బొగ్గుబావుల్లో కాంట్రాక్టు కార్మికుల ఘోష

ABN , First Publish Date - 2020-06-04T09:40:05+05:30 IST

సింగరేణి బొగ్గుబావుల్లో కాంట్రాక్టు కార్మికుల ఘోష ఇంత అంత కాదు. రామగుండం-3 డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-1లో జరిగిన ప్రమాదంలో నలుగురు కాంట్రాక్టు కార్మికులు మరణించిన సంఘటన మొత్తం

బొగ్గుబావుల్లో కాంట్రాక్టు కార్మికుల ఘోష

రక్షణ అంతంతే

కనీస వేతనాలూ కరువు

  

(ఆంధ్రజ్యోతి-మంచిర్యాల) 

సింగరేణి బొగ్గుబావుల్లో కాంట్రాక్టు కార్మికుల ఘోష ఇంత అంత కాదు.  రామగుండం-3 డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-1లో జరిగిన ప్రమాదంలో నలుగురు కాంట్రాక్టు కార్మికులు మరణించిన సంఘటన మొత్తం కాంట్రాక్టు కార్మికుల పని పరిస్థితులు ఎలా ఉన్నాయో స్పష్టం అవుతోంది. ఒక్కసారి కాంట్రాక్టు కార్మికుల గురించి పరిశీలిస్తే.. 1995 వరకు దేశంలోని బొగ్గుబావుల్లో మొత్తం పర్మినెంట్‌ కార్మికులు 9.5 లక్షల మంది పనిచేసే వారు. ఇందులో సింగరేణికి సంబంధించి లక్షా 16 వేల మంది ఉండేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య సింగరేణిలో 46 వేలకు పడిపోగా 26 వేల మంది పైచిలుకు కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. మరోవైపు కోల్‌ ఇండియా లో కార్మికుల సంఖ్య 3 లక్షల 16 వేల వరకు ఉండగా లక్షా 70 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.


ఇందులో 70 వేల పైచిలుకు కాంట్రాక్టు కార్మికులకు మాత్రమే ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్‌) సౌకర్యం ఉంది. కాంట్రాక్టర్లు కార్మికుల వేతనాల నుంచి పీఎఫ్‌ కోసం అటు పెన్షన్‌ కోసం కోత విధించే దానికి సమానంగా కాంట్రాక్టర్లు తమ వాటాను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులోనూ సగం మంది మాత్రమే ఈ చెల్లింపులు చేస్తున్నారు. ఇందులో సగం మందికి మాత్రమే కనీస వేతనాలు లభిస్తున్నాయి. కోల్‌ ఇండియాలో నాలుగు సంవత్సరాల క్రితమే కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్‌ కార్మికులకు ఇచ్చే ప్రారంభ ఒకటో కేటగిరి వేతనం ఇవ్వాలని నిర్ణయం జరిగినా ఇది అమలు కావడం లేదు.


సింగరేణిలోనూ దీనిని అమలు చేయాలని కార్మిక సంఘాలు చాలా సందర్భాల్లో ఆందోళనలు నిర్వహించినప్పటికీ అవి అమలు కాలేదు. అయితే ఎక్కువ శాతం కాంట్రాక్టు కార్మికలు పనిచేస్తున్న ఓపెన్‌కాస్ట్‌ గనుల కాంట్రాక్టర్లను పిలిపించి కాస్తో, కూస్తో కంటి తుడుపు వేతనాలను పెంచి వదిలేస్తున్నారు. సింగరేణితో పాటు దేశంలోని ఓపెన్‌కా స్ట్‌ గనుల్లో ఓవర్‌బర్డెన్‌ (మట్టి) తొలగించే పనులను కాంట్రాక్టు కార్మికులే చేస్తున్నారు. గుత్తేదార్ల వద్ద పనిచేసే వేలాది మంది కార్మికులు మైనింగ్‌ బ్లాస్టింగ్‌లలోనూ పనిచేస్తున్నారు. 


మైనింగ్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే..

వాస్తవానికి బ్లాస్టింగ్‌, కోల్‌కట్టింగ్‌ విభాగంలో నిపుణులైన వారు, మైనింగ్‌ సర్టిఫికేట్‌ ఉన్నవారు మాత్రమే పనిచేయాలి. పనుల వద్ద సేఫ్టీ ఆఫీసర్‌ కూడా పర్యవేక్షణలో ఉండాలి. ఇవేమీ లేకుండానే కాంట్రాక్టు కార్మికులతో డ్రిల్స్‌ చేయించడం, అందులో మందుగుండు సామగ్రిని నింపే పనిచేయించడం జరుగుతోంది. మంగళవారం రామగుండం-3 డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-1లో బ్లాస్టింగ్‌ వల్ల జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వాస్తవానికి వీరు చేస్తున్న పని వారు చేసేది కాదు. ఇది పూర్తిగా మైనింగ్‌ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్‌ వారితో పనిచేయించాడు. 150 ఎంఎం డయాలో హోల్స్‌ చేస్తారు. అందులో మందుగుండు సామగ్రిని రోకలిబండ సైజ్‌లో ఉండే కర్రతో లోడ్‌ చేస్తారు. ఒత్తిడి జరగడం వల్ల లోపల డెటోనేటర్‌ పేలింది.


ఇలాంటి ప్రమాదం జరగడం అరుదు అయినప్పటికీ అక్కడ పనిచేయాల్సింది కాంట్రాక్టు కార్మికులు కాదు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూడా సింగరేణి అధికారులు కారణాలను వెతకడంలోనే కాలం వెళ్లదీస్తున్నారు. డెటోనేటర్‌ మ్యాన్యుఫ్యాక్చర్‌ ఫెయిల్యూర్‌ కూడా కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ కార్మికుడు ఒకరు మాట్లాడుతూ, తాము మందు గుండు సామగ్రి పంపింగ్‌ చేస్తున్నపుడు పేలుడు సంభవించిందని చెప్పాడు. మామూలుగా సెన్సిటివ్‌గా డెటోనేటర్‌ ఉంటుంది.


కానీ ఇది హై సెన్సిటివ్‌ కావడం వల్ల పేలిందని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ అనుమానమైనా నివృత్తి కావాలంటే అక్కడ పనిచేసిన వారు నిపుణులై మైనింగ్‌ సర్టిఫికేట్‌ హోల్డర్‌లై ఉంటే తెలుస్తుంది. సహజంగా బొగ్గుకు కొంత రాపిడి జరిగినా మండే గుణం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పనులు చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టు కార్మికులతో జాగ్రత్తగా పనులు చేయించిన, చేయిస్తున్న దాఖలాలు బొగ్గుబావుల్లో తక్కువేనని పై ప్రమాదం స్పష్టం చేస్తోంది. కాంట్రాక్టు కార్మికుల ప్రాణాలకు అసలు విలువే లేదు. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా గుత్తేదారు ప్రమాద స్థలానికి రాకపోవడం మరీ దారుణమైన విషయం. 


ఈ సంత్సరంలో 8 మంది..

ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎనిమిది మంది కాంట్రాక్టు కార్మికులు సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ బొగ్గుబావుల్లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోయారు. రామగుండం-3 ఏరియాలోని ఏఎల్‌పీ ప్రాంతంలో ఏప్రిల్‌ 30న బొగ్గు నిక్షేపాల కోసం అన్వేషణ చేస్తున్న సందర్భంలో డ్రిల్లింగ్‌ యంత్రంపై నుంచి కింద పడి కోడూరి స్వామి మరణించాడు. అంతకుముందు జనవరి 24న రామకృష్ణాపూర్‌  ఓపెన్‌కాస్ట్‌లో డంపర్‌ను వ్యాన్‌ ఢీకొనడంతో దుర్గం స్వామి అనే కాంట్రాక్టు కార్మికుడు మరణించాడు. ఇదే  సంవత్సరం ఏప్రిల్‌ 5న ఓవర్‌బర్డెన్‌ లోడ్‌లో ఆగివున్న వోల్వో డంపర్‌ను మరో డంపర్‌ ఢీకొనడంతో మదన్మోహన్‌ అనే కాంట్రాక్టు డ్రైవర్‌ మరణించాడు. మంగళవారం గోదావరిఖనిలోని బ్లాస్టింగ్‌లో నలుగురు కార్మికులు మరణించారు. ఓపెన్‌కాస్ట్‌ బొగ్గుబావుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 


అటు కోల్‌ ఇండియాలోనూ కాంట్రాక్టు కార్మికులు విధి నిర్వహణలో ప్రమాదాలకు గురై మరణిస్తూనే ఉన్నారు. ఒక్కసారి 2015 నుంచి 2019 డిసెంబరు వరకు సింగరేణి బొగ్గుబావుల్లో జరిగిన మొత్తం ప్రమాదాలను పరిశీలిస్తే ఐదేండ్లలో 43 ప్రాణాంతక ప్రమాదాలు జరగగా, 46 మంది కార్మికులు మరణించారు. మొత్తం 1,008 సీరియస్‌ ప్రమాదాలు జరుగగా, ఇందులో 1,058 మంది కార్మికులు గాయాలపాలయ్యారు. ఇందులో పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. 


ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన..

దేశంలో కార్మిక చట్టాలను పూర్తిగా హరించే విధంగా కేంద్రం ఒక వైపు ప్రయత్నాలు చేస్తోంది. కొత్త బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటీకరించాడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇందులో పనిచేసేవారంతా కాంట్రాక్టు కార్మికులే ఉంటారు. వారి జీత భత్యాలు, జీవితాలు ఎలా ఉంటాయో ఊహించుకోలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాల నాయకుల ప్రయత్నాలు ఏ మేరకు విజయవంతం అవుతాయో వేచి చూడాల్సిందే. 


Updated Date - 2020-06-04T09:40:05+05:30 IST