Abn logo
Oct 27 2021 @ 23:06PM

ఒకటే టెన్షన

సర్వేలు, ఇంటి కొలతలతో గ్రామాల్లో అలజడి

రెవెన్యూ, గృహ నిర్మాణ అధికారుల హల్‌చల్‌

 వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ నోటీసుల జారీకి సిద్ధం

 పెదవి విరుస్తున్న లబ్ధిదారులు

 అంతటా ఇదే చర్చ 

 ప్రభుత్వ తీరుపై విమర్శలు


‘గతంలో మీకు గృహ నిర్మాణ శాఖ ఇల్లు మంజూరు చేసింది. ప్రభుత్వం నుంచి రుణం తీసుకున్నారు. ఇప్పుడు ఏక మొత్తంలో చెల్లిస్తే రాయితీ అందిస్తాం. శాశ్వత హక్కు పత్రం అందిస్తాం’ అంటూ అధికారులు నోటీసులు జారీ చేస్తుండడంతో లబ్ధిదారులు హడలెత్తిపోతున్నారు. 1983 నుంచి 2013 వరకూ వివిధ పథకాల్లో భాగంగా మంజూరైన ఇళ్లకు హౌసింగ్‌, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా కొలతలు తీస్తున్నారు. ఈ పరిణామంతో గ్రామాల్లో ఒక్కసారిగా అలజడి రేగుతోంది. 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

గృహనిర్మాణ రుణాల వసూలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ‘వనటైమ్‌ సెటిల్‌మెంట్‌’ పథకాన్ని తెరపైకి తెచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో మంజూరైన గృహనిర్మాణ పథకాలకు సంబంధించి రుణాలు ఒకేసారి చెలించేలా పథకాన్ని రూపొందించారు. గృహనిర్మాణ శాఖ తయారు చేసిన లబ్ధిదారుల జాబితాల ప్రకారం రెవెన్యూ, సచివాలయ సిబ్బంది గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. అప్పట్లో మంజూరైన ఇళ్లకు కొలతలు తీస్తున్నారు. 1983 నుంచి ఇళ్ల నిర్మాణాల గ్రాంటు తీసుకుని పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయని 3.40 లక్షల మందిని గుర్తించారు. వారికి సంబంధించిన ఇళ్లను సర్వే చేస్తున్నారు. లబ్ధిదారుని నుంచి కనిష్టంగా రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.40 వేలు వసూలు చేసేందుకు నిర్ణయించారు. ఓటీఎస్‌ చెల్లించిన వారికే ఇళ్లు సొంతమని గ్రామ, వార్డు వలంటీర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. 

గందరగోళం 

వనటైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకంపై గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 30 సంవత్సరాల కిందట మంజూరైన ఇళ్లు చాలా వరకూ చేతులు మారిపోయాయి. కుటుంబ అవసరాల కోసం చాలామంది విక్రయించారు. ఆ సమయంలో రిజిస్ర్టేషన్‌ చేసుకోలేదు. గ్రామపెద్దల సమక్షంలో స్వాధీన పత్రాలు రాసుకున్నారు. ఆ ఇళ్లపై పాత లబ్ధిదారులకు ఎటువంటి హక్కు లేదు. కానీ ప్రభుత్వ జాబితాలో మాత్రం పాత లబ్ధిదారుల పేర్లే ఉన్నాయి. అటువంటి వారికి నోటీసులు అందిస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. ‘మీరు కట్టాలి అంటే మీరు కట్టాలి’ అని క్రయ విక్రయదారుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గృహ నిర్మాణ పథకంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జిల్లాకు భారీగా ఇళ్లు మంజూరయ్యాయి. చోటా నాయకులే బినామీ పేర్లతో ఇళ్లు దక్కించుకున్నారు. కొందరు పేదలు, సామాన్యుల పేరిట ఇళ్లు మంజూరు చేయించుకున్నారు. అటువంటి వారి పేర్లు జాబితాలో కనిపిస్తుండడంతో గ్రామాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీ నాయకుల మెడకు చుట్టుకుంటోంది. ప్రభుత్వ అస్పష్ట విధానంపై వారిలో కూడా అసంతృప్తి నెలకొంటోంది. 

కేటగిరీల వారీగా..

కేటగిరి ఎ : గృహనిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకొని ఉంటే వారి వారసుల పేరుమీద పట్టా ఇస్తారు. ఇందుకుగాను గ్రామాల్లో రూ.10 వేలు, మునిసిపాల్టీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ల లో రూ.20 వేలు వసూలు చేస్తారు.

 కేటగిరి బి: ఒక వేళ రుణం తీసుకొని ఇంటిని విక్రయించి.. ఇతరుల చేతిలో ఉంటే గ్రామాల్లో  రూ.20 వేలు, మునిసిపాల్టీల్లో రూ.30 వేలు, కార్పొరేషన్లలో రూ.40 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 

కేటగిరి సి: రుణం తీసుకోకుండా ఉంటే వారసులకు శాశ్వత హక్కు పట్టా అందిస్తారు. ఇందుకు రూ.10 వేలు చెల్లించాలి. 


గత ప్రభుత్వాల హయాంలో ఇలా.. 

టీడీపీ ప్రభుత్వం 1983లో అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. పక్కా ఇంటి నిర్మాణానికి రూ.6 వేలు కేటాయించారు. 1988లో దానిని రూ.8 వేలకు పెంచారు. 1994లో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ ఇంటి యూనిట్‌ ధరను రూ.12,000కు పెంచారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత రూ.17,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2004లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ‘ఇందిరమ్మ’ పేరుతో రూ.28,500 కేటాయించారు. రాజీవ్‌ గృహకల్ప కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇంటికి రూ.90,000 యూనిట్‌ ధరగా ప్రకటించారు. 2011లో ఇందిరమ్మ ఇంటి యూనిట్‌ ధరను రూ.45,000కు పెంచారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు యూనిట్‌ ధరను రూ.1.80 లక్షలకు పెంచారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనిట్‌ ధర రూ.30 వేలకు తగ్గించింది.

సర్వే చేస్తున్నాం

1983 నుంచి ఇళ్ల నిర్మాణాల గ్రాంటు తీసుకుని పూర్తిస్థాయిలో చెల్లింపులు చేయని 3.40 లక్షల మందిని గుర్తించాం. ఇందుకు సంబంధించిన జాబితాలను ఎంపీడీఓలకు, మున్సిపాలిటీల్లో కమిషనర్‌లకు పంపించాం. ప్రస్తుతం సచివాలయ స్థాయిలో సర్వే జరుగుతోంది. సిబ్బంది లబ్ధిదారుల వద్దకు వెళ్లి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ గురించి వివరంగా తెలియజేస్తున్నారు. 

- కూర్మినాయుడు, పీడీ, గృహ నిర్మాణ శాఖ