దావోస్‌ కథ వేరయా..

ABN , First Publish Date - 2022-05-27T08:08:52+05:30 IST

దావోస్‌ కథ వేరయా..

దావోస్‌ కథ వేరయా..

అదే అరబిందో.. అదే అదానీ.. అదే గ్రీన్‌కో! 

రెండు రాష్ట్ర కంపెనీలతో ఒప్పందాలు.. ఇక్కడికే వచ్చే అదానీతో ఎంవోయూ

గ్రీన్‌ ఎనర్జీ మినహా పెట్టుబడుల్లేవు.. విస్తరణపై ఆర్సెలర్‌ మిట్టల్‌ ఒప్పందం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మూడేళ్లలో మొదటిసారి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు దావోస్‌ వెళ్లారు. కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో లండన్‌ మీదుగా స్విట్జర్లాండ్‌ చేరుకున్నారు. అక్కడికి వెళ్లి ఆయన సాధించిందేమిటి? అంటే... రాష్ట్రంలోనే ఉండే కంపెనీల ప్రతినిధులను దావో్‌సలో కలుసుకుని ఒప్పందం చేసుకోవడం! అదే అరబిందో, అదే అదానీ, అదే గ్రీన్‌కో! వీరితో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకునేందుకు... రూ.4 కోట్లదాకా ఖర్చు పెట్టి దావో్‌సదాకా వెళ్లడం ఎందుకో! పైగా... కుదిరిన ఒప్పందాలన్నీ ‘గ్రీన్‌ ఎనర్జీ’ రంగంలోనే! విపక్షంలో ఉండగా సౌర, పవన విద్యుత్తు ఒప్పందాలపై జగన్‌ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో కూడా విరుచుకుపడ్డారు. గ్రీన్‌కోతోపాటు మూడు కంపెనీల పేర్లు ప్రస్తావించి ఆరోపణలు చేశారు.  గ్రీన్‌కో సంస్థ చంద్రబాబు హయాంలోనే కర్నూలు జిల్లాలో భారీ ‘గ్రీన్‌ ఎనర్జీ’ ప్రాజెక్టును చేపట్టింది. జగన్‌ అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలలు ఈ ప్రాజెక్టు పనులు డోలాయమానంలో పడ్డాయి. ఇటీవల జగన్‌ అక్కడికి వెళ్లి ‘పంప్డ్‌ హౌస్‌’  కాంక్రీట్‌ పనులు ప్రారంభించి వచ్చారు. ఇప్పుడు దావో్‌సలో అదే సంస్థతో వేల కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి అంటూ ఒప్పందం చేసుకున్నారు. మరోవైపు అరబిందో కూడా ఇక్కడి కంపెనీనే! ఆ కంపెనీతోనూ దావో్‌సలో గ్రీన్‌ ఎనర్జీపైనే ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రీన్‌ ఎనర్జీపైనే ఒప్పందం చేసుకున్న మరో కంపెనీ అదానీ. చంద్రబాబు హయాంలో అదానీ సంస్థతో కుదిరిన ఒప్పందాన్ని జగన్‌ తిరగదోడారు. ఆ తర్వాత పెట్టుబడులను, ఉద్యోగాల సంఖ్యను కుదించి... అదానీ సంస్థతోనే మరో ఒప్పందం చేసుకున్నారు. ఇది జరిగి, స్థలం కేటాయించి రెండేళ్లు దాటినా అక్కడ పనులు ప్రారంభించలేదు. మరోవైపు... గౌతమ్‌ అదానీ పలుమార్లు స్వయంగా అమరావతికి వచ్చి జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని కృష్ణపట్నం, గంగవరం పోర్టులు చేతులు మారి అదానీ గూటిలో చేరాయి. ఇప్పుడు... అదే అదానీ సంస్థతో దావో్‌సలో, గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనే మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. వెరసి... మన దేశంలో, రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలతోనే స్విట్జర్లాండ్‌లో ఒప్పందాలు కుదర్చుకున్నారన్న మాట! మరోవైపు ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ లిమిటెడ్‌ విశాఖలోని తన ప్లాంట్‌ విస్తరణ కోసం వెయ్యికోట్ల పెట్టుబడి పెడతానంది. ఇది కూడా గతం నుంచీ ఉన్న ప్లాంటే. ఆ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు అవగాహన ఒప్పందం చేసుకుంది. 


ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు: ప్రభుత్వం ప్రకటన

సీఎం జగన్‌రెడ్డి బృందం దావోస్‌ పర్యటనతో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌కు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయని ప్రభుత్వం పేర్కొంది. గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించి రూ.1.25లక్ష కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో ఒప్పందం కుదుర్చుకున్నామంది. గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకుని ఉత్పత్తులు చేసే దిశగా మచిలీటప్నంలో ఒక సెజ్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ‘‘ప్రభుత్వం కార్యనిర్వాహక రాజ ధానిగా ఎంపిక చేసిన విశాఖపట్నానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు సీఎం గట్టి కృషి చేశారు. విశాఖపట్నాన్ని మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారు. యూనికార్న్‌ స్టార్ట్‌ప్సకూ విశాఖను వేదికగా  తీర్చిదిద్దేందుకు ప్రయత్నించారు’’ అని ప్రభుత్వం తెలిపింది.


Updated Date - 2022-05-27T08:08:52+05:30 IST