‘రుషికొండ’ రహస్యం!

ABN , First Publish Date - 2022-07-15T07:26:42+05:30 IST

‘రుషికొండ’ రహస్యం!

‘రుషికొండ’ రహస్యం!

చీకట్లో ఏపీ టూరిజం పాలన

రుషికొండపై తప్పుల మీద తప్పులు

ఫైళ్లన్నీ గోప్యంగా ఉంచిన వైనం

బోర్డులో పెట్టకుండానే అనుమతులు?

న్యాయసమీక్షకు వెళ్లకుండా జాగ్రత్తలు

జీఎస్టీ లేకుండానే టెండర్లు

యథేచ్ఛగా అడ్డగోలు దందా


క్షేత్రస్థాయి నుంచి ఫైల్స్‌ సర్క్యులేట్‌ అవ్వాల్సిన అవసరం లేదు. బోర్డు అనుమతుల ఊసే లేదు. రూ. పది లక్షల ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్‌ అయినా... వంద కోట్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్‌ అయినా ఏపీ టూరిజం కార్పొరేషన్‌ (ఏపీటీడీసీ)లో అంతా రహస్యమే.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఏపీ టూరిజం కార్పొరేషన్‌ (ఏపీటీడీసీ)లో పాలన మొత్తం చీకట్లోనే నడుస్తోంది. పేరుకు మాత్రమే సెవెన్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణం... తెరవెనుక మరొక బాగోతం నడుస్తోంది. డిజైన్లు కూడా సెవెన్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి సంబంధించినవి కాదని సమాచారం. అవి ప్రముఖులకు నివాసయోగ్యంగా ఉండేలా సిద్ధం చేశారు. అసలు అక్కడ జరుగుతున్న పనులు పర్యాటకుల కోసమా? లేదా ప్రభుత్వం వ్యక్తిగతంగా ఉపయోగించుకునేందుకా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రుషికొండ అభివృద్ధి పనులకు సంబంధించి ఫైల్స్‌ ఎలా ఆమోదం పొందాయో కూడా ఎవరికీ తెలియదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అంతా అధికారుల స్థాయిలోనే ఈ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చేశాయి. టెండర్‌ ప్రక్రియ కూడా జరిగిపోయింది. రుషికొండ ప్రాజెక్టు వ్యవహారం మొత్తాన్ని అత్యంత రహస్యంగా చేసేశారు. ఏపీటీడీసీలో నలుగురు అధికారులు, ఇద్దరు కన్సల్టెంట్లు, ఇద్దరు సీఎంవో అధికారుల మధ్యలోనే ఫైల్స్‌ సర్క్యులేట్‌ ఆయ్యాయి. రుషికొండ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ అంశాన్ని ప్రస్తావించినా మొత్తం అవకతవకలు, అక్రమాలే కనిపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద తలపెట్టిన సెవెన్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి సంబంధించి.. ఫేజ్‌ - 1లో అనుమతులకు మించి తవ్వకాలు జరిపేశారు. తవ్విన మట్టిని అమ్ముకుని కోట్ల రూపాయిలు జేబుల్లో వేసుకొన్నారు. ఇది చాలదు అన్నట్టు అమ్ముకున్న మట్టిని తరలించినందుకు రూ.82 కోట్లు బిల్లుల పాస్‌ చేసుకున్నారు. అసలు టెండర్‌ ప్రక్రియ సమయంలోనే ఆధికారుల కక్కుర్తి బయటపడింది. 


సమీక్షకు పోకుండా భలే ఎత్తు

ఏపీటీడీసీలో చిన్న ప్రాజెక్టు ప్రారంభించినా బోర్డు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. రుషికొండ ప్రాజెక్టు విషయంలో బోర్డు అనుమతులు తీసుకున్నారా? అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఫేజ్‌ - 1 లో భాగంగా భవనాలు తొలగించడం, మట్టిని చదును చేయడం, కొత్త భవనాల నిర్మాణాలకు పిల్లర్లు నిర్మించడం వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి రూ.92 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఏపీటీడీసీ అధికారులు పంపించిన అంచనాలకు యథాతథంగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాజెక్టు విలువ రూ.100 కోట్లు దాటితే న్యాయసమీక్షకు పంపాలి. సమీక్షకు వెళితే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయడంతో పాటు టెండర్‌ డాక్యుమెంట్‌లో ఇబ్బందులుంటే మార్పులు చేస్తారు. దీంతో ఏపీటీడీసీ అదికారులు కొత్త ఎత్తు వేశారు. ప్రాజెక్టును రెండు ముక్కలు చేసి ఫేజ్‌ - 1, ఫేజ్‌ - 2గా విభజించారు. దీని వల్ల రూ.164 కోట్ల విలువైన ప్రాజెక్టు కాస్తా రూ.92 కోట్లు - రూ.72 కోట్లుగా విభజించారు. దీంతో న్యాయ సమీక్షకు పంపాల్సిన అవసరం లేకుండా పోయింది. మొత్తం రుషికొండ రహస్యాన్ని బయటక పొక్కనీయకుండా ఏపీటీడీసీ అధికారులు వేసిన స్కెచ్‌ ఇది. 


జీఎస్టీ కలపకుండా టెండర్లు...

ప్రాజెక్టు విలువ రూ.100 కోట్లు దాటకుండా అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ అధికారులు చేసిన ప్రయత్నం మొత్తం వృథా అయింది. ఫేజ్‌ - 1 పనులు ఎంత తగ్గించినా వంద కోట్లు దాటుతున్నాయి. కారణం రూ.92 కోట్లు ఫేజ్‌ -1 ప్రాజెక్టు విలువకు ఆదనంగా 18 శాతం జీఎ్‌సటీ కలపాల్సి ఉంటుంది. ఫేజ్‌ -1 ప్రాజెక్టు విలువ, జీఎస్టీ కలిపితే మొత్తం ఖర్చు రూ.108.56 కోట్లు అవుతుంది. దీని నుంచీ బయటపడడానికి ఇంకో ఎత్తు వేశారు. ఈ క్రమంలో జీఎస్టీ కలపకుండానే టెండర్లు పిలిచారని చెబుతున్నారు. మరోవైపు రుషికొండ ప్రాజెక్టు విషయమై ఏపీటీడీసీ అధికారులు వేసిన అంచనాలు అనూహ్యంగా పెరిగాయి. ఫేజ్‌ -1, ఫేజ్‌ -2 రెండు అంచనాలు రెండింతలు అయ్యాయి. ఫేజ్‌-1 కు సంబంధించి రూ.92 కోట్ల నుంచి రూ.175 కోట్లకు పెరిగింది. ఫేజ్‌ - 2 కూడా దాదాపు రూ.150 కోట్ల వరకూ పెరిగింది. అంచనాలు పెరిగిన సమయంలోనైనా న్యాయసమీక్షకు వెళ్లాలన్న ఆలోచన అధికారులకు రాలేదు. మిగిలిన చాలా శాఖల్లో ముందు అంచనాలు, తర్వాత అంచనాలకు వ్యత్యాసం ఉండే, అది రూ.100 కోట్లకు పెరిగితే టెండర్లు రద్దు చేసిన దాఖలాలు ఉన్నాయి. మిగిలిన శాఖలు  న్యాయసమీక్ష విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నాయి. రుషికొండ ప్రాజెక్ట విషయలో మాత్రం నిబంధనలు మొత్తం తుంగలో తొక్కారు. అడ్డగోలు వ్యవహారాలు చేస్తూ... కోట్ల రూపాయిల అక్రమాలకు తెరలేపారని ఏపీ టూరిజం వర్గాలే చెబుతున్నాయి.  

Updated Date - 2022-07-15T07:26:42+05:30 IST