వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ నియామకంలో నిబంధనలకు తూట్లు

ABN , First Publish Date - 2021-07-25T07:59:35+05:30 IST

చట్టాలను అతిక్రమించడం, నిబంధనలు ఉల్లంఘించడం వైసీపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ నియామకంలోనూ వక్ఫ్‌ నిబంధనలను తుంగలోతొక్కింది

వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ నియామకంలో నిబంధనలకు తూట్లు

బోర్డులో సభ్యుడు కాని వ్యక్తికి పదవి


అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): చట్టాలను అతిక్రమించడం, నిబంధనలు ఉల్లంఘించడం వైసీపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ నియామకంలోనూ వక్ఫ్‌ నిబంధనలను తుంగలోతొక్కింది. వక్ఫ్‌బోర్డులో సభ్యుడు కాని ఖాదర్‌ బాషా ను చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వక్ఫ్‌ యాక్ట్‌ ప్రకారం బోర్డు సభ్యుల్లోని వ్యక్తులనే చైర్మన్‌గా నియమించాలన్న విషయాన్ని గాలికొదిలేసింది. గత టీడీపీ ప్రభుత్వం 2018లో వక్ఫ్‌బోర్డును వేసి.. సభ్యులుగా 9 మందిని నామినేట్‌ చేసింది. వారిలో ఒకరిని వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. బోర్డు పదవీ కాలం 5 సంవత్సరాలు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వక్ఫ్‌బోర్డును రద్దు చేసింది. అయితే రద్దు నిర్ణయాన్ని కోర్టు కొట్టివేయడంతో గత ప్రభుత్వం నియమించిన వక్ఫ్‌బోర్డే కొనసాగుతోంది. కానీ గత ప్రభుత్వం నియమించిన బోర్డులోని 9 మంది సభ్యుల్లో పలువురిని వైసీపీ సర్కారు తప్పించగా, పలువురు రాజీనామా చేశారు. ఇలా ఆరుగురు సభ్యులు బోర్డు నుంచి వైదొలిగారు. ప్రభుత్వం బోర్డుకు చైర్మన్‌ను నియమించాలంటే వైదొలిగిన ఆరుగురు సభ్యుల స్థానాల్లో కొత్తవారిని నియమించి.. ఒకరిని చైర్మన్‌ను ఎన్నుకోవాలి. కానీ.. ఖాళీ అయిన ఆరు స్థానాల్లో కొత్తవారిని తీసుకోకుండా, మిగిలిన ముగ్గురు సభ్యులు కొనసాగుతుండగానే బయటి వ్యక్తిని చైర్మన్‌గా ప్రకటించింది.

Updated Date - 2021-07-25T07:59:35+05:30 IST