అక్షరాస్యత గ్రామం.. అభివృద్ధికి దూరం

ABN , First Publish Date - 2021-05-06T04:40:04+05:30 IST

కొండ శిఖర గ్రామమైన వాడపుట్టిలో ఉన్నత విద్యావంతులు అధికంగా ఉన్నా... గ్రామం మాత్రం కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. మౌలిక సదుపాయాలు కొరవడడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అక్షరాస్యత గ్రామం.. అభివృద్ధికి దూరం
గ్రామవీధి రోడ్డు దుస్థితి... ప్రవహిస్తున్న మురుగునీరు

వాడపుట్టిలో సమస్యల తిష్ఠ

తాగునీటికి అవస్థలు

కానరాని రోడ్డు సౌకర్యం

(గుమ్మలక్ష్మీపురం)

కొండ శిఖర గ్రామమైన వాడపుట్టిలో ఉన్నత విద్యావంతులు అధికంగా ఉన్నా... గ్రామం మాత్రం కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. మౌలిక సదుపాయాలు కొరవడడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా ఈ గ్రామంలో 150 కుటుంబాలు జీవిస్తున్నాయి. 1200 మంది వరకూ జనాభా ఉంది. అయినా కనీసం రహదారి సౌకర్యం కూడా లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలపై ఆశలు వదులుకుంటున్నారు.  కొన్ని దశాబ్దాలుగా ఆ గ్రామాన్ని ఉన్నత స్థా యి అధికారిగాని, ప్రజాప్రతినిధి గాని సందర్శించిన దాఖలాలు లేవంటే ఆ గ్రామ పరిస్థితి అర్ధం చేసుకో వ టచ్చు. ఈ గ్రామానికి సరైన రహదారి కూడా లేదు. నాలుగేళ్ల కిందట ఉపాధి హామీ నిధులతో రహదారి మంజూరైనా ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 70 మంది విద్యార్థులున్నా పక్కా భవనం లేదు. అంగన్‌వాడీ కేంద్రానిది కూడా ఇదే పరిస్థితి. సరైన విద్యుత్‌ సదుపాయం కూడా లేదు. ఒక్కోసారి వారాల తరబడి చీకటిలోనే జీవించాల్సి వస్తోంది. తాగునీటి సదుపాయం లేదు. ఉన్న ఒక బావి, గ్రావిటీ పథకం ద్వారా వస్తున్న కలుషిత నీటినే వినియోగిస్తున్నారు. పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్ని కష్టాలు ఎదురైనా  ఆ గ్రామ యువత దిగమింగుతూ చదువులో రాణిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రభుత్వ కొలువుల్లో కొన సాగుతుండగా... మరికొంత మంది ఉన్నత చదువుల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.  


ఉన్నత విద్యావంతులున్నా...

ఇంత వెనుకబడిన గ్రామంలో కూడా పలువురు ఉన్నత చదువులు చదువుకున్నారు. ఒక విద్యార్థి ముంబై ఐఐటీలో చదువుతున్నాడు. ట్రిపుల్‌ ఐటీ చేసిన అమ్మాయి, నలుగురు బీటెక్‌ విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు, మరో పది మంది వరకు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ గ్రామంలో ఉన్నారు. అయినా ఈ గ్రామాన్ని పట్టించుకొనే నాథుడే కరువ య్యాడు. తమ గోడును 20 ఏళ్లుగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు చెబుతున్నా పట్టించుకొనేవారు కరువ య్యారని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసు కుని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.


అధికారులు చొరవచూపాలి

మా గ్రామంలో చదువుపై ఎంతోమంది యువత ఆసక్తి చూపిస్తున్నారు. సరైనా వసతులు లేకపోవడంతో ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. కనీసం రోడ్డు కూడా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి వనరులు కూడా పూర్తి స్థాయిలో లేవు. అధికారులు చొరవతీసుకుని మా గ్రామాభివృద్ధి కృషి చేయాలి.

- మోహనరావు, ఉపాధ్యాయుడు


Updated Date - 2021-05-06T04:40:04+05:30 IST