రాజధాని రహస్యం!?

ABN , First Publish Date - 2021-06-19T08:10:01+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది? ఇది... చైతన్య కుమార్‌ రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద కేంద్రాన్ని అడిగిన ప్రశ్న! బహుశా...

రాజధాని రహస్యం!?

‘సమాచారం’ లేదన్న కేంద్రం.. అమరావతికి చేసిన సాయం సున్నా

గుంటూరు, విజయవాడకు వెయ్యి కోట్లు.. ఆర్టీఐ ప్రశ్నకు జవాబు


న్యూఢిల్లీ జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది? ఇది... చైతన్య కుమార్‌ రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద కేంద్రాన్ని అడిగిన ప్రశ్న! బహుశా... ‘అమరావతి’ అని కేంద్రం జవాబు చెప్పి ఉంటుందని అనుకుంటున్నారా!? కానే కాదు! ‘మీరు అడిగిన విషయం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 2(ఎఫ్‌)లో పేర్కొన్న నిర్వచనం కిందికి రాదు’ అని కేంద్రం జవాబు చెప్పింది. అంటే... ఏపీ రాజధానికి సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి సమాచారమూ లేదట! ఇక... ‘ఇప్పుడు రాష్ట్రం ప్రతిపాదించిన మూడు రాజధానులకు మీ ఆమోదం ఉందా?’ అని అడిగిన ప్రశ్నకూ కేంద్రం ఇదే సమాధానం చెప్పిందని చైతన్య రెడ్డి తెలిపారు. ‘‘రాజధాని గురించి, రాజధానికి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి కేంద్రం ఏం చెబుతుందో తెలుసుకుందామని ఈ ప్రశ్నలు అడిగాను. కానీ... విచిత్రంగా, రాజధాని ఏదో తెలియదని కేంద్రం సమాధానం చెప్పింది’’ అని పేర్కొన్నారు. ఇక... అచ్చంగా అమరావతి నిర్మాణానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తేలింది. ‘అమరావతి నిర్మాణానికి కేంద్రం ఎంత సహాయం చేసింది?’ అని చైతన్య రెడ్డి ప్రధాని కార్యాలయాన్ని ఆర్టీఐ చట్టం కింద ప్రశ్నించారు. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమాధానం ఇచ్చింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని ప్రాంతంలో రెండు ప్రాజెక్టులకోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెయ్యి కోట్లు ఇచ్చింది. వీటిని... విజయవాడ నగరంలో వరదనీటి నిర్వహణ, గుంటూరు నగరంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి కోసం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని కోసం ఇంతకు మించి ఎలాంటి నిధులూ ఇవ్వలేదు. ప్రతిపాదనలూ మా శాఖ వద్ద పెండింగ్‌లో లేవు’’ అని శుక్రవారం సమాధానం ఇచ్చింది. 


ఒకవైపు ‘కొత్త రాజధాని పరిధిలోని నగరాలుగా గుంటూరు, విజయవాడ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇచ్చాం’ అంటూనే... ఇంకోవైపు, ‘రాజధాని ఏదో చెప్పలేం’ అని మరో ప్రశ్నకు బదులివ్వడం గమనార్హం. కేంద్రం వైఖరిపై చైతన్య రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ‘‘2015 మార్చి 31వ తేదీన అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య చొరవతో గుంటూరు, విజయవాడ నగరాలకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చారు. అమరావతికి కేంద్రం ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం సొంత డబ్బుతోనే అమరావతిలో భవనాలు నిర్మించింది. రహదారులు వేసింది. కానీ... గతంలో కేంద్రం అమరావతికి రూ.7వేల కోట్లు ఇచ్చామని పార్లమెంటులోనే అవాస్తవాలు చెప్పారు’’ అని చైతన్య రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-06-19T08:10:01+05:30 IST