ప్రాజెక్టుల అప్పగింతపై పాత పాటే

ABN , First Publish Date - 2022-07-01T09:10:25+05:30 IST

గెజిట్‌లో షెడ్యూల్‌-2లోని 11 ప్రాజెక్టులను అప్పగించాలని కోరుతూ జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) ఉప కమిటీ సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది.

ప్రాజెక్టుల అప్పగింతపై పాత పాటే

పెద్దవాగు ఒక్కటే ఇస్తాం: తెలంగాణ

 గెజిట్‌లో షెడ్యూల్‌-2లోని 11 ప్రాజెక్టులను అప్పగించాలని కోరుతూ జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) ఉప కమిటీ సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ప్రాజెక్టుల అప్పగింతపై తెలుగు రాష్ట్రాలు పాత పాట వినిపించాయి.  గోదావరిలో ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు తప్ప.. మరే ప్రాజెక్టునూ అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ ఈ సందర్భంగా తేల్చిచెప్పింది. గురువారం బోర్డు మెంబర్‌ కన్వీనర్‌ అజగేశన్‌ నేతృత్వంలో గోదావరి బోర్డు ఉప కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ జరిగింది. ఏపీ తన పరిధిలోని తోట వెంకటాచలం ఎత్తిపోతల పథకం పంప్‌హౌ్‌స(పుష్కర్‌), తాడిపూడి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌, పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌, ధవ ళేశ్వరంలోని సర్‌ అర్థర్‌ కాటన్‌ బ్యారేజీ, వెంకటనగరం పాత-కొత్త పంప్‌హౌస్‌, సీలేరు పవర్‌ కాంప్లెక్స్‌ల అప్పగింతపై ఏపీ బోర్డుకు నోట్‌ అందిస్తూ... షెడ్యూల్‌-2లో తెలంగాణలో గోదావరిపై ఉన్న ప్రాజెక్టులన్నీ స్వాధీనం చేసుకోవాలని, అప్పుడే వాటితో పాటు ఏపీ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని ఏపీ షరతు పెట్టింది. దాంతో తెలంగాణ ప్రాజెక్టులు ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టులోని కాకతీయ క్రాస్‌ రెగ్యులేటర్‌, మేడిగడ్డ బ్యారేజీతో పాటు కన్నెపల్లి పంపింగ్‌ స్టేషన్‌, జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలోని గంగారం పంప్‌హౌస్‌, దుమ్ముగూడెం వెయిర్‌, నావిగేషన్‌ చానల్‌, లాక్స్‌ను అప్పగించాలని గోదావరి బోర్డు కోరగా... తెలంగాణ తీవ్రస్థాయిలో స్పందించింది.


తెలంగాణలో ఉన్న ఈ ప్రాజెక్టులతో ఏపీకి ఏం సంబంధం ఉందని ప్రశ్నించింది. తెలంగాణలో ఒక్కటే ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ఉందని, ఆ ప్రాజెక్టు అప్పగింతపై అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఇక సీడ్‌ మనీ కింద చెరో రూ.200 కోట్లను ఇవ్వాలని బోర్డు కోరగా... దేని కోసం నిధులు వెచ్చిస్తారో ప్రతిపాదనలు ఇస్తే పరిశీలిస్తామని ఏపీ బదులిచ్చింది. తెలంగాణ మాత్రం పెద్దవాగు నిర్వహణ కోసం సీడ్‌ మనీగా రూ.1.45 కోట్లు ఇవ్వడానికి, సిబ్బందిని సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదించింది. అదనంగా ఒక ఎ్‌సఈ, ఇద్దరు ఈఈలు, నలుగురు జేఈలు, ఇతర ఉద్యోగులను సమకూర్చడానికి తెలుగు రాష్ట్రాలు ఈ సందర్భంగా సుముఖత వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పెద్దవాగు ఆధునికీకరణకు రూ.78 కోట్లు అవుతాయని, ఆ మేరకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులను బోర్డుకు ఇస్తామని తెలంగాణ ఆఫర్‌ ఇచ్చింది.  

Updated Date - 2022-07-01T09:10:25+05:30 IST