మన్యంపై మావోయిస్టుల నీడ

ABN , First Publish Date - 2020-09-20T08:07:30+05:30 IST

పోలీసులు, మావోయిస్టుల కదలికలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నాయి...

మన్యంపై మావోయిస్టుల నీడ

పోలీసుల ఉచ్చు నుంచి తప్పించుకు తిరుగుతున్న భాస్కర్‌ దళం

పార్టీ విస్తరణకు ముమ్మర యత్నాలు

ఆసిఫాబాద్‌ సమీపంలో కదలికలు?

జిల్లా వ్యాప్తంగా కూంబింగ్‌ ముమ్మరం 


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

మావోయిస్టు పార్టీ విస్తరణే లక్ష్యంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెళ్లు అలియాస్‌ భాస్కర్‌ ఆదివాసీ గ్రామాల్లో సంచరిస్తుండగా, అతడిని పట్టుకోవడానికి పోలీసు యంత్రాంగం కార్యాచరణ రూపొందిస్తోంది. దీంతో జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు పోలీసులు, మావోయిస్టుల కదలికలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నాయి. జిల్లాలో మార్చి నుంచి మొదలైన  మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఆదిలోనే వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలన్న వ్యూహంతో స్ధానిక పోలీసులతో పాటు స్పెషల్‌ పార్టీ, రిజర్వ్‌ బలగాలు ఇప్పటికే మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా గాలింపులు జరుపుతున్నాయి. అయితే పోలీసులు వారిని పట్టుకునేందుకు ఎన్ని రకాల ఉచ్చులు పన్నుతున్నా భాస్కర్‌ బృందం చాకచక్యంగా తప్పించుకుంటూ గ్రామాల్లో సంచరించడాన్ని జిల్లా పోలీస్‌ యంత్రాంగం సవాలుగా పరిగణిస్తోంది. 


రంగంలోకి గ్రేహౌండ్స్‌ దళాలు

స్థానిక పోలీసులకు అదనంగా నక్సల్స్‌ అణచివేతలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రేహౌండ్స్‌ బృందాలను కూడా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. కాగా   మార్చి నుంచి ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాల్లో భాస్కర్‌ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు  తెలుస్తుండడంతో కూంబింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పక్షం రోజులుగా భాస్కర్‌ కదలికలు గుర్తించిన ప్రాంతాలలో తరచూ సాయుధ బలగాలు ఆదివాసీ గ్రామాలను జల్లెడ పడుతున్నాయి. 


ఇన్‌ఫార్మర్ల సమాచారంతో అప్రమత్తం

ఈక్రమంలో గురువారం సాయంత్రం భాస్కర్‌తో పాటు మరో నలుగురు సాయుధులు ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న చిలాటిగూడ గ్రామ సమీపంలో సంచరిస్తున్నట్లు ఇన్‌ఫార్మర్ల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు నేతృత్వంలో దాదాపు 300 మందికి పైగా పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థ ద్వారా భాస్కర్‌ దళం కదలికలపై అందిన సమాచారంలో చిలాటిగూడ గ్రామానికి సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా పేర్కొనక పోవడంతో పోలీసులు ఆసిఫాబాద్‌ సమీపంలోని ఆ గ్రామాన్ని దిగ్బంధిచారన్న ప్రచారం జరుగుతోంది. అయితే భాస్కర్‌ బృందం పోలీసులకు చిక్కకపోవడంతో సిర్పూర్‌(యూ) మండలం చిలాటిగూడ వైపు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు.  


అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు

ఆసిఫాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌ వరకు విస్తరించి ఉన్న పెద్దవాగు పరిసరాలు, కదంబ అటవీ ప్రాంతం ముఖ ద్వారాల్లో పోలీసులు పెద్దఎత్తున కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. మరోవైపు తిర్యాణితో పాటు రెబ్బెన, పెంచికల్‌పేట్‌, బెజ్జూర్‌ మండలాలలోనూ పోలీస్‌ బృందాలు తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అయితే నిర్బంధం తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ భాస్కర్‌ బృందం సురక్షిత ప్రాంతాలకు వెళ్లకుండా తరచూ ఈ ప్రాంతంలోనే ఎందుకు సంచరిస్తున్నాడనేది పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే ఆ పార్టీ కేంద్ర కమిటీలో ఇటీవల జరిగిన మార్పుల నేపథ్యంలో దండకారణ్యానికి ఆనుకొని ఉన్న మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో పార్టీ విస్తరణకు కేంద్ర నాయకత్వం కచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం వల్లే ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇటీవల మావోయిస్టుల బృందానికి సంబంధించిన డైరీలో లభించిన  కీలక మైన సమాచారం కూడా ఇదే విషయాన్ని రూడీ చేస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా ఇదే రకమైన సమాచారాన్ని పోలీసులకు అందించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఇటీవల డీజీపీ నేరుగా రంగంలోకి దిగినట్టు చెబుతున్నారు. 


కొత్త దళ సభ్యుల రిక్రూట్‌మెంట్‌?

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్‌ ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి, సిర్పూర్‌(యూ), మంచిర్యాల జిల్లాల పరిధిలో పార్టీ క్యాడర్‌ను రిక్రూట్‌ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో జిల్లా కమిటీ సభ్యుడిగా భాస్కర్‌ ఈ ప్రాంతంలోని భౌగోళిక స్థితిగతులపై పట్టు కలిగి ఉండడంతో ఈ ప్రాంతంలోని పార్టీ సానుభూతి పరులను మిలిషియాలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అతని వెంట ఉన్న నలుగురు సాయిధులతో పాటు కొత్తగా మరో నలుగురు సభ్యులు సంచరిస్తున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం తిర్యాణి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల ఘటన తరువాత పోలీసులకు లభ్యమైన సమాచారం ఆదారంగా పార్టీకి సహకరించే వారి జాబితాను  ఆదిలాబాద్‌ ఎస్పీ పత్రికలకు విడుదల చేశారు. మొత్తానికి ఏజెన్సీ గ్రామాల్లో మావోయిస్టుల కదలికలతో ఎప్పుడేం జరుగుతుందోనని గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

Updated Date - 2020-09-20T08:07:30+05:30 IST