సెటిల్‌మెంట్‌ వార్‌

ABN , First Publish Date - 2020-06-06T08:52:48+05:30 IST

అప్పటి వరకు అన్న అని తిరిగిన వాడు ఎదురు తిరగడంతో అహం దెబ్బతింది..

సెటిల్‌మెంట్‌ వార్‌

ఆస్తి వివాద సెటిల్‌మెంటే వార్‌కు కారణమని పోలీసుల నిర్ధారణ 

ఒక వర్గానికి చెందిన 13 మంది అరెస్టు

అందరి పైనా రౌడీషీట్లు

భారీగా మారణాయుధాల స్వాధీనం

మద్యం మత్తులో గ్రౌండ్‌కు చేరుకున్న పండు గ్యాంగ్‌

ఘటనపై ఐదు కేసుల నమోదు

సందీప్‌కు అన్ని రాజకీయ పక్షాలతో సంబంధాలు


విజయవాడ(ఆంధ్రజ్యోతి): అంతా కలిపి రూ.42 లక్షల ఆస్తి సెటిల్‌మెంట్. రెండువైపులా చెరో 40మంది గుమిగూడారు. మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుని కళ్లలో కారం చల్లుకున్నారు. కత్తులతో దాడి చేసుకున్నారు. మడత బ్లేడ్‌లతో కోసుకున్నారు. విజయవాడలో కొద్దిరోజుల క్రితం జరిగిన గ్యాంగ్‌వార్‌లో కనిపించిన దృశ్యాలు ఇవి. ఓ సివిల్ సెటిల్‌‌మెంటే ఈ వార్‌కు కారణమని పోలీసులు తేల్చారు. అందులో ఒక గ్యాంగ్‌కు చెందిన 13మందిని అరెస్టు చేశారు. ఆ వివరాలను విజయవాడ పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు, ఉపకమిషనర్ హర్షవర్థన్‌రాజు, నవాబ్ జాన్, సహాయ కమిషనర్ నాగరాజురెడ్డి, ఇన్‌స్పెక్టర్లు సురేష్‌రెడ్డి, వినయ్‌మోహన్‌లతో కలిసి శుక్రవారం సాయంత్రం వెల్లడించారు.


అప్పటి వరకు అన్న అని తిరిగిన వాడు ఎదురు తిరగడంతో అహం దెబ్బతింది సందీప్‌కి. ఇంటికి వచ్చి అర్ధరాత్రి గొడవ చేయడంతో పాటు, వరస వార్నింగ్‌లు ఇవ్వడంతో కయ్యానికి కాలు దువ్వాడు మణికంఠ అలియాస్‌ కేటీఎం పండు. ఒక సివిల్‌ సెటిల్‌మెంటే వీరిద్దరి మధ్య అగ్గిని రాజేసిందని పోలీసులు గుర్తించారు. రెండు వర్గాల్లోనూ రౌడీషీటర్లు ఉన్నారని నిర్ధారణ అయింది. ఒక హత్య కేసులో ఉన్న ఇద్దరు రౌడీషీటర్లలో ఒకరు గడచిన నెల 30 జరిగిన దాడుల్లో పండు తరపున పాల్గొన్నాడు. అతడే పండుకు గంజాయి గురువు అని ప్రచారం జరుగుతోంది. దాడుల అనంతరం సందీప్‌ చనిపోవడం, పోలీసుల గాలింపు తీవ్రమవడంతో అతడు పరారీలో ఉన్నాడు. ఇది కాకుండా మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు మేకతోటి కిరణ్‌కుమార్‌, రఘనందన్‌రావు సందీప్‌ తరపున వచ్చారు. వీడియోలు, సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా వారిని పోలీసులు గుర్తించారు.


సైబర్‌ ల్యాబ్‌లో వీడియోల విశ్లేషణ

‘వాడి పని అయిపోయింది రండి’... తోట వారి వీధిలో గ్యాంగ్‌వార్‌ జరిగిన తర్వాత తోట సందీప్‌కుమార్‌ అన్న మాటలివి. కేసును సాధారణ పద్ధతిలోనూ, సాంకేతిక విధానంలోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు వివిధ వీడియోలను సైబర్‌ ల్యాబ్‌లో విశ్లేషించి సందీప్‌ అన్న మాటలను విన్నారు. పండుతో తాడోపేడో తేల్చుకోవడానికి అనుచరగణంతోపాటు భారీగా ఆయధాలను సందీప్‌ తీసుకెళ్లాడు. అతడి చేతిలో పెద్ద కత్తి వీడియోల్లో కనిపిస్తోంది. గ్రౌండ్‌లో మాటలతో మొదలైన యుద్ధంలో ఎవరు ఎవరిపై రాళ్లు రువ్వుకున్నారో.. ఏ వర్గం ఎవరు కత్తులు తిప్పారో స్పష్టంగా కనిపించడం లేదు. ఈ ఫుటేజీలను పూర్తిస్థాయిలో విశ్లేషించి వివరాలను సేకరిస్తున్నారు. సందీప్‌ గ్యాంగ్‌ కత్తులు, ఇనుప రాడ్లతో వస్తే, పండు గ్యాంగ్‌ కారం, కత్తులు, బ్లేడ్‌లు, మడత బ్లేడ్‌లు, రాడ్లతో వచ్చింది. మొత్తం సీన్‌ అంతా రెండు నిమిషాల్లో పూర్తయిపోయింది. 


పండును కిరణ్‌కుమార్‌ అనే వ్యక్తి రాడ్‌తో రెండుసార్లు కొట్టడం, అదే సమయంలో తాను దాడి చేయడంతో ఇక అతడు పైకి లేచే పరిస్థితి లేదనుకున్నాడు సందీప్‌. ‘ఇక వాడి (పండు) పని అయిపోయింది రండి..’ అని తన మనుషులను సందీప్‌ పిలిచాడు. అప్పటికే అతడు రక్తపు గాయాలతో ఉన్నాడు. ఈ మొత్తం వీడియోలను విశ్లేషించిన పోలీసులు పెనమలూరు మండలం కానూరు సనత్‌నగర్‌కు చెందిన రేపల్లె ప్రశాంత్‌, బూరి భాస్కరరావు అలియాస్‌ బాషా, యనమలకుదురు గ్రామానికి చెందిన ఆకుల రవితేజ అలియాస్‌ బుల్లి, ఓరుగంటి దుర్గాప్రసాద్‌, ఓరుగంటి అజయ్‌, విజయవాడ పటమట శివశంకర్‌నగర్‌కు చెందిన పందా ప్రేమ్‌కుమార్‌, పందా ప్రభుకుమార్‌, రామలింగేశ్వరనగర్‌కు చెందిన బాణావత్‌ శ్రీను నాయక్‌, పటమట చిన్నవంతెన ప్రాంతానికి చెందిన లంకలపల్లి వెంకటేష్‌ అలియాస్‌ ఖైనీ, పటమట తోటవారి వీధికి చెందిన ప్రతాప సాయు ప్రవీణ్‌కుమార్‌, యర్రా తిరుపతిరావు, శాంతినగర్‌కు చెందిన పొన్నాడ సాయి అలియాస్‌ గాలి సాయి, సిర్రా సంతోష్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి కొబ్బరిబొండాల కత్తి, పొడవు కత్తి, స్నాప్‌కట్టర్‌, కోడి కత్తి, ఐదు ఇనుప రాడ్లు, ఆరు మడత బ్లేడ్‌లు, నాలుగు బ్లేడ్‌లు, మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 


కాగా పండుకు మానసిక స్థితి బాగోలేదని తల్లి పద్మ ఒక ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించిందిన దానిపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసు కమిషనర్‌ చెప్పారు. చిన్నతనంలో పండు చాలా అమాయకంగా ఉండేవాడని, ఇతర పిల్లల కంటే మెదడు ఎదుగుదలలో వెనుకబడి ఉండేవాడని మాత్రం తేలిందన్నారు. 



ఇక ఆపేయండి : సీపీ ద్వారకాతిరుమలరావు

రౌడీషీటర్లు ఇక మీ కార్యకలాపాలను ఆపేయాలి. కొంతమంది షీట్‌ లేదు కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇది కుదరదు. పద్ధతి మార్చుకోవాల్సిందే. లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో వాతావరణం చెడగొట్టొద్దు. గ్యాంగ్‌లుగా తిరిగినా, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే నగర బహిష్కరణ చేస్తాం. 



ఇవి కూడా చదవండి:

---------------------------

బెజవాడ గ్యాంగ్‌వార్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన సందీప్ భార్య!


బెజవాడ ‘గ్యాంగ్‌వార్‌లో.. తవ్వేకొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి..


పోలీసుల విచారణలో.. పండు గురించి కొత్తకొత్త విషయాలు వెలుగులోకి..


పిన్న వయసులోనే పెద్ద చరిత్రలు


గ్యాంగ్‌వార్‌!


Updated Date - 2020-06-06T08:52:48+05:30 IST