నాయకుల పాపం ప్రజల విషాదం

ABN , First Publish Date - 2022-04-05T07:23:57+05:30 IST

ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వమో, ఏకంగా కేంద్ర ప్రభుత్వమో ఒక శుభోదయాన ఉచితాలన్నీ రద్దు అని ప్రకటించిదనుకుందాం. ఎవరెవరి ప్రతిస్పందనలెలా ఉంటాయి...

నాయకుల పాపం ప్రజల విషాదం

ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వమో, ఏకంగా కేంద్ర ప్రభుత్వమో ఒక శుభోదయాన ఉచితాలన్నీ రద్దు అని ప్రకటించిదనుకుందాం. ఎవరెవరి ప్రతిస్పందనలెలా ఉంటాయి? ఇది పాలన చేతగాని ప్రభుత్వం అంటుంది ప్రతి పక్షం. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం అంటాయి వామపక్షాలు. సంక్షేమం లేని పాలన ఆత్మలేని దేహం అని ప్రతిపక్షానుకూల మేధావులు అంటారు. అందరూ కలిసి ఏకంగా ధర్నాలకూ రాస్తారోకోలకూ బంద్‌లకూ దిగిపోతారు. ఆ ప్రభుత్వాన్ని కూల్చేంతవరకూ ఉద్యమాలు ఆగవు. ఉచితాలు అనుచితాలని వీళ్ళందరికీ తెలుసు. తాము అధికారంలోకి వచ్చినా ఉచితాల భారాన్ని మోయలేమనీ వీరికీ తెలుసు. అయినా ఈ ఓట్ల రాజకీయ ప్రతిస్పందన మామూలే. కనుక ఏ ప్రభుత్వమూ ఉచితాల రద్దు ఆలోచన చెయ్యదు. అసలటువంటి ఆలోచన చెయ్యొచ్చనే సంకేతాలు కూడా ఇవ్వవు.


నిజానికి మన పాలకులు కళ్ళ ఎదుట కనపడే చాలా వాస్తవాలను చూడనట్టే నటిస్తుంటారు. అధికారులు లెక్కలు కట్టి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి, గొప్ప సత్యం కనిపెట్టినట్టు గుట్టు విప్పిన చేష్టలకు ఆశ్చర్యపోయినట్టు నటించేసి గుండెలు బాదుకుంటారు. ఇప్పుడు ఉచితాలకు సంబంధించి ప్రధాని మోదీతో అధికారుల సమావేశంలో కూడా ఇదే జరిగినట్టుంది. ఉచితాలతో ఆర్థిక సంక్షోభం వస్తుందనీ, కొన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే ఛిన్నాభిన్నం కావడానికి ఈ ఉచితాలే కారణమనీ ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిగ్గు తెలిస్తే కానీ దేశానికి తెలియదనుకోవడం కంటే అనుచితం ఏముంటుంది?


నిజంగా ఈ అధికారులకు ఉచితాలు చేసే నష్టం ఇప్పటి దాకా తెలియదా. ఆ పథకాలను ప్రభుత్వాలు ప్రకటిస్తున్నపుడు ఈ అధికారులు ఆ నష్టం గురించి ఎందుకు చెప్పి వారించడం లేదు? ఒకవేళ అధికారులు హెచ్చరించినా పాలకులు వినడం లేదా? భవిష్యత్ ముప్పుకంటే నాయకులు తమ తక్షణ ప్రయోజనం వైపే మొగ్గు చూపుతున్నారా? అదే నిజమైతే ఆ పాప ఫలితాన్ని నాయకులు కాక ప్రజలు అనుభవించాల్సి వస్తుంది... అదే విషాదం.


చేపలివ్వడం కాదు చేపలు పట్టడం నేర్పాలనేది చెప్పీ చెప్పీ వినీ వినీ అరిగిపోయిన ఆర్థిక సూత్రం. చేపలిచ్చి ఓటర్‌కు గాలం వెయ్యడం తప్ప మరో ఆలోచన మన రాజకీయ నేతలకు లేదుకదా. అభివృద్ధి, సంక్షేమం జోడుగుర్రాల లాగా పరుగులు తీయాలని చెపుతుంటారు. కానీ అభివృద్ధితో ఓట్లు రాలవని భారతీయ పరిస్థితులు చెపుతున్నాయి. అందుకే ఉచితాల మీదనే రాష్ట్రాలు దృష్టి పెడుతున్నాయి.


ఉచిత పథకాలనేవి దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందాలి. ప్రాజెక్ట్‌లు కట్టాలి. తాగునీరు పుష్కలంగా అందించే ఆలోచన చెయ్యాలి. రోడ్లు వెయ్యాలి. విద్యుత్ సరఫరా పరిధి పెంచాలి. అలా కాక కేవలం పప్పుబెల్లాల పందేరంలా మన ఉచిత పథకాలున్నాయనేది నిజం. దళిత బంధు పథకం ఏ ప్రభుత్వానికైనా గుదిబండేనన్నది అందరూ అంగీకరించాల్సిన నిజం. కానీ ఆ పథకాన్ని కేంద్రం కూడా అమలు చెయ్యాలని కొందరు బల్లగుద్ది డిమాండ్ చేస్తుంటారు. ఆరోగ్యశ్రీ ఆలోచన మంచిదే కానీ దాన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కడుపారా భోంచేసాయి. రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రయివేట్ కళాశాలకు పండగే అయింది. ఇక అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, దీవెన, ఆసరా, తోహా కానుక, ఇంటింటికి రక రకాల పింఛన్లు వంటి తాయిలాలన్నీ ఫలితం ఇవ్వని వ్యయాలేనన్న సంగతి తెలియంది కాదు.


ఏ ప్రభుత్వమైనా ప్రస్తుత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు పోను మిగిలిన సొమ్ములో 35 శాతాన్ని ఇటువంటి ఉచితాల మీదనే ఖర్చు చేస్తుంది. ఇక అభివృద్ధికి నిధులెక్కడనుంచి వస్తాయి? ఈ వ్యవహారం లోటుకు దారి తీస్తుంది. ప్రజలు అనవసర వ్యయాలకు అలవాటుపడతారు. ధరలు పెరుగుతాయి. దాంతో డిమాండ్ సప్లై మధ్య దూరం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం ఏర్పడి ఆర్థిక వ్యవస్థను కుప్ప కూలుస్తుంది. వెనిజులా ఏమైందో చూసాం కదా. ఇప్పుడు శ్రీలంకను ఉదాహరణగా చెపుతున్నారు. కానీ నిజానికి శ్రీలంక సంక్షోభానికి అదుపు తప్పిన అవినీతి కారణం. మితి మీరిన అప్పులు కారణం. ఉచితాలు పెరిగితే ఎవరైనా అప్పుల మార్గానికి మళ్లడం మినహా మరో పరిష్కారం లేదు. ఆ రకంగా ప్రతి రాష్ట్రం ఒక వెనిజులా, ఒక శ్రీలంక కావడానికి ఎంతో సమయం పట్టదన్నదీ నిజం.


ఉచితాలనేవి ప్రభుత్వాలు ఎక్కి స్వారీ చేస్తున్న పులిలాంటివి. ప్రభుత్వాలు దిగితే పులి స్వాహా చేస్తది. దిగకుంటే పులికి ఆహారం దొరకదు. అప్పుడది తన మీదున్న వ్యక్తిని కిందపడేసి మరీ తినేస్తుంది. కానీ దిగడానికి ఏ ప్రభుత్వమూ సిద్ధంగా ఉండదు. ఈ ప్రహేళిక పరిష్కారానికి ఎవరో ఒకరు ధైర్యం చెయ్యడమే మార్గం. ఉచితాల పులిని వదిలించుకుని నష్టం చేసే పథకాలు కాక ప్రజలకు కావాల్సిన ఉపాధి, చవకగా సరుకులు, ఉత్తమ విద్య, వైద్యం అందిస్తాం అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించే ప్రభుత్వం కావాలి. అది సాధ్యమా? ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఉచితాలు కాదు కదా అసలు ఏమీ ఇవ్వలేని దరిద్రానికి దిగజారేంత వరకూ మిన్నకుండి ఆ తరవాత వాటంతటవే మూతపడే పరిస్థితిని ఈ ప్రభుత్వాలు కల్పిస్తాయేమో? అదోరకం పరిష్కారమూ కావచ్చు.

ప్రసేన్

Updated Date - 2022-04-05T07:23:57+05:30 IST