చెప్పులు అరిగిపోయాయ్‌

ABN , First Publish Date - 2022-05-22T06:16:04+05:30 IST

ఎనిమిది నెలల క్రితం మా పొలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు.

చెప్పులు అరిగిపోయాయ్‌
ట్రాన్స్‌ఫార్మర్‌ ఇవ్వలేదని ఎమ్మెల్యేను నిలదీస్తున్న రైతు మాణిక్యరెడ్డి

  1. ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు
  2. మీతో కాదంటే చెప్పండి నేనే కొనుక్కుంటా
  3. ఎమ్మెల్యే సాయిని నిలదీసిన రైతు
  4. బైచిగేరిలో అడుగడుగునా ప్రశ్నించిన రైతులు

ఆదోని రూరల్‌, మే 21: ‘ఎనిమిది నెలల క్రితం మా పొలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ కింద నావి నాలుగు బోర్లు ఉన్నాయి. వీటి కింద  ఏడెకరాల భూమి సాగు చేసుకుంటున్నా. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని మీ చుట్టూ, విద్యుత్‌ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి నాలుగు జతల చెప్పులు అరిగిపోయాయే కానీ ట్రాన్స్‌ఫార్మర్‌ మాత్రం రాలేదు. దీంతో గత ఏడాది రూ.6లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఈ ఏడాది వర్షంపై ఆధారపడి దాదాపు రూ.2 లక్షలు ఖర్చు చేసి పత్తి వేశాను. ఇప్పటికైనా ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించండి. లేకపోతే మాతో కాదని చెప్పండి. నేనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించుకుంటాను’ అని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ అధికారులను రైతు మాణిక్యరెడ్డి నిలదీశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం శనివారం బైచిగేరి గ్రామంలో నిర్వహించారు. దీనిలో అడుగడుగునా ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు.


ప్లాట్‌ లేదు ... పట్టా లేదు 

‘మేము పక్కా వైఎస్సార్‌ పార్టీ వాళ్లం. మాకు అన్ని అర్హతలున్నా ప్లాట్‌  ఇవ్వలేదు... మాకున్న సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటామంటే కూడా పట్టా ఇవ్వలేదు. నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెందాం. పట్టా ఇవ్వకున్నా అప్పు చేసి ఇల్లు నిర్మించుకుంటున్నాం. మన ప్రభుత్వం వచ్చినా ప్రయోజనం మాత్రం లేదు’ అని మొలగవల్లి లక్ష్మి  ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితోపాటు రెవెన్యూ, హౌసింగ్‌ అధికారులను నిలదీసింది. 


ఈ దారిలో ఎవరైనా నడవగలరా..?

‘రెడ్డీ.. మీరు చూస్తున్న ఈ దారిలో మీరు కాదు కదా ఇక్కడ ఉన్నవారు ఎవరైనా నడవగలరా...?  ఈ వీధిలో నివాసం ఉం టున్న పది కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని ఎలా మోసుకెళ్లాలి రెడ్డీ? ఈ మధ్య కాలంలో మా అమ్మ రాములమ్మ చనిపోతే ఇక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎన్ని అవస్థలు పడ్డామో ఊరంతా చూసింది. మరో దారిలో శ్మశాన వాటికకు తరలిద్దామంటే ఆ దారిలో ఉన్న వారంతా అడ్డు చెబుతున్నారు. గత్యంతరం లేక మీరు చూస్తున్న ఈ మురుగు కాల్వ ద్వారానే మా అమ్మ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించాం.  అయినా అధికారులు,  నాయకులు  పట్టించుకోలేదు’ అని బైచిగేరి కి చెందిన సరస్వ తి అనే మహిళ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని నిలదీసింది. ‘అధికారులు, సర్పంచులకు ఈ రోడ్డు వేయాలని అడిగీ...అడిగీ... మేమే  ముసలివాళ్లమ య్యామ’ని జయమ్మ, శ్రీదేవిలు వాపోయారు.


మా కాలనీకి తాగునీళ్లు లేవు 

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారులకు ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బైచిగేరిలో బీసీ కాలనీకి వెళ్లిన వీరిని మహిళలు చుట్టుముట్టారు. కొన్నేళ్లుగా తమ కాలనీకి తాగునీరు కాదు కదా ఉప్పు నీరు కూడా అందడం లేదని... నీటి కోసం గ్రామ మధ్యలో ఉన్న శివాలయం వద్దకు వెళ్లాలని... కనీసం తమకు తాగునీరందేలా చూడండి రెడ్డీ అంటూ  నాగమ్మ, అనిత, మహేశ్వరి, నాగరాజులు ఎమ్మెల్యేను నిలదీశారు. 


రోడ్లు.. కాల్వలు లేవు

మీరు నడుస్తున్నది కాల్వలో కాదని... ప్రధాన రహదారిలో అని, ఇలాంటి రోడ్లపై ఎలా నడవాలో చెప్పాలని ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. ఎక్కడ చూసినా రోడ్లపై డ్రైనేజీ ప్రవహిస్తున్నదని స్థానికులు నాగమ్మ, క్షావమ్మ, చంద్రమ్మ, అనితమ్మ, సుదర్శన్‌, అశోక్‌లు అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని ఆనందమ్మ అనే మహిళ వారితో మొరపెట్టుకుంది. వీటన్నింటికి సమాధానంగా ‘మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామ’ని చెబుతూ అక్కడి నుంచి ఎమ్మెల్యే బయలుదేరిపోయారు.

Updated Date - 2022-05-22T06:16:04+05:30 IST