అంగన్‌వాడీ పోస్టుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపడతాం

ABN , First Publish Date - 2021-09-19T04:57:40+05:30 IST

ప్రభుత్వ మార్గదర్శకాలు, నియమనిబంధనలకు అనుగుణంగా జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులకు ఎంపిక ప్రక్రియను చేపడతామని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఇచ్చిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు.

అంగన్‌వాడీ పోస్టుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపడతాం

రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ ఇచ్చే మెరిట్‌ ఆధారంగానే ఎంపికలు

మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దు

కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి సూచన


సిద్దిపేట సిటీ, సెప్టెంబరు 18 : ప్రభుత్వ మార్గదర్శకాలు, నియమనిబంధనలకు అనుగుణంగా జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులకు ఎంపిక ప్రక్రియను చేపడతామని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఇచ్చిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. సిద్దిపేట జిల్లాలో 1150 అంగన్‌వాడీ సెంటర్లలోని మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్లు 22, మినీ అంగన్‌వాడీ టీచర్లు 9, ఆయాల పోస్టులు 95 ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 126 ఖాళీల భర్తీకి ఆగస్టు 24న ప్రకటన వెలువరించగా ఈ నెల 8వ తేదీ వరకు మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించారని తెలిపారు. కాగా 22 మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్ల పోస్టులకు 1,842 దరఖాస్తులు, 9 మినీ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు 124 దరఖాస్తులు, 95 ఆయా పోస్టులకు 682 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. మొత్తంగా 126 ఖాళీలకు గాను 2,648 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఈ పోస్టులకు అభ్యర్థులు కచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణులై స్థానికంగా ఉండాలని తెలిపారు. అంటే గ్రామీణ ప్రాంతంలోని వారు అదే గ్రామపంచాయతీ పరిధిలో, పట్టణ పరిధిలోని వారు అదే స్థానిక వార్డులో నివసించాలని పేర్కొన్నారు. వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని తెలియజేశారు. ముఖ్యంగా నోటిఫికేషన్‌లో ప్రకటించబడినట్లుగా సంబంధిత కుల రిజర్వేషన్‌కు చెందిన మహిళలు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ఎవరైతే తమ వివరాలను నమోదు చేసుకొని ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేశారో.. వాటిని పరిశీలించి మెరిట్‌ నమోదు చేయబడుతుందని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌ నుంచి జనరేట్‌ చేయబడిన మెరిట్‌ లిస్టు జిల్లా కలెక్టర్‌కు వచ్చిన తర్వాత, దానిలో ఉన్న దరఖాస్తుదారు ధ్రువీకరణ పత్రముల వాస్తవికతలను మాత్రమే పరిశీలిస్తామని తెలిపారు. ధ్రువీకరణ పత్రాలలోని వివరాలు వాస్తవం అని రూఢీ చేసుకున్న తరువాత నిర్ధేశిత పోస్టులకు ఎంపిక చేస్తామని తెలియజేశారు. నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థుల మెరిట్‌ను నిర్ణయిస్తారని తెలిపారు. జిల్లాలో కలెక్టర్‌కు గాని మరే ఇతర అధికారులకు ఈ మెరిట్‌లో లేని అభ్యర్థిని ఎంపిక చేసే అధికారం లేదని తెలిపారు. నిబంధనల ప్రకారం పారదర్శకంగా నియామకాలు చేపడతామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో అభ్యర్థులు దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని దరఖాస్తు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-09-19T04:57:40+05:30 IST