Abn logo
Apr 12 2021 @ 00:31AM

ఇంద్రియ జాలం

1

పాట ఖాళీ చేసిన ప్రాంగణం కాబోలు.

బుక్కాసాయిబొచ్చి నిప్పుల మీద సాంబ్రాణి చల్లి

వెళ్ళిపోయినట్లుంది.

తరంగాల లయ; ఉంగరాల పొగ

నాసికారంథ్రాలలో ప్రాణవాయువు ఊదేవాడు

దేవుడే కానవసరం లేదు;

గాయకుడూ కావచ్చు; నాయకుడూ కావచ్చు.

దేహాలకు చలనాన్నిచ్చేది 

జీవమే కానవసరంలేదు? 

రాగమో, త్యాగమో

లేక, త్యాగసహిత రాగమో, రాగభరిత త్యాగమో

ఏదైనా కావచ్చు.

బతకటం వేరు; చచ్చి బతకటం వేరు. 

జీవం వేరు; పునరుజ్జీవం వేరు

ఎండ పడితే, ముడుచుకున్న మొగ్గ వికసించటం మామూలే.

ఇదేమి వింత?

మువ్వల మోతకు

వేళ్ళు వేళ్ళుగా విడిచి, వాడిపోయిన అరచేతులు

మళ్ళీ మొగ్గల్లా ముడుచుకుని పిడికిళ్ళవుతున్నాయి.

అగరొత్తు పొగలతో 

శిశువుల పాకలకు తరుముతున్నాయి.

నన్ను నాదగ్గరకు పంపుతున్నాయి.

పసితనమే అజ్ఞాతం, బతకనేరిస్తే జ్ఞాతమే.

ఎక్కుపెట్టిన చూపుడు వేలుకు ఎవ్వడయినా ఒక్కటే.

సాహసమే సుగంధం; సామరస్యం దుర్గంధమే.

అదో పరిమళ సామ్రాజ్యం.

తోసి వెళ్ళిపోతావా?

సంపెంగ వాసనల్లో చిక్కుకుని, పువ్వు కోసం వెతుకులాడినట్లు

అడవంతా తడుముతున్నా. 

ప్రతీ కొండా, సాంబ్రాణి భరిణెలా వుంది.


2

పాటను అవనతం చేసిన స్తంభం కాబోలు.

ఆడపడచు వచ్చి దండెం మీద ఆరవేసి

వెళ్ళిపోయిన వస్త్రంలా వుంది.

చీకటి అంచూ, వెన్నెల చీరా

నీలాకాశానికి చుక్కల్ని అద్దేవాడు

చిత్రకారుడే కానవసరంలేదు.

వేలికొసన జెండా కట్టి

వీధుల్లో ఎగిరే చిందులోడూ కావచ్చు.

నిప్పుపెట్టి చువ్వల్ని నింగికి లేపే

దీపావళి మందులోడూ కావచ్చు.

లేదా,

చిందు మరిగిన మందులోడూ, మందెరిగిన చిందులోడూ కావచ్చు.

లేవటం వేరు; పడి లేవటం వేరు.

ఉత్థానం వేరు; పునరుత్థానం వేరు.

కుంకుడు పులుసు పడితే కళ్ళు ఎరుపెక్కడం మామూలే

ఇదేమి దారుణం?

అక్కడెక్కడో పడమటి సూర్యుడు పట్టుతప్పి 

సముద్రంలో పడిపోతే,

ఎప్పుడో చల్లబడి గడ్డకట్టిన మంచుముక్కలు, 

నిప్పుకణికలవుతున్నాయి.

పచ్చని పురుగుల్లోంచి పంచవన్నెల చిలుకలు పుడుతున్నాయి

తడినోట్లోంచి తీసిన అడ్డచుట్టల్లా 

మిణుగురలయి రగులుతున్నాయి.

నేటి నన్నును నిన్నటి నన్నుతో వెలిగిస్తున్నాయి.

నిద్దురే గర్భస్త స్వప్నం; మెలకువ నంగితనమే.

మబ్బులు ప్రసవిస్తేనే మెరుపులు.

వాటినలా వదిలేసి వెళ్ళిపోతావా?

ఇంద్రధనువు మీద కూర్చుని ఎనిమిదో రంగు వెతుకుతున్నా.

గొంతెత్తిన కడలి, వెండి కెరటమొకటి ఎగరేసిపోయింది.


3

పాటను ముగించిన స్వరపేటిక కాబోలు

పిట్టను వలస పంపుతూ ఏడ్చి ఏడ్చి

నిమ్మళించిన చెట్టులా ముడుచుకుంది.

కూత రాగం; తలపోత అనురాగం.

ఊపిరిని స్వరం చేసేది 

గాయమెరుగని శంఖమే కానవసరం లేదు.

డొల్లయిన కొమ్ము బూర కావచ్చు; 

ఒళ్ళు గుల్లయిన పిల్లంగోవి కావచ్చు.

లేదా

శూన్యమయిన దేహమో, దేహమయిన శూన్యమో కావచ్చు.

ఏడ్చి గుక్కపట్టటం వేరు. గుక్క విడిచి ఏడ్వటం వేరు.

నాదం వేరు; నినాదం వేరు.

పువ్వునుంచి కాయా, మోడు నుంచి చివురూ 

పుట్టటం మామూలే.

ఇదేమి న్యాయం?

ఏడుపులోంచి ఏడుపు మొలుచుకొస్తోంది.

అమ్మ దేహం కొంత ఖాళీ అవుతుంటే, నేను పుట్టుకొస్తున్నాను.

కనలేక ఆమెగొంతు చించు కుంటుంటే ,  బయిట 

పడ లేక నేను గొంతెత్తుతున్నాను.

నేను నాతో శ్రుతి కలుపుతున్నాను. 

ఒంపుకోవటమే గానం; నింపుకుంటే జ్జానమే.

బావురుమనటమే మోసిన భారానికి విముక్తి

తేలిక పడ్డ తల్లిలా నిద్రలోకి జారుకుంటావా?

‘కన్నా’ అన్న అమ్మ తొలి పిలుపుకోసం పసికూన చూస్తున్నట్లు ‘అన్నా’ అని

అంటావని చెవులు తెరుచుకుని వున్నా.

కూలిపోతూ పావురమొకటి ఫిరంగిలా మూలిగింది.


4

మిరప పండును కొరికిన కోకిల కాబోలు

నల్లబొగ్గుల కుంపటిలా రగిలిరగిలి

ఎర్రని నోరు తెరిచింది.

చుర్రుమన్న నాలుక, తుర్రుమన్న పాట.

ఘాటెక్కించేవి మిరియపు గింజలే కానవసరంలేదు

పచ్చని మామిడిముక్కల్నద్దే కారాలూ కావచ్చు;

పచ్చిగా తిట్టిపోసుకునే మమకారాలూ కావచ్చు.

లేదా, 

పిచ్చెక్కిన ప్రేమో, ప్రేమెక్కిన పిచ్చో

ఏదైనా కావచ్చు.

బతుకు మీద తీపి వేరు, తియ్యనైన బతుకు వేరు. 

కతకటం వేరు, కుతకుతలాడటం వేరు. 

గుటకవేసి గొంతు చల్లార్చుకోవటం మామూలే.

ఇదేమి చోద్యం? పొగలు కక్కే పల్లవి, 

ఆకలి కడుపులోని వెచ్చని గంజిలా 

అంచెలంచెలుగా దిగుతోంది?

కడుపునయితే చల్లారుస్తుంది కానీ, దేహాన్ని వేడెక్కిస్తోంది.

బతుకంటూ వున్నది గడిపెయ్యటానికి కాదు, రుచి చూడటానికి.

నాకి వదిలేది పానకం, నషాళాన్నంటేదే వంటకం. 

విని తరించేది కాదు, నెమరువేయించేదే తత్వం.

తినని రోజుల్లో కలసి తిన్నప్పటి జ్ఞాపకం.

పస్తుండే పడక వేశావా?

కదలని నీ పెదవులకు ఉప్పటి మేలుకొలుపు.

రాగమే మీదపడి, ఏడిస్తే రాలేవి పన్నీటిచుక్కలు కావు, కన్నీటిబొట్లే!

చప్పరించ బోయావ్‌. ఏం లాభం? 

చరిత్రకెక్కిన త్యాగాల్లా సగంలోనే ఆవిరయ్యాయి.


5

చలి మంట కాగి వెళ్ళిన పాట కాబోలు.

రాత్రి, పగళ్ళను ఒంటికి రెండు వైపులా

పులుముకున్నట్టుంది. 

వెన్ను చరిస్తే చల్లగా, వాటేసుకుంటే వెచ్చగా. 

కళ్ళ నీళ్ళల్లో కార్తీక దీపాలు వదలే వాళ్ళు

భక్తులే కానవసరం లేదు. 

కాటి కాపరులూ కావచ్చు, మంత్రసానులూ కావచ్చు.

మరణ, జననాల ఏడుపుల్లో వెలుతురున్విటానికి 

సూర్యగోళమే మండనవసరం లేదు. 

చితిమంటో, చిరుదీపమో 

లేక, చితి దీపమో, చిరు మంటో

ఏదైనా కావచ్చు. 

వెన్నెల వేరు, వేడిమి వేరు.

వెలటం వేరు, వెచ్చబరచటం వేరు. 

ఉష్ణాన్ని మింగి శీతలాన్నివ్వటంలో వింతేముంది? 

ఈ పని చందమామ కూడా చేసిపెడుతుంది.

ఈ విడ్డూరం చూడాలి.

మంచు ముక్కల్ని నిమిరి, నిప్పు కణికలుగా మారుస్తోంది. 

ఏడ్చిఏడ్చి బొంగురుపోయిన స్వరాలతో గళచాలనం చేస్తోంది.

పల్లవించటమంటేనే శిరసమెత్తటమనీ, 

చరణాలు కదలటమే చిందువెయ్యటమనీ 

చెప్పి చేతుల్లోకి తీసుకుంటోంది.

ఆమె తనువును తాకుతుంటే, తనువును మీటినట్లున్నది.

నరనరాన తాను ప్రవహించినట్లున్నది.

ఇప్పుడు నేను ఉత్త దేహాన్ని కాదు, విద్యుద్దేహాన్ని.

అందుకే కాబోలు అస్పృశ్యుణ్ణాంటారంతా.

నన్ను ముట్టుకుంటే మూర్ఛిల్లాలి, లేదా వెలిగిపోవాలి.

స్పర్శే ఆట, స్పర్శే మాట.

తాకటమొక విద్య, తొలగటమే మిథ్య.

రక్తసిక్తమైన పసిగుడ్డును చేతుల్లోకి తీసుకోవటమూ తెలుసు,

అయినవాళ్ళు దించేసిన దేహాన్ని ఎత్తి కట్టెలమీద పేర్చటమూ తెలుసు.

నాకు కాయమే గేయం.

నేనే కాదు, ఊరివెలుపల ఊపిరివున్న ప్రతీవాడూ వాగ్గేయకారుడే. 

సతీష్‌ చందర్‌

Advertisement
Advertisement
Advertisement