కొలువు పిలుస్తోంది.. పరీక్ష పరేషాన్‌ చేస్తోంది

ABN , First Publish Date - 2022-05-18T08:31:37+05:30 IST

There was no schedule at JNTUH

కొలువు పిలుస్తోంది.. పరీక్ష పరేషాన్‌ చేస్తోంది

  • పూర్తికాని డిగ్రీ చివరి సంవత్సర ఎగ్జామ్స్‌ఓయూలో నిర్వహణపై ఇంకా అస్పష్టత!
  • జేఎన్‌టీయూహెచ్‌లో షెడ్యూలే రాలేదు
  • అంబేడ్కర్‌, ఓయూ డిస్టెన్స్‌లో జూన్‌లోనే
  • ఎస్‌ఐ, గ్రూప్‌-1లకు డిగ్రీ ఉత్తీర్ణత అర్హత
  • డిగ్రీ చివరి సంవత్సర విద్యార్థులో బెంగ
  • పూర్తికాని డిగ్రీ చివరి సంవత్సర ఎగ్జామ్స్‌.. 
  • ఓయూలో నిర్వహణపై ఇంకా అస్పష్టత!


హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ ఓయూ దూరవిద్యలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నాడు. ఎస్‌ఐ కావాలనేది అతడి ప్రయత్నం. ఇటీవల నోటిఫికేషన్‌ రావడంతో సంబరపడ్డాడు. కానీ, అందులో ఈ ఏడాది జూలై 1 వరకు డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని పేర్కొన్నారు. కానిస్టేబుల్‌.. డిగ్రీ ఎగ్జామ్స్‌ మేలో జరుగుతాయని జూన్‌లో ఫలితాలు వస్తాయని భావించాడు. అయితే, ఇటీవల ఓయూ దూర విద్య విభాగం పరీక్షల షెడ్యూల్‌ను సవరిస్తూ.. మే 26 నుంచి జూన్‌ 25 మధ్యలో నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జూలై 1 లోపు ఫలితాలు విడుదల చేస్తారా? లేదా? అనే ఆందోళన ఆ కానిస్టేబుల్‌లో నెలకొంది.


మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన గజేందర్‌ ఇంటర్‌ వరకు ఇంగ్లిష్‌ మీడియంలో చదివాడు. పోలీసు ఉద్యోగం చేయాలనేది కల. కుటుంబ ఆర్థిక పరిస్థితులతో హైదరాబాద్‌ వచ్చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ చదువుతున్నాడు.  చివరి సంవత్సరం చివరి సెమిస్టర్‌ పరీక్షలు రాయాల్సి ఉంది. ఎస్‌ఐ నోటిఫికేషన్‌ రావడంతో ఉద్యోగం మానేసి.. ప్రిపరేషన్‌లో ఉన్నాడు.  ఉద్యోగం సాధిస్తాననే ధీమా ఉన్నప్పటికీ, పరీక్షల ఫలితాలు సకాలంలో వస్తాయా? లేదా? అని బెంగ పెట్టుకున్నాడు.


దూరవిద్యలో డిగ్రీ చదువుతున్న వీరిద్దరే కాదు.. ఓయూ పరిధిలో రెగ్యులర్‌ డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థులు, జేఎన్‌టీయూ పరిధిలో బీటెక్‌, బీ ఫార్మసీ ఫైనలియర్‌ పైనల్‌ సెమిస్టర్‌ చదవుతున్న లక్షలాది మంది విద్యార్థులదీ ఇదే పరిస్థితి. 80 వేలపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటిచిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కోటిగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఈ సందర్భంలో డిగ్రీ అర్హతను నిర్దేశించడంతో పాటు ఎప్పటిలోగా పూర్తి చేసి ఉండాలనే నిబంధన విధిస్తున్నారు. ఇప్పటికే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ప్రకటించిన తేదీ నాటికి డిగ్రీ పాసైనవారు అర్హులని పేర్కొన్నారు. ఎస్‌ఐ నోటిఫికేషన్‌లో.. జూలై 1 లోపు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అయితే, సకాలంలో తరగతులు జరగక, పరీక్షలు ఆలస్యమై  విలువైన అవకాశాన్ని కోల్పోతున్నామని డిగ్రీ చివరి సంవత్సర విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ కాలేజీల వారి నుంచి పరీక్షలు వెంటనే నిర్వహించాలని విజ్ఞప్తులు చేసినట్లు తెలిసింది.


ఇంటర్‌ అర్హత పోస్టులకు దరఖాస్తు

ఓయూ, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో డిగ్రీ, బీటెక్‌, బీఫార్మసీ ఎగ్జామ్స్‌ సాధారణంగా మార్చి, ఏప్రిల్‌ నెలలో పూర్తవుతాయి. మే చివరి లేదా, జూన్‌ మొదటివారంలో ఫలితాలు వస్తుంటాయి. కొవిడ్‌తో రెండేళ్లుగా అకడమిక్‌ ఇయర్‌ పూర్తిగా దెబ్బతిన్నది. పరీక్షలు సకాలంలో పూర్తవడం లేదు. గతేడాది డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబర్‌, అక్టోబరులో పూర్తవగా, ఈ ఏడాది ఎప్పటిలోగా నిర్వహిస్తారో.. ఫలితాలు ఎప్పుడో స్పష్టత లేదు. ఓయూలో రెగ్యులర్‌ డిగ్రీ చివరి సెమిస్టర్‌ విద్యార్థులు 60 వేల మంది ఉంటారని అంచనా.! వీరంతా.. పరీక్షలు పూర్తవక నిరుత్సాహం చెందుతున్నారు. ఇంటర్‌ అర్హత ఉన్న కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తుల్లో వేలాది మంది డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థులవే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.


ఉన్నత విద్యామండలి ఆదేశాలు బేఖాతరు

డిగ్రీ, బీటెక్‌, బీ ఫార్మసీ చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు జూన్‌లోనే చివరి సెమిస్టర్‌ పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. కానీ జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో బీటెక్‌, బీఫార్మసీ చివరి సంవత్సరం విద్యార్థులకు చివరి సెమిస్టర్‌ పరీక్షలు జూన్‌లోనా..? జూలైలో నిర్వహిస్తారా.? అనేది తేల్చలేదు. ఓయూ పరిధిలో జూన్‌లో పరీక్షలకు అవకాశం లేదని, జూలై, ఆగస్టులోనే నిర్వహణ, ఫలితాలు వెల్లడిస్తామని వర్సిటీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిజాం కాలేజీ డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు జూన్‌ ఒకటో తేదీ నుంచి జరుగనున్నాయి. వచ్చే ఏడాది నుంచి మహిళా వర్సిటీగా మారుతున్న కోఠి ఉమెన్స్‌ కాలేజీ, సిటీ కాలేజీలో కూడా చివరి సెమిస్టర్‌ పరీక్షలపై స్పష్టత లేదు.


అంబేడ్కర్‌ వర్సిటీ పరీక్షలకు మరో ఇబ్బంది

ఉద్యోగ నోటిఫికేషన్లకు అర్హత కోల్పోతామనే అందోళన అంబేడ్కర్‌, ఓయూ దూరవిద్య డిగ్రీ చివరి సెమిస్టర్‌ అభ్యర్థుల్లోనే అధికంగా ఉంది. పనులు చేసుకుంటూ వీరంతా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీరిలో వివాహితలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఓయూ దూరవిద్యలో జూన్‌ 25వ తేదీ వరకు ఎగ్జామ్స్‌ పూర్తి చేయడానికి షెడ్యూల్‌ వచ్చింది. ఫలితాలు ఎప్పుడనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో జూన్‌ చివరి వారంలో డిగ్రీ ఆఖరి సెమిస్టర్‌ పరీక్షలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ వర్సిటీ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 185 సెంటర్లు ఉన్నాయి. వీటిల్లో రెగ్యులర్‌ డిగ్రీ ఎగ్జామ్స్‌ పూర్తయితేనే దూరవిద్య వారికి నిర్వహించే వీలుంటుంది. కానీ రెగ్యులర్‌ డిగ్రీ పరీక్షలకు ఇప్పటికీ నోటిఫికేషన్‌ రాకపోవడం గమనార్హం

సకాలంలో పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల.. డిగ్రీ అయిపోగానే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే విద్యార్థుల కల కలగానే మిగిలిపోతోంది. ఏప్రిల్‌, మేలో పూర్తికావాల్సిన పరీక్షలకు జూన్‌ వచ్చేదాక కూడా షెడ్యూల్‌ విడుదల చేయలేదు. ప్రస్తుత నోటిఫికేషన్లలో డిగ్రీ చివరి సంవత్సర విద్యార్థులకు అవకాశం కల్పించాలి. అందుకనుగుణంగా వర్సిటీలు, కాలేజీలు పరీక్షలు నిర్వహించాలి.

-ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ నగర అధ్యక్షుడు అచ్చిని లెనిన్‌


Updated Date - 2022-05-18T08:31:37+05:30 IST