ముట్టడిని ‘అత్యాచారయత్నం’గా రాశారు!

ABN , First Publish Date - 2021-01-24T08:52:54+05:30 IST

నిందితుల రిమాండ్‌ రిపోర్టులో కేసుకు సంబంధంలేని అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు రాసి తాడేపల్లి పోలీసులు కోర్టులో అభాసుపాలయ్యారు.

ముట్టడిని ‘అత్యాచారయత్నం’గా రాశారు!

కోర్టులో తాడేపల్లి పోలీసుల అభాసుపాలు

జడ్జి ప్రశ్నించడంతో రిమాండ్‌ రిపోర్టులో మార్పులు


మంగళగిరి, జనవరి 23: నిందితుల రిమాండ్‌ రిపోర్టులో కేసుకు సంబంధంలేని అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు రాసి తాడేపల్లి పోలీసులు కోర్టులో అభాసుపాలయ్యారు. శుక్రవారం తాడేపల్లిలో సీఎం కార్యాలయ ముట్టడికి టీఎన్‌ఎ్‌సఎఫ్‌ నేతలు యత్నించగా పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో టీఎన్‌ఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మన్నం వెంకట ప్రణవ గోపాల్‌ అలియాస్‌ టీడీపీ పవన్‌, నిమ్మగడ్డ సత్యసాయి, మొవ్వా శరత్‌బాబు, మన్నవ వంశీకృష్ణ, నలుకుర్తి సుప్రవత్‌లను అరెస్టు చేశారు. వారిపై క్రైమ్‌ నెం.61/2021 అండర్‌ సెక్షన్‌ 143, 188, 290, 353 రెడ్‌ విత్‌ 149 ఐపీసీ, సెక్షన్‌ 51(బి) డీఎం యాక్టు 2005, సెక్షన్‌ 3 ఆఫ్‌ ఎపిడిమిక్‌ డిసీజ్‌ యాక్టు 1897, సెక్షన్‌ 32 పోలీస్‌ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. రిమాండ్‌ రిపోర్టును సిద్ధం చేసి శనివారం మంగళగిరి అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు తీసుకువచ్చారు. రిమాండ్‌ రిపోర్టు చదివిన న్యాయమూర్తి అందులో ‘అటెంప్ట్‌ టు రేప్‌ ది కంప్లైనెంట్‌ బై యూజింగ్‌ క్రిమినల్‌ ఫోర్స్‌’ అనే వాక్యాన్ని చూసి అవాక్కయ్యారు. దీనిపై న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించడంతో వారు నాలుక కరుచుకొని వెనక్కి వెళ్లి, రిమాండ్‌ రిపోర్టును సరిదిద్ది తీసుకువచ్చారు.


సీఎంవో ముట్టడికి యత్నించినట్టు మార్చారు. అలాగే, రిమాండ్‌ రిపోర్టులో పైభాగంలో ఫిర్యాది స్టేట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌, తాడేపల్లి పీఎస్‌, గుంటూరు అర్బన్‌ అని రాసి, దిగువ భాగంలో ఫిర్యాది సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ అని పేర్కొన్నారు. దీంతో ‘అసలు కేసేమిటి? పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో చేసిన వ్యాఖ్యానాలు ఏమిటి’ అంటూ న్యాయవాదులు విస్తుపోయారు.   కాగా, రిమాండ్‌ రిపోర్టు టైప్‌ చే సినప్పుడు వేరే కేసుకు సంబంధించిన మేటర్‌ ఈ కేసుకు పొరపాటున అటాచ్‌  అవ్వడం వల్ల ‘అత్యాచార యత్నం’ అని వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చారు. ఎఫ్‌ఐఆర్‌లో అత్యాచార సెక్షన్లు ఏమీ నమోదు చేయలేదని పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-24T08:52:54+05:30 IST