కొవిడ్‌ నిబంధనలు తూచ్‌

ABN , First Publish Date - 2022-01-04T05:43:13+05:30 IST

కరో నా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ, ఉదయం వేళల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

కొవిడ్‌ నిబంధనలు తూచ్‌
నల్లగొండ జిల్లా కేంద్రంలో భౌతికదూరం పాటించని ప్రజలు

కనిపించని మాస్క్‌లు  

రోడ్లపై గుంపులుగా జనం

పిల్లలకు వ్యాక్సినేషన్‌ ప్రారంభం 

అసక్తిచూపని తల్లిదండ్రులు

ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 4,233 మందికి టీకా



నల్లగొండ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరో నా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ, ఉదయం వేళల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఒమైక్రాన్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఆంక్షలు ప్రారంభించింది. అందుకు అనుగుణంగా జీవో నెంబర్‌ 1ని జారీ చేసింది. మాస్క్‌ ధరించని వారిపై రూ. 1000 జరిమానా, సభలు, సమావేశాలు, ఫంక్షన్లు, ర్యాలీలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ భౌతికదూరం విధిగా పాటించాలి. అదేవిధంగా దుకాణాలు, అన్ని కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు శానిటైజ్‌ చేసుకోవాలి. మాస్క్‌ ధరించిన వారినే షాపుల్లోకి అనుమతించాల్సి ఉంటుంది. నిబంధన లు పాటించని వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌, వైద్య, రెవెన్యూశాఖల కు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ నిబంధనలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ఆర్టీసీ బస్టాండ్లలో జనం గుంపులు గుంపులుగా మాస్క్‌లు లేకుండానే బస్సు ఎక్కుతూ, దిగుతూ కనిపిస్తున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులుసైతం గుమికూడి ఉంటున్నారు. కూరగాయల మార్కె ట్‌, ఇతర బహరంగ ప్రదేశా ల్లో శానిటేషన్‌ విషయాన్నే పక్కనపడేశారు. శుభ్రత పాటించడంలేదు. బహిరంగ ప్రదేశాల్లో సంచరించేటప్పుడు మాస్క్‌ తప్పనిసరి కాగా, సగం మందికి పైగా మాస్క్‌ లేకుండానే బయట తిరుగుతున్నారు.


రెండో డోస్‌పై అనాసక్తి

ఉమ్మడి జిల్లాలో 18 ఏళ్లకు పైబడిన వారు రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. 18 ఏళ్లకు పైబడివారు నల్లగొండ జిల్లా లో 12లక్షల మంది వరకు ఉండగా, అందులో 11.83లక్షల(99శాతం) మంది తొలి డోస్‌ వేయించుకున్నారు. రెండో డోస్‌ మాత్రం 6.75లక్షల (57శాతం మాత్రమే) మంది మాత్రమే వేయించుకున్నారు. యాదాద్రి జిల్లాలో 5,28,163 మంది అర్హులు కాగా, తొలి డోసు 5,28,163 మంది వేయించుకున్నారు. రెండో డోసు 4,06,653 మంది వేయించుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 7,97,477 మంది అర్హులు కాగా, మొదటి డోసు 7,29,957 మంది వేయించుకోగా, రెండో డోసు 4,99,069 మంది వేయించుకున్నారు.


నెలలో 179 కరోనా పాజిటివ్‌ కేసులు

ఉమ్మడి జిల్లాలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబరు 1వ తేదీన ఉమ్మడి జిల్లాలో 1,46,110 కేసులు ఉండగా ఈ ఏడాది జనవరి 3 నాటికి 1,46,289కి కేసుల సంఖ్య చేరింది. మొత్తం 179 కేసులు పెరగ్గా, కరోనాతో ఒకరు మృతిచెందారు.


పిల్లలకు టీకాపై నిర్లక్ష్యం

పిల్లలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రారంభమైంది. కాగా, దీనికి తల్లిదండ్రుల నుంచి అంతగా స్పందన కన్పించలేదు. 15-18 ఏళ్ల వయసు వారికి టీకా ఇవ్వా ల్సి ఉండగా, నల్లగొండ జిల్లాలో అందుకు 1.30 లక్షల మందిని అర్హులుగా అధికారులు నిర్ధారించారు. కాగా తొలి రోజు కేవ లం 263మంది పిల్లలు మాత్రమే టీకా వేయించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 44 కేంద్రాల్లో పిల్లలకు టీకా వేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. అయితే తొలి రోజు కేంద్రానికి సగటున ఆరుగురికి మాత్రమే టీకా వేయించుకున్నారు. యాదాద్రి జిల్లాలో 46,400 మంది పిల్లలకు టీకా వేయాల్సి ఉండగా, సోమవారం 3,600 మందికి వేశారు. సూర్యాపేట జిల్లాలో 15-18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు 1.87లక్షల మంది కాగా, తొలి రోజు 370మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. ఉమ్మడి జిల్లా మొత్తం 4,233 మంది పిల్లలు మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.


స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం : ఎ.కొండల్‌రావు, నల్లగొండ డీఎంహెచ్‌వో

జిల్లాలో 15-18 ఏళ్ల వయసు వారికి నూరు శా తం టీకా వేసే కార్యక్రమంలో భాగంగా స్కూళ్లు, కాలేజీల్లో స్పెషల్‌ క్యాంపులు నిర్వహిస్తాం. ఒమైక్రాన్‌ వేరియంట్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒమైక్రాన్‌ కేసులు నమోదు కాలే దు. నల్లగొండ జిల్లాకు గత నెల రోజుల్లో 63 మంది వివిధ దేశాల నుంచి వచ్చారు. వారందరి రక్త నమూనాలు పరీక్షించగా, నెగటివ్‌గా వచ్చింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు, 60 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌ వేస్తాం.

Updated Date - 2022-01-04T05:43:13+05:30 IST