సాధించాల్సింది అదే!

ABN , First Publish Date - 2021-10-08T05:59:54+05:30 IST

జీవితంలో ఏదైనా సాధించడం గురించి చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మనం ఏది కావాలనుకుంటున్నామో...

సాధించాల్సింది అదే!

జీవితంలో ఏదైనా సాధించడం గురించి చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మనం ఏది కావాలనుకుంటున్నామో... దానిపై మనసును కేంద్రీకరించడం ద్వారా జీవితంలో కొన్ని సాధించవచ్చు. అయితే... ‘సాధించడం’ అనే మాటకు మనం చెప్పుకుంటున్న నిర్వచనాన్ని మార్చుకోవాలి. మీరు కోరుకున్నది మీకు దక్కినంత మాత్రాన మీరు ఏదో సాధించినట్టు కాదు. మనిషి తన స్వభావాన్ని వ్యక్తపరచుకోవడానికి అదో చిన్న ప్రయత్నం మాత్రమే. ఈ వైఖరి మారాలన్నది నా ఉద్దేశం. 


ఒక ఆటో రిక్షా డైవ్రర్‌ ముగ్గురిని తీసుకు వెళ్ళాల్సిన ఆటోలో పదిమందిని తీసుకువెళ్తాడు. అలాగే ఒక ఎత్తైన కొండ మీదికి ఆటోను తీసుకువెళ్ళగలుగుతాడు. వీటిని అతను విజయంగా భావిస్తాడు. ఆటో ఆపి, టీ తాగి... దాన్ని ఒక ఉత్సవంలా చేసుకుంటాడు. ఇది వ్యక్తిగతమైన సంతృప్తి, ఆర్థికమైన లాభం రీత్యా ఉపయోగకరమే. కానీ ఇది గొప్ప విజయమో, తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన, చూసి తీరాల్సిన విషయమో కాదు. అదో చిన్న కోరిక. దాన్ని అనేక విధాలుగా తీర్చుకోవచ్చు. ఇలాంటివి ప్రజల్లో కొందరికి గొప్ప విషయాలుగా కనిపించడానికి కారణం... వారు లక్ష్యాలను ఒక మూస పద్ధతిలో ఏర్పరచుకోవడమే.


మీరు లక్ష్యం మీద ఒక కన్ను ఉంచితే... ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం దారి వెతుక్కోవడానికి ఒక్క కన్నే ఉంటుందని యోగాలో చెబుతాం. ఒంటి కన్నుతో వెతుకులాడిన వ్యక్తి తన ఇంటిని కనుక్కోవడం ఒక గొప్ప పని అనుకుంటాడు. కానీ, రెండు కళ్ళతో చక్కగా చూసే మనిషికి ఇందులో గొప్పతనం కనిపించదు. అతను తన ఇంటిని తేలిగ్గా కనుక్కోగలడు కాబట్టి. 


మన సామర్థ్యాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే ప్రయత్నాలేవీ చెయ్యకుండా... మనం చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటున్నాం. తక్కువ సామర్థ్యం ఉన్న చిన్న యంత్రంతో... చిన్న చిన్న లక్ష్యాలను సాధించి... ఘనకార్యాలు సాధించినట్టు భావిస్తున్నాం. కానీ తనను తాను మరింత శక్తిమంతమైన యంత్రంగా మనిషి మార్చుకుంటే... పెద్ద శ్రమ పడకుండానే లక్ష్యాన్ని చేరుకోగలం. మనిషి దృష్టి కేంద్రీకరించాల్సిన విషయం ఇదే! అంతేకాని, ‘నేను ఎలా మారాలి?’, ‘నా దగ్గర ఏం ఉండాలి?’ అని కాదు... ‘ఈ జీవితాన్ని ఎలా ఉన్నతీకరించుకోవాలి?’ అనేది మీ లక్ష్యం కావాలి. ‘నాకు అలాంటి ఉద్యోగం కావాలి’, ‘నేను ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించాలి’, ‘పొరుగున ఉన్న ఆ అందమైన అమ్మాయిని పెళ్ళాడాలి’ లాంటి ఆలోచనలకే పరిమితం కావద్దు. జీవితాన్ని ఇప్పటి కన్నా శక్తిమంతమైన, సమర్థమైన స్థానానికి తీసుకువెళ్తే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనాలే పొందుతారు. 


అన్నిటికన్నా ముఖ్యమైన సంగతేమిటంటే, మీ జీవన ప్రమాణం మీరు జీవితంలో సమకూర్చుకున్న వాటి మీద ఆధారపడదు. దాన్ని మీ అంతర్గత చోదక శక్తి నిర్ణయిస్తుంది. మీరు కూర్చుకున్న వస్తువులు, ఏర్పాట్లు సామాజికంగా గొప్పవి కావచ్చు. కానీ మీ జీవితానికీ, మీ అస్తిత్వానికీ సంబంధించి వాటికి ఎలాంటి విలువా లేదు. కాబట్టి చిల్లర కోరికలను ‘భవిష్యత్‌ దృష్టి’ అని చెప్పకండి. ‘నేనో కొత్త మోడల్‌ కారు కొనుక్కోవాలనుకున్నాను... కొనుక్కున్నాను’ అని చెప్పడం విశేషం కాదు. ఎందుకంటే వడ్డీ లేకుండానో, తక్కువ వడ్డీతోనో రుణాలు దొరుకుతున్నాయి. పదేళ్ళలో ఆ డబ్బు ఎలాగో వాళ్ళు మీ నుంచి వసూలు చేసుకుంటారు. కాబట్టి అందులో విశేషమేదీ లేదు. మీ పొరుగువారు మిమ్మల్ని కారులో చూసి అసూయ పడితే మీకు ఆనందం. కానీ వాళ్ళకు మీ కారుకన్నా పెద్ద కార్లు ఉంటే... మళ్ళీ మీకు దిగులే! అదే... మీరు మానవీయమైన చైతన్యాన్ని పెంచుకోగలిగితే... నగరంలో ఉన్నా, కొండ మీద ఉన్నా, ఒంటరిగా ఉన్నా, సమూహంలో ఉన్నా... అన్నీ మీకు అద్భుతంగానే ఉంటాయి. మీరు కోరుకోవాల్సిందీ, సాధించాలని అనుకోవాల్సిందీ అదే!

సద్గురు జగ్గీవాసుదేవ్‌ఝ

Updated Date - 2021-10-08T05:59:54+05:30 IST