7309 మందికే రెండవ డోసు

ABN , First Publish Date - 2021-05-14T06:01:09+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు వేసుకోవాల్సిన లబ్ధిదారులు జిల్లాలో అధికంగా ఉన్నప్పటికీ ఆ మేరకు వ్యాక్సిన్‌ వేయడం లేదు.

7309 మందికే రెండవ డోసు
విజయపురంలో వ్యాక్సినేషన్‌

 తక్కువ మొత్తంలో టీకా టోకెన్ల పంపిణీ

 157నుంచి 75కు తగ్గించిన కేంద్రాల సంఖ్య


ఇక నుంచి రెండో డోసు వారికే వ్యాక్సిన్‌ వేస్తాం. ఈ నెలాఖరులోగా 1.22 లక్షల మందికి రెండో డోసు వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంది. వారందరికీ సీనియారిటీ ప్రకారం టోకెన్లను పంపిణీ చేసి ఆయా కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేస్తాం..... ఇటీవల ప్రెస్‌ మీట్‌లో కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్న మాటలివి.

 ఈ నెలలో 18 రోజులు మిగిలి ఉన్నాయి. నేడు రంజాన్‌ సెలవు. ఇలాంటి సెలవులు మరో నాలుగు ఉన్నాయి. అంటే 13 రోజులు మిగిలి ఉంటాయి. 12, 13 తేదీల్లో దాదాపు 7వేల మందికి వ్యాక్సిన్‌ వేశారు. అంటే రోజుకు సగటున 3.5 వేల మందికి వేస్తున్నారు. ఇలాగే వేస్తే 13 రోజులకుగానూ 45 వేల మందికి మాత్రమే వేయగలరు. అర్హులు అధికంగా ఉన్నా.. టోకెన్లు తక్కువగా పంపిణీ చేస్తున్నారు. ఇలా అయితే లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం.


కొవాగ్జిన్‌ తొలి డోసు వేసుకున్నవారు ఆందోళన పడొద్దు. గడువులోగా రెండో డోసును కూడా ఇస్తాం.... కలెక్టర్‌ హరినారాయణన్‌

 మార్చి నెలాఖరులో, ఏప్రిల్‌ మొదటి వారంలో చాలామంది కొవాగ్జిన్‌ తొలి డోసు వేసుకున్నారు. వీరిలో తిరుపతి ఉప ఎన్నిక విధుల్లో పాల్గొన్న టీచర్లూ ఉన్నారు. ప్రస్తుతం ఆరు వారాల గడువు పూర్తయినా రెండో డోసు అందలేదు. ఇంకా రెండు వారాలుంది కదా అని అధికారులంటున్నారు. అప్పటికైనా అందిస్తారా లేదా అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.


చిత్తూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు వేసుకోవాల్సిన లబ్ధిదారులు జిల్లాలో అధికంగా ఉన్నప్పటికీ ఆ మేరకు వ్యాక్సిన్‌ వేయడం లేదు. టోకెన్లను చాలా తక్కువగా పంపిణీ చేస్తున్నారు. టోకెన్లు పొందినవారిలో కొందరు అవగాహన లేక, మరికొందరు స్థానికంగా అందుబాటులో లేక వ్యాక్సిన్‌ కేంద్రానికి రావడం లేదు. ఫలితంగా అనుకున్న లక్ష్యం చేరడం లేదు. బుధవారం 2792 మందికి, గురువారం 4517 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ప్రతి కేంద్రంలో వందకు పైగా డోసులు మిగిలిపోయాయి. జిల్లావ్యాప్తంగా ఇంకా 16,691 వ్యాక్సిన్‌ డోసులు ఉన్నాయి. వ్యాక్సిన్ల పంపిణీలో జిల్లా యంత్రాగానికి కార్యాచరణ ప్రణాళిక లేకపోవడంపై పెద్దఎత్తున లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటివరకు జిల్లాలో 7.12 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు. తొలి డోసు 5.23 లక్షల మందికి, రెండో డోసును గురువారంతో కలిపి సుమారు 1.89 లక్షల మందికి ఇచ్చారు. ఈనెలాఖరులోగా ఇంకా 1.15 లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించాల్సి ఉంది. అసలే వ్యాక్సిన్లు జిల్లాకు అరకొరగా వస్తున్నాయి. వచ్చినవాటినీ వెంటవెంటనే లబ్ధిదారులకు అందించడంలో యంత్రాంగం విఫలమవుతూ వస్తోంది. జూన్‌ 1 నుంచి తొలి డోసు వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

-తిరుచానూరు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రంలో ఆరువారాల కిందట వ్యాక్సిన్‌ వేసుకున్న 150 మందికి కొవిషీల్డ్‌ వేశారు. 35 రోజుల కింద తొలి డోసు వేసుకున్నవారు వచ్చినా.. ఐదు రోజుల తర్వాత రావాలని వెనక్కి పంపించేశారు. దీంతో ఇక్కడ 150 డోసులు మిగిలిపోయాయి.

- కలికిరిలో నలుగురికి మాత్రమే రెండో డోసు వేశారు. ఒక్కో వైల్‌లో 10 డోసులుంటాయి కాబట్టి మిగతా ఆరు డోసులు వృథాగా మారిపోయాయి. ఇక్కడ సీనియారిటీ పేరుతో ఆరు డోసులను వృథా చేశారు.

- శ్రీకాళహస్తిలో 600 డోసులున్నా.. సీనియారిటీ పేరుతో 113 మందికే వ్యాక్సిన్‌ వేశారు. ఎర్రావారిపాలెం పీహెచ్‌సీలో 340 డోసులున్నా.. 22 మందికి, తొట్టంబేడులో 22 డోసులున్నా.. 44 మందికి, గుడుపల్లెలో 300 డోసులున్నా.. 25 మందికి, పలమనేరులో 570 డోసులున్నా.. 50 మందికి, పీలేరులో 340 డోసులున్నా.. 82 మందికి టోకెన్లను ఇచ్చి వ్యాక్సిన్‌ వేశారు.

- చంద్రగిరిలో 200 మందికి రెండో డోసు వేయాల్సి ఉండగా.. 70 మందికి, తిరుపతి రూరల్‌లో 450 మంది అర్హులుండగా.. 150 మందికే టీకా వేశారు. తవణంపల్లెలో 2350 మంది అర్హులుండగా.. 200 డోసులు మాత్రమే పీహెచ్‌సీలో అందుబాటులో ఉన్నాయి.

- పుంగనూరు, ఐరాల వంటి చాలా మండలాల్లో లబ్ధిదారులు ఫోన్‌ ఎత్తడం లేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నా.. లబ్ధిదారులు రాకపోవడంతో వేయలేకపోయామని వారంటున్నారు. బుధవారం వ్యాక్సిన్‌ వేసిన మదనపల్లె, పెద్దమండ్యం వంటి మండలాల్లో గురువారం వ్యాక్సినేషన్‌ ఆపేశారు. ఆయా ప్రాంతాల్లో శుక్రవారం వేయడానికి గురువారం టోకెన్లను పంపిణీ చేసినట్లు తెలిసింది.

Updated Date - 2021-05-14T06:01:09+05:30 IST