వూగీ వూగీ
పిల్లలు వొదిలేసి వెళ్లిపోయిన
వూయల లాగా
ఒక్కోసారి
వాక్యం ఎంతకీ కుదరదు.
నిద్రవొస్తే
నిద్రలో కలలొస్తే
కలలో అమ్మను చూడొచ్చు
అని ఆశపడి
ఎంత బలవంతంగా కళ్లుమూసుకున్నా
ఎంతకీ నిద్ర రానే రానట్టు
ఒక్కోసారి
వాక్యం ఎంతకీ కుదరదు.
అప్పుడే పుట్టిన
పక్షిపిల్లలు
ఆకాశానికి
ఆకలిబాణాలు ఎక్కుపెట్టినట్టు
ఎర్రెర్రని సూర్యోదయపు
నోళ్లను తెరచి
ఎంత అరచిగీపెట్టినా
ముక్కున మేతతో
తల్లి పక్షి ఎంతకీ రానట్టు
ఒక్కోసారి
వాక్యం ఎంతకీ కుదరదు.
వాక్యం అంటే
కవి విశ్రమించే అంపశయ్యకదా
ఒక్కోసారి పక్కకుదరనట్టు
వాక్యమూ ఎంతకీ కుదరదు.
నిద్దట్లో ఏడుస్తున్న పిల్లాడి నోటికి
తల్లి నిద్దట్లోనే స్తన్యాన్ని అందించగానే
మోగుతున్న గడియారం అలారాన్ని ఆపినట్టు
ఏడుపునూ ఆపేసినప్పుడూ....
కొట్టుకుని కొట్టుకుని
ఏ రెండోజాము దాటిన తర్వాత
మాగన్నుగా నిద్రపట్టినట్టు
ఎప్పుడో ఒకప్పటికి
ఎలాగో ఓలాగా
ఒక వాక్యం కుదురుతుంది.
అప్పుడు
వాకిట్లో లేని చెట్టునుండి
ఒకటే పారిజాతపు పూల వాన.
శిఖామణి
98482 02526