పొంచి ఉన్న ఇసుక సంక్షోభం

ABN , First Publish Date - 2020-06-05T09:33:07+05:30 IST

రాష్ట్రంలో అత్యధికంగా నిర్మాణ రంగం విస్తరించిన విశాఖపట్నం జిల్లాలో ఇసుకకు కొరత ఏర్పడింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో ..

పొంచి ఉన్న ఇసుక సంక్షోభం

వర్షాకాలంలో మరిన్ని ఇబ్బందులు తప్పవా?

డిసెంబరు వరకూ ఆరు లక్షల టన్నులు అవసరం

ప్రస్తుతం ఉన్నది లక్ష టన్నులు

అదీ నగర పరిధిలోని యార్డుల్లోనే

రీచ్‌ల నుంచి గ్రామీణ జిల్లాలోని

యార్డులకు ఇసుక సరఫరాలో అధికారులు విఫలం

అరకొర వచ్చినా ప్రభుత్వ పనులకే సరఫరా

సామాన్యులకు అందని వైనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అత్యధికంగా నిర్మాణ రంగం విస్తరించిన విశాఖపట్నం జిల్లాలో ఇసుకకు కొరత ఏర్పడింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో నిలిచిపోయిన నిర్మాణాలు తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే...సరిపడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడే ఇలా వుంటే...రానున్న వర్షాకాలంలో ఎలా వుంటుందోనని బిల్డర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది ఇసుక కోసం పడిన కష్టాలను గుర్తుచేస్తున్నారు. 


జిల్లాకు నెలకు 30 నుంచి 40 వేల టన్నుల ఇసుక అవసరమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటినుంచి డిసెంబరు వరకు జిల్లాకు ఆరు లక్షల టన్నుల ఇసుక అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతానికి ముడసర్లోవ, అగనంపూడి యార్డుల్లో లక్ష టన్నుల ఇసుక ఉందంటున్నారు. అయితే వర్షాకాలం ప్రారంభమైతే.. డిసెంబరు వరకు గోదావరి, వంశధార, నాగావళి నుంచి ఇసుక సరఫరా నిలిచిపోతుంది. గట్టిగా వర్షాలు ప్రారంభమయ్యేలోపు మిగిలిన ఇసుక విశాఖపట్నం రావాలంటే రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు వందల లారీలను వినియోగించాలి. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో వందల లారీల లభ్యతపై సందిగ్ధత నెలకొంది. 


జిల్లాలో ముడసర్లోవ, అగనంపూడి, నక్కపల్లి, అనకాపల్లి, అచ్యుతాపురం, నర్సీపట్నం, చోడవరం, భీమిలిలో ఇసుక యార్డులు ఉన్నాయి. యార్డులకు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి ఇసుక సరఫరా జరుగుతుంది. అయితే విశాఖపట్నంలో ముడసర్లోవ, అగనంపూడికి ఇసుక సరఫరాకు లారీ యజమానులు, డ్రైవర్లు మొగ్గు చూపుతున్నారు. రాజమండ్రి నుంచి ఇసుక రవాణాకు కి.మీ.కు రూ.3.30లు చెల్లిస్తున్నారు.ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం లారీ యజమానులు విశాఖ నుంచి గోదావరి వద్ద ఏర్పాటుచేసిన రీచ్‌కు లారీ తీసుకువెళ్లి ఇసుక తీసుకురావాలి. కానీ విజయవాడ, రాజమండ్రి నుంచి విశాఖ వైపు వచ్చే ఖాళీ లారీలను గుర్తించి ఇసుక సరఫరా చేస్తున్నారు.


ఇంకా విశాఖ నుంచి కాకినాడకు బొగ్గు లోడుతో వెళ్లిన లారీలు తిరుగు ప్రయాణంలో ఇసుక తీసుకువస్తున్నాయి. అయితే అంతా విశాఖ నగరంలో గల ముడసర్లోవ, అగనంపూడి యార్డులకు రవాణా చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. నక్కపల్లి, నర్సీపట్నం, చోడవరానికి ఇసుక రవాణా వల్ల గిట్టుబాటు కాదంటున్నారు. జిల్లాలోని యార్డుల్లో ఇసుక లేకపోవడానికి ఇదే కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో లారీ యజమానులతో అధికారులు పక్కాగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రూరల్‌లోని యార్డులకు అరకొరగా వస్తున్న ఇసుకను నాడు-నేడు పనులకు తప్ప ప్రైవేటు నిర్మాణాలకు సరఫరా చేయకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోతే రానున్న రోజుల్లో ఇసుక కోసం ప్రజలు మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


కాగా గత ఏడాది అనుభవంతో తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమై ఇప్పటికే భారీగా ఇసుక నిల్వ చేసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు 13 లక్షల టన్నులు ఇసుక నిల్వ చేయగా వర్షాకాలంలోగా మరో 11 లక్షల టన్నుల నిల్వకు ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో విశాఖకు ఇసుక సరఫరాలో తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఈ రెండు జిల్లాల అధికారులకున్న ముందుచూపు విశాఖ అధికారులకు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2020-06-05T09:33:07+05:30 IST