Abn logo
Sep 27 2021 @ 00:53AM

పల్లెల్లో పాలన పట్టుతప్పుతోంది!

కీలుబొమ్మలుగా మారుతున్న పంచాయతీ కార్యదర్శులు

మహిళా సర్పంచ్‌ల స్థానంలో భర్తలదే పెత్తనం

వేటు పడుతున్నా.. వెనక్కి తగ్గని వైనం

రాజకీయ అండతో పెరిగిపోతున్న అవినీతి అక్రమాలు

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీ పాలన పట్టు తప్పుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పలువురు సర్పంచ్‌, కార్యదర్శులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒకరిద్దరిని సస్పెండ్‌ చేసిన అధికారులు పలువురు సర్పంచ్‌, కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు అందించారు. అయినా వారి పనితీరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే ఉండాలని కలెక్టర్లు పలుమార్లు ఆదేశించినా ఏ ఒక్కరు పాటించినట్లు కనిపించడం లేదు. సమయపాలన లేక పోవడంతోనే పల్లె ప్రగతి పనుల్లో పురోగతి కనిపించడం లేదు. రెండేళ్లుగా పడుతూ లేస్తున్న శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డుల పనులు పూర్తి కావడం లేదంటే ఎంతటి నిర్లక్ష్యం కనిపిస్తుందో తెలుస్తోంది. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు ఉండగా పదుల సంఖ్యల పంచాయతీల్లో అవినీతి అక్రమాలు ఆగడం లేదు. స్థానిక సంస్థల పాలనను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం అదనపు కలెక్టర్‌ను నియమించినా ఆశించిన ఫలితం రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

పెత్తనమంతా వారిదే..

జిల్లాలో ఉన్న 468 గ్రామ పంచాయతీల్లో సగంమంది మహిళా సర్పంచ్‌లే అయినప్పటికీ అన్ని చోట్ల భర్తలదే పెత్తనం కనిపిస్తోంది. గెలిచిన రెండున్నరేళ్లలో అడపదడపగా పంచాయతీ సమావేశాలకు హాజరవుతున్నా గ్రామ పాలనలో ప్రత్యేక ముద్రను వేసుకోవడం లేదు. అంతా భర్తలు, కుటుంబ సభ్యులు చెప్పినట్లుగానే పాలన కొనసాగుతోంది. మహిళా ప్రజా ప్రతినిధులతో గ్రామాభివృద్ధికి అవకాశం ఉంటుందని భావించినా భర్తలు, కొడుకులదే పెత్తనం సాగుతోంది. రిజర్వేషన్‌ కింద పదువులు దక్కించుకున్నా పేరుకే సర్పంచ్‌ అన్న చందంగా మారుతోంది. వారి కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాలు గ్రామాల్లో పలు వివాదాలకు, గొడవలకు దారి తీస్తోంది. అయినా అధికారులు తేలికగానే తీసుకోవడంతో పంచాయతీ పాలనలో మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని టార్గెట్‌ విధిస్తున్న జిల్లా అధికారులు పట్టుతప్పుతున్న పాలనపై ప్రత్యేక దృష్టిని సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మహిళా ప్రజా ప్రతినిధుల స్థానంలో విధులు నిర్వహిస్తున్న వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలే కనిపించడం లేదు.

నామమాత్రంగానే విధులు..

పంచాయతీ పాలనలో కీలకమైన గ్రామ కార్యదర్శుల పాత్ర నామమాత్రంగానే కనిపిస్తోంది. సక్రమంగా విధులకు హాజరుకాక పోవడం, సమయపాలన పాటించక పోవడంతో సర్పంచ్‌లకు అనిగి మెనిగి ఉండాల్సి వస్తోంది. పంచాయతీ పాలనలో ఆరి తేరిన కొందరు సర్పంచ్‌లు తమ మాట వినని కార్యదర్శులపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాం టి లొసుగులతో సర్పంచ్‌లు చెప్పినట్లే వినాల్సి వస్తుందని కొందరు కార్యదర్శులు బహిరంగంగానే వాపోతున్నారు. స్థానికంగా ఉండక పోవడంతోనే గ్రామ పాలనపై పట్టు సాధించలేకపోతున్నారు. నిత్యం గ్రామానికి ఇలా వచ్చి అలా వెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. 

హెచ్చరించినా మారని తీరు..

పంచాయతీ ఎన్నికల్లో స్థాయికి మించి ఖర్చు చేయడం, ఆ తర్వాత చేసిన అప్పులను తీర్చే మార్గం లేక పంచాయతీ నిధులపై కన్నెస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడడం కొందరు సర్పంచ్‌లకు అలవాటుగానే మారింది. ఇటీవల ఇచ్చోడ మండలం నర్సాపూర్‌ సర్పంచ్‌ అవినీతికి పాల్పడ్డాడంటూ గ్రామస్థులు చేసిన ఫిర్యాదుకు విచారణ చేపట్టిన అధికారులు ఆ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అలాగే పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చేశాడంటూ జైనథ్‌ మండలం బోరజ్‌ గ్రామ సర్పంచ్‌పై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేసినా రాజకీయ నేతల ఒత్తిళ్లతో అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు విన వస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్‌ను రద్దు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆడిట్‌ అధికారుల రికార్డుల పరిశీలనలో ఎన్నో అవినీతి అక్రమాలు వెలుగు చూస్తున్నా గుట్టుచప్పుడుకాకుండా అందినకాడికి దండుకుంటూ లోలోన సెటిల్‌ చేస్తున్నారనే విమర్శలు లేక పోలేదు. 

చర్యలు తీసుకుంటున్నాం : శ్రీనివాస్‌, డీపీవో

జిల్లాలో అవినీతి ఆరోపణలు వచ్చిన సర్పంచ్‌లు, కార్యదర్శులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ కార్యదర్శులు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మహిళా సర్పంచ్‌ల స్థానంలో భర్తలు, కుటుంబ సభ్యులు పెత్తనం చలాయించినట్లు ఫిర్యాదులు వస్తే సహించేది లేదు. ప్రస్తుతం కొన్ని గ్రామ పంచాయతీలపై వచ్చిన ఫిర్యాదులపై పరిశీలించి త్వరలోనే చర్యలు తీసుకుంటాం.