ధాన్యంపై అదే లొల్లి!

ABN , First Publish Date - 2022-07-16T08:44:10+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ధాన్యం పంచాయితీ ఎంతకీ తెగడంలేదు. యాసంగి సాగు సీజన్‌ ఆరంభంలో మొదలైన ఉప్పుడు బియ్యం

ధాన్యంపై అదే లొల్లి!

  • కేంద్రం, రాష్ట్రం మధ్య యుద్ధ వాతావరణం
  • బీజేపీ, టీఆర్‌ఎస్‌ పరస్పర ఆరోపణలు 
  • నిలిచిపోయిన సీఎంఆర్‌ సేకరణ
  • కేంద్రంపై రైస్‌ మిల్లర్ల విమర్శలు  
  • 10 లక్షల టన్నుల ధాన్యం అమ్మడానికి సీఎంవోకు ప్రతిపాదనలు


హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ధాన్యం పంచాయితీ ఎంతకీ తెగడంలేదు. యాసంగి సాగు సీజన్‌ ఆరంభంలో మొదలైన ఉప్పుడు బియ్యం, ముడి బియ్యం వివాదానికి తెరపడి అంతా సవ్యంగా సాగిపోతుందని భావిస్తున్న తరుణంలో మరో కొత్త వివాదం తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలు ఉచిత బియ్యం పంపిణీ చేయకపోవటం, కేంద్ర ప్రభుత్వం కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) సేకరణ నిలిపివేయడం మరోసారి రాజకీయ రంగు పులుముకుంటోంది. బియ్యం ఎందుకు తీసుకోవటంలేదని రాష్ట్ర మంత్రులు ఓవైపు కేంద్రాన్ని నిలదీస్తుండటం, మరోవైపు రైస్‌ మిల్లర్లు కూడా సేకరణ ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తుండటంతో వాతావరణం మరింత వేడెక్కింది. అయితే రెండు, మూడు రోజుల్లో సీఎంఆర్‌కు అనుమతి వస్తుందని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు. గడిచిన మూడు సీజన్లకు సంబంధించి 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రాష్ట్రంలో నిల్వ ఉన్న విషయం తెలిసిందే. దీనిని మిల్లింగ్‌ చేస్తే సుమారు 63 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతాయి. వీటిని భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ) ప్రొక్యూర్మెంట్‌ చేయాల్సి ఉంది. అయుతే ఫిజికల్‌ వెరిఫికేషన్‌లో ధాన్యం బస్తాలు మాయమమైనట్లు తేలడం, గోనెసంచుల ఆడిట్‌ సమర్పించకపోవడం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని రెండు నెలలు పంపిణీ చేయకపోవడంతో.. జూన్‌ 7వ తేదీన బియ్యం సేకరణను కేంద్రం నిలిపివేసింది. సీఎంఆర్‌ నిలిచిపోయి ఐదు వారాలు దాటిపోవడంతో.. రాష్ట్రంలో ధాన్యం నిల్వలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయి. ఆరు బయట ఉన్న ధాన్యం వానలకు తడిసిపోతోంది.


బండి సంజయ్‌ విజ్ఞప్తితో..

వారం క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ చొరవ తీసుకొని.. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. దీంతో బియ్యం సేకరణకు పీయూష్‌ గోయల్‌ సానుకూలత వ్యక్తంచేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయని భావించారు. తెలంగాణ రైస్‌ మిల్లర్ల సంఘం ప్రతినిధులు ఓ అడుగు ముందుకేసి.. పీయూష్‌ గోయల్‌కు, బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటన కూడా చేశారు. అయితే ప్రతికూల పరిస్థితుల్లో 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం క్లెయిమ్‌ చేసుకుంటోందనే అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్లో ఏర్పడింది. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ మళ్లీ కేంద్రం వైఖరిపై విమర్శలు చేశారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులూ విమర్శలు గుప్పిస్తున్నారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కూడా... కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం తెలంగాణ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ నేతలు కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. అయితే వారం క్రితం కేంద్ర ప్రభుత్వానికి సానుకూల ప్రకటన చేసిన రైస్‌మిల్లర్లు.. తాజాగా కేంద్రంపై విమర్శలు గుప్పించటం వెనక రాజకీయ కోణం దాగి ఉందన్న చర్చ జరుగుతోంది. కాగా, సీఎంఆర్‌ అనుమతులు ఇవ్వటంలో జాప్యం జరిగినప్పటికీ.. అనుమతులు మాత్రం పక్కాగా వస్తాయనే ధీమా బీజేపీ ఎంపీల్లో ఉంది. ఈ మేరకు కేంద్రం నుంచి సంకేతాలున్నాయని, అనుమతి ఉత్తర్వులు కూడా రెడీ అయ్యాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల టన్నుల ధాన్యాన్ని ఈ- టెండర్లు పిలిచి విక్రయించాలని నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ప్రొక్యూర్మెంట్‌ మేనేజర్‌ రాజిరెడ్డి ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్‌తో సమావేశమై చర్చించారు. ప్రతిపాదనలు రూపొందించి సీఎంవోకు పంపించారు.


కేంద్రానివి అనాలోచిత నిర్ణయాలు!

ఇండస్ట్రీని సంక్షోభంలోకి నెడుతున్నారు

రైస్‌ మిల్లర్ల సంఘం నేతలు తూడి దేవేందర్‌రెడ్డి, నాగేందర్‌ విమర్శలు

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో గత రెండేళ్లుగా రాష్ట్రంలో రైతులు, రైస్‌ మిల్లర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దక్షిణ భారత రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 42 రోజులుగా బియ్యం సేకరణ నిలిచిపోయిందని, మిల్లులన్నీ మూత పడ్డాయని, ధాన్యం తడవటంతో కోట్లాది రూపాయలు మిల్లర్లు నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. బియ్యం ేసకరణను రాజకీయ సమస్యగా చూడటం శోచనీయమన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ర్టాలపై అణచివేతకు పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తక్షణమే మిల్లర్ల దగ్గర సీఎంఆర్‌ను ఎఫ్‌సీఐ తీసుకొనేట్లు చేసి రైస్‌ ఇండస్ర్టీని ఆదుకోవాలని తెలంగాణ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంపా నాగేందర్‌ విజ్ఞప్తి చేశారు. 42 రోజులుగా ేసకరణ నిలిపివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,500 కోట్ల విలువైన 10 లక్షల టన్నుల ధాన్యం తడిసిముద్దయిందని తెలిపారు. 

Updated Date - 2022-07-16T08:44:10+05:30 IST