుతున్న ధరలకు కేంద్ర ప్రభుత్వ పన్ను విధానాలు ఒక ప్రధాన కారణం. పన్ను అధికారాన్ని రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకున్నది. ‘ఒకే దేశం – ఒకే పన్ను’ అనే ఆకర్షణీయమైన నినాదంతో జిఎస్‌టి ద్వారా రాష్ట్రాల ఆదాయంపై పట్టు సాధించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు విడిచిపెట్టిన పెట్రోలు, డీజిల్‌ వంటి వాటిపై కూడా సెస్సు, సర్‌ఛార్జ్‌ల పేరుతో బాదుతోంది. గురివింద గింజ సామెత లాగా ప్రధాని నరేంద్రమోదీ నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల మీద సెస్సులు పెంచుకుంటూ పోతూ రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని చెబుతున్నారు. దేశం ఆదాయాన్ని సమకూర్చుకొని, రాష్ట్రాలు ఆదాయాన్ని తగ్గించుకోవాలని చూడటమంటే రాష్ట్రాలు ఆర్థికంగా చితికిపోయి, దేశం మీద ఆధారపడే విధంగా మలచుకోవాలనే దురుద్దేశం ఇందులో దాగి ఉన్నది. దేశ ఆదాయాభివృద్ధి కోసం మాత్రమే ధరలలో నియంత్రణ జరగడం లేదని, పన్నులు వడ్డించక తప్పదని చెబుతున్న బిజెపి నాయకులు దేశం ఆర్థిక లోటులో ఎందుకు ఉందో సమాధానం చెప్పాలి. పేదవారు మాత్రం నిరుపేదలుగా మారుతున్నారు. ధనికులు మరింత ధనికులుగా మారి అంతర్జాతీయంగా కుబేరులయ్యారు. అదానీ, అంబానీ లాంటి వారు ప్రపంచ దేశాల కుబేరుల ఆదాయంతో పోటీ పడి తమ సంపదను పెంచుకుంటున్నారు. మరోవైపు గుప్పెడు మంది కార్పొరేట్లకు లక్షల కోట్ల రాయితీలు, పారు బకాయిల రద్దు సరిపోదన్నట్లుగా ప్రభుత్వరంగ సంస్థల భూములు, ఆస్తులను కూడా కట్టబెట్టేందుకు కేంద్రం తెగబడుతోంది. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం కళ్లు తెరిచి చమురు కంపెనీలకు ముక్కుతాడు వేసి పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించి సామాన్యుడి కొనుగోలు శక్తిని పెంచాలి. లేకపోతే భారతదేశంలో కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చి పేదవారు మనుగడ సాగించడం కష్టం అవుతుంది.

చాడ వెంకటరెడ్డి

సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

(ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నేటి నుంచి 31 వరకు వామపక్షాల నిరసన)

Updated Date - 2022-05-27T06:05:47+05:30 IST