సమస్యల ‘సంత’

ABN , First Publish Date - 2021-02-26T06:26:01+05:30 IST

పట్టణంలోని మధుగిరి సర్కిల్‌ల్లో ప్రతి గురువారం జరిగే వారపు సంతలో కనీససౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సమస్యల ‘సంత’
అసౌకర్యాల నడుమ కొనసాగుతున్న వారపు సంత


 మడకశిరలో అధ్వానంగా మార్కెట్‌

 వర్షం పడితే ఇక్కట్లు


మడకశిర అర్బన్‌, ఫిబ్రవరి 25: పట్టణంలోని మధుగిరి సర్కిల్‌ల్లో ప్రతి గురువారం జరిగే వారపు సంతలో కనీససౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్టీఆర్‌ సర్కిల్లో ఇరుకైన ప్రాంతంలో వారపు సంత జరిగేది. దీంతో ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడేవారు. గత మూడేళ్ల క్రితం వారపు సంతను మధుగిరి రోడ్డు పక్కన విశాలమైన ప్రదేశంలోకి మార్చా రు. అయితే కనీససౌకర్యాలు కల్పించకపోవడంతో వ్యాపారులేకాక సంతకు కూరగాయల కోసం వచ్చే ప్రజలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ వారపు సంతకు మడకశిర, గుడిబండ, అమరాపురం, రొళ్ల, హిందూపురం, పావగడ, మధుగిరి, మిడిగేశి తదితర ప్రాంతాల ఉంచి 800 నుంచి 1000 మంది వరకు వ్యాపారులు వస్తుంటారు. అయితే వారపు సంతలో కనీసం తాగునీరు కూడా దొరకడం కష్టంగా మారింది. వ్యాపారుల సౌకర్యం కోసం ఫుట్‌పాత్‌లు, స్లాబులు నిర్మించకపోవడంతో ఎండా కాలంలో ఎండకు ఎండుతూ ఉక్కపోతతో ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఎండ నుంచి రక్షణ కోసం ప్లాస్టిక్‌ టార్ఫలిన్లు, డేరాలు వేసుకుని కాలం గడపాల్సి వస్తోంది. వర్షాకాలంలో అయితే మరీ ఇబ్బందులు పడక తప్పదు. ఓ మోస్తరు వర్షం పడితే సంత ప్రాంతమంతా బురదమయమై వ్యాపారులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. వ్యాపారుల నుంచి రూ.30 నుంచి రూ.70ల వరకు సుంకాలు వసూలు చేస్తున్నారే తప్పా సౌకర్యాలు కల్పించడంలో చొరవ చూపడం లేదని వారు వాపోతున్నారు. వారపు సంత ద్వారా మున్సిపాల్టీకి ఆదాయం చేకూరుతున్నప్పటికీ సంబంధిత అధికారులు సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని వారు వాపోయారు. సంతకు కూరగాయల కోసం వచ్చే ప్రజలు వాహనాల పార్కింగ్‌ స్థలం లేక రోడ్డుపైనే వాహనాలు  నిలపాల్సి వస్తోంది.  ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్‌ అధికారులు స్పందించి వారు సంతలో తాగునీరు, ఫుట్‌పాత్‌లు నిర్మించాలని, వాహనాలకు పార్కింగ్‌ స్థలం చూపాలని వారు కోరారు.


Updated Date - 2021-02-26T06:26:01+05:30 IST