Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

గిరిజనులను గోదాట్లో ముంచిన పాలకులు

twitter-iconwatsapp-iconfb-icon
గిరిజనులను గోదాట్లో ముంచిన పాలకులు

ఇల్లుతగులబడి ఒకరేడుస్తుంటే మరొకడు పేలాలు వేయించుకున్నట్లుంది మన రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల వైఖరి. గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు మునిగిపోయి వేలాది గిరిజన కుటుంబాలు సర్వం కోల్పోయారు. రాష్ట్రంలో కోట్లాదిమంది ప్రజల మేలుకై పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన గిరిజనులు, ఇతర పేదలను కాపాడాల్సింది పోయి నాయకులు ఒకరి మీద ఒక్కరు దుమ్మెత్తి పోసుకుంటూ గిరిజనులను నిలువునా గోదాటిలో ముంచారు. జాతీయ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మాదే అని నిధులు ఇవ్వకుండా రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బిజెపి ప్రభుత్వాన్ని వదిలేసి వైసిపి, టిడిపి నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.


గోదావరికి ఇప్పుడు వచ్చిన వరదలకంటే 1986లో వచ్చిన వరదే పెద్దది. ఆనాడు భద్రాచలం దగ్గర 75.6 అడుగులు ఎత్తులో నీరు ప్రవహించినా ఇంత భారీ నష్టం జరగలేదు. కాని ఇప్పుడు వచ్చిన వరద 71.5 అడుగులే. అయినా  వందలాది గ్రామాలు మునిగి, వేలాది కుటుంబాలు భారీఎత్తున నష్టపోయాయి. వందలాది ఇళ్ళు కూలిపోయాయి. వేలాది పశువులు గల్లంతయ్యాయి. ఏడు మండలాల్లో సుమారు 193 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి.


పోలవరం ప్రాజెక్టు వల్ల ఏడు మండలాల్లో సుమారు 276 గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. అక్కడి వారికి పునరావాసం కల్పించి తరలించాలంటే సుమారు రూ.33 వేల కోట్లు ఖర్చు అవుతుంది. నిర్మాణ వ్యయం గాక ఇన్ని వేల కోట్లు రాష్ట్రం భరించే స్థితిలో లేదు. ఈ ప్రాజెక్టుకు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించాలి. కాని బిజెపి ప్రభుత్వం పోలవరానికి నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నది. ఆనాడు ఉన్న తెలుగుదేశం, ఇప్పుడున్న వైసిపి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా, నిధులు రాబట్టకుండా బిజెపి ప్రభుత్వానికి భయపడి నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా గాలికొదిలేశారు. వీరికి పరిహారం చెల్లించకుండానే ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేస్తామని తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాలు చెబుతుంటే మనం గుడ్డిగా నమ్ముతున్నాం. ఎందుకంటే, నిర్వాసితులకు సరైన పరిహారం, పునరావాసం కల్పించి, సురక్షిత ప్రాంతాలకు తరలించిన తరువాతనే ప్రాజెక్ట్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2013 చట్టం చెబుతున్నది ఇదే. ఇది జరగాలంటే నిర్వాసితులకు రూ.33 వేల కోట్లు చెల్లించాలి. కాని మన రాష్ట్ర పాలకులకు అంతశక్తి లేదు. కేంద్రం నుండి నిధులు రాబట్టకుండా అడవి బిడ్డలను గోదాటిలో ముంచే ప్రయత్నంలో భాగమే నేడు సుమారు 195 గ్రామాల మునక. సుమారు 13 ఉమ్మడి జిల్లాల్లో 23 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, వందలాది గ్రామాలకు త్రాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి,  కోట్లాదిమందికి జీవనాధారం కోసం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కోసం, సర్వం త్యాగం చేసిన అడవి బిడ్డలు, పేదలకు ఎంత ఇచ్చినా, ఏమి చేసినా తక్కువే. అటువంటి వీరికి నేటికీ పూర్తి  పునరావాసం కల్పించకుండా ఇలా ముంచడం న్యాయమా?


ఈ రాష్ట్రంలో పాలక పార్టీల అసమర్థత వల్లే బిజెపి ఈ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసినా నోరు మెదపడంలేదు. మొన్నటి రాష్ట్రపతి ఎన్నికల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా బిజెపి అభ్యర్థికి ఎ.పిలోనే నూటికి నూరు శాతం ఓట్లు వేయించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మంటకలిపాయి. పోలవరం నిర్వాసితులకు పూర్తి పరిహారం ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ప్రాజెక్ట్‌ ఎత్తు పెంచేకొద్ది అంటే మొదటి కాంటూరులో ఇన్ని ఇళ్ళు, రెండవ కాంటూరులో ఇన్ని ఊళ్ళు, మూడవ కాంటూరులో ఇన్ని ఊళ్ళు మునిగిపోతాయని కాకి లెక్కలు చెబుతున్నారు. ఉదాహరణకు ప్రభుత్వ అంచనాల ప్రకారం మొదటి కాంటూరు దగ్గర కూనవరం మండలంలో బొజ్జరాయిగూడెం మాత్రమే మునిగిపోతుంది అని అంచనా వేశారు. కాని కూనవరం మండలంలో 64 గ్రామాలకు గాను 58 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి.  గోదావరికి 33,96,363 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా కేవలం 98 గ్రామాలు మాత్రమే మునిగిపోతాయని ప్రభుత్వ నివేదికలో చెప్పారు. కాని ఈసారి గోదావరికి 23లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చాయని చెబుతున్నారు. ఈ లెక్కన ఏ ఒక్క గ్రామం మునిగిపోరాదు. 7 మండలాల్లో కూనవరం, వి.ఆర్‌పురం, దేవిపట్నం పూర్తిగాను, మిగిలిన మండలాలు సగానికి పైగా మునిగిపోయాయి. దీన్ని బట్టి ప్రభుత్వ లెక్కలకి, గ్రౌండ్‌ రియాల్టీకి భారీ వ్యత్యాసం ఉన్నట్లు తేలుతోంది. అంతేకాదు ఈ సమయంలో పై ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరికి మాత్రమే వరద వచ్చింది. శబరి నదికి భారీగా వరద రాలేదు. దీని వల్ల కొన్ని గ్రామాలు మాత్రమే మునిగాయి. గోదావరిలాగా శబరికి వరద వచ్చి ఉంటే పాత భద్రాచలం డివిజన్‌ మొత్తం సర్వనాశనం అయ్యుండేది. క్షేత్ర స్థాయిలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ బలిష్టంగా ఉందని వైసిపి ప్రభుత్వం చెబుతుంది. కాని గోదావరి వరదలు వస్తున్న విషయం 48గంటల ముందే తెలిసినా ముంపు గ్రామాల ప్రజలకు సమాచారం లేదు. గోదావరి పొంగి గ్రామాల మీద పడేవరకు ప్రజలకు తెలియదు. కట్టుబట్టలతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు. పేదలను హెచ్చరించడానికి ఒక్క మైక్‌ ప్రచారం లేదు, వాహనాల ఏర్పాట్లు లేవు, చివరకు మునిగిపోయిన గ్రామాల ప్రజలను రక్షించడానికి రెండుబోట్లు కూడా ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే చేశారు తప్ప గిరిజన ప్రాంతాలకు ఒక్క ప్రజాప్రతినిధి రాలేదు. కనీసం ముంపు గ్రామాలకు బోట్లలో వెళ్ళి భోజన సదుపాయం కల్పించలేదు. వామపక్ష కార్యకర్తలు, ప్రజా సంఘాలు మినహా ఎవ్వరూ వరద ప్రాంతాల్లో కనీసం పేదలకు ధైర్యం చెప్పేవారు కూడా లేరు. ప్రతి మండలంలో సుమారు రూ.300 కోట్ల నుండి 500 కోట్లు నష్టం జరిగినట్లు ప్రజలు చెబుతున్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి రూ.2వేలు, బియ్యం, పప్పు, ఉప్పు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇదికాదు నిర్వాసితులకు కావాల్సింది, శాశ్వత పరిష్కారం కావాలి.


తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 350 ప్రకారం ఆలస్యమైనందుకు అదనంగా పరిహారం పెంచి ఇవ్వాలి. అంతేకాకుండా 2019 ఎన్నికల ముందు జగన్‌మోహన్‌ రెడ్డి వైసిపి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్యాకేజితో పాటు మరో రూ.5లక్షలు అదనంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలను అమలు చేయమని స్వర్గీయ సున్నం రాజయ్య పోరాటం చేశారు కానీ నేటికీ నెరవేరలేదు. తక్షణమే ప్రతి మండలంలో ప్రత్యేక కమిటీలను నియమించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి చెల్లించాలి. అప్పటి వరకు కుటుంబానికి రూ.10వేలు నగదు, 3 నెలల పాటు ఆహార దినుసులు, పంట వేసి మునిగిన రైతులకు ఎకరానికి 25వేలు పరిహారం, పడిపోయిన ఇళ్ళకు పక్కా గృహాలు, దెబ్బతిన్న ఇళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పుడైనా వైసిపి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల్ని కలుపుకొని పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం నిధులివ్వకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపిపై ఒత్తిడి పెంచి నిధులు రాబట్టాలి. నిర్వాసితులకు పూర్తిగా పరిహారం చెల్లించి ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తేనే రాష్ట్రానికి న్యాయం చేసినవారమవుతాము.

వి.వెంకటేశ్వర్లు

వ్యవసాయ కార్మిక సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.