గులాబ్‌ ముంచెత్తింది

ABN , First Publish Date - 2021-09-29T05:56:46+05:30 IST

‘గులాబ్‌’ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వర కు భారీ వర్షం కురిసింది. జిల్లాలో 3.2సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తుర్కపల్లి మండలంలో 3.2సెం.మీ, అత్యల్పంగా గుండాలలో 1.12సెం.మీ వర్షపాతం నమోదైంది.

గులాబ్‌ ముంచెత్తింది
రాయిగిరి-గుట్ట సర్వీసు రోడ్డు వద్ద నీటమునిగిన దుకాణాలు

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

3.2సెం.మీ వర్షపాతం నమోదు

లోతట్టు ప్రాంతాలు జలయమం

రాయిగిరి వద్ద తగ్గని వరద

ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ

పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

బస్వాపూర్‌ రిజర్వాయర్‌ కెనాల్‌కు గండి


(ఆంధ్రజ్యోతి యాదాద్రి) /భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌,ఆలేరు రూరల్‌, ఆత్మకూరు(ఎం), వలిగొండ, రామన్నపేట: ‘గులాబ్‌’ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వర కు భారీ వర్షం కురిసింది. జిల్లాలో 3.2సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తుర్కపల్లి మండలంలో 3.2సెం.మీ, అత్యల్పంగా గుండాలలో 1.12సెం.మీ వర్షపాతం నమోదైంది. 


భారీ వర్షాలకు భూదాన్‌పోచంపల్లి పెద్ద చెరువు, రేవణపల్లి చెరువు అలుగు పారుతున్నాయి. మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఊలూరు-రుద్రవెళ్లి బ్రిడ్జిపై నుంచి, జలాల్‌పూర్‌-మెహర్‌నగర్‌ మధ్య బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయా యి. కప్రాయిపల్లిలో వరి చేలు నేలవాలాయి. రామలింగంపల్లి గ్రామంలోని ఊరచెరువు కట్ట సగం తెగింది. బీబీనగర్‌ మండల కేంద్రంలో ని మూసీ, చిన్నేటి వాగులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో బీబీనగర్‌-పోచంపల్లి, బీబీనగర్‌-భువనగిరి మండలాల పరిధిలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. బీబీనగర్‌-పోచంపల్లి మార్గంలో రువ్రవెల్లి, జూలూరు గ్రామాల మధ్యన బ్రిడ్జిపై నుంచి మూసీ ప్రవహిస్తోండటంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచాయి. చిన్నేటి వాగు మార్గంలో బీబీనగర్‌-గూడూరు మధ్యన లోలెవల్‌ బ్రిడ్జిల పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో సర్వీ్‌సరోడ్లను పోలీసులు మూసివేశారు. ఇదే వాగుపై ముగ్దుంపల్లి, గొల్లగూడెం, అన్నంపట్ల-గూడూరు, రావిపహడ్‌-అనాజీపూర్‌ మార్గాల్లో చిన్నేటి వాగుపై నిర్మించిన లోలెవల్‌ బ్రిడ్జిలపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ మార్గాల్లో కంచె ఏర్పాటుచేశారు. బునాదిగాని, బొల్లేపల్లి, మూసీ పెద్ద కాల్వల్లో నీటి ప్రవాహం పెరిగింది. వలిగొండ మండలంలోని సంగెం, బొల్లేపల్లి గ్రామాల మధ్య భీమలింగం వద్ద మూసీ కల్వర్టుపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామంలో అక్కెనపల్లి సత్యనారాయణకు చెందిన ఇల్లు కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జ్‌ తదితర వస్తువులు పూర్తిగా ధ్వంసమై సుమారు రూ.5లక్షల మేర నష్టం వాటిల్లింది. ఆలేరు మండలంలోని కొలనుపాక పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కల్వర్టు వద్ద రెవెన్యూ సిబ్బంది ఇక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేసి ప్రయాణికులు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆత్మకూరు(ఎం) మండలంలోని బిక్కేరు వాగులో వరద ఉధృతి పెరగడంతో ఆత్మకూరు నుంచి మొరిపిరాల, కొరటికల్‌, పోతిరెడ్డిపల్లికి వెళ్లే రహదారిలో ఉన్న కాజ్‌వేలపై పైనుంచి రాకపోకలు నిలిపివేస్తూ కంచె ఏర్పాటు చేశారు. ఇక్కడ వీఆర్‌ఏలను కాపలా ఉంచారు. భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని రాయిగిరి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పక్కన సర్వీసు రోడ్డులో వరద భారీగా నిలిచింది. దీంతో యాదాద్రి క్షేత్రానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద కారణంగా దుకాణాలు మూతపడ్డాయి. భువనగిరి రూరల్‌ పోలీసు స్టేషన్‌ పక్కన వర్షం నీరు ఇళ్లలోకి వస్తోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న పలు వాహనాలు వరదలో మునిగాయి. స్థానికులు ధర్నా చేయడంతో అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ తదితరులు ఈ ప్రాంతంలో పర్యటించి వరద వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. బస్వాపూర్‌లో నిర్మిస్తున్న నృసింహ రిజర్యాయర్‌ కెనాల్‌కు(సిల్ప్‌వే)గండి పడింది. కాల్వ స్లాబ్‌ కొట్టుకుపోయింది. అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


 వరద నీటిలోనే చౌటుప్పల్‌ గాంధీపార్క్‌

చౌటుప్పల్‌ టౌన్‌: చౌటుప్పల్‌ పట్టణంలోని గాంధీపార్క్‌ వరద నీటితో నిండి చెరువును తలపిస్తోం ది. ఏడాదిగా ఇదే పరిస్థితి ఉంది. గత ఏడాది అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు పట్టణం జలమయం కాగా, పార్క్‌ను వరద ముంచెత్తింది. ఆ తరువాత చెరువు జాలు కారణంగా పార్క్‌ లో వరద తగ్గలేదు. ఈ నెల 4వ తేదీన చెరువు అలుగు పోయడం తో తిరిగి గాంధీపార్క్‌ను వరద ముంచెత్తింది. అప్పటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా వరద అలాగే నిల్వ ఉంటోంది. దీంతో పారిశుధ్య సమస్యతోపాటు, పాముల బెడద ఎక్కువైందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, చెరువు అలుగు కారణంగా బస్టాండ్‌లోకి వరద చేరుతుండటంతో ఆర్టీసీ బస్‌లు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. బస్సులు హైవే పైనుంచి నేరుగా వెళ్తున్నాయి.


రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచండి

కలెక్టర్లతో మంత్రి జగదీ్‌షరెడ్డి సెల్‌ కాన్ఫరెన్స్‌

నల్లగొండ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/సూర్యాపేట(కలెక్టరేట్‌): గులాబ్‌ తుపాను దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉంటూ రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఉదయం సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోతట్టు ప్రాంతాల ను గుర్తించడంతో పాటు అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకునేలా విద్యుత్‌శాఖను అలర్ట్‌ చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితోపాటు రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచాలని అన్నారు.



అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కాజ్‌వేల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి : కలెక్టర్‌ 

చౌటుప్పల్‌ టౌన్‌, వలిగొండ, సెప్టెంబరు 28: చౌటుప్పల్‌,లక్కారం చెరువుల వరద ప్రవాహం పెరుగుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాల ని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. చౌటుప్పల్‌,లక్కారం చెరువులు, వలిగొండ మండలంలోని టేకుల సోమారం, వలిగొండ, నాగారం నెమలికాల్వ గ్రామాలను ఆమె మంగళవారం సందర్శించారు. చౌటుప్పల్‌లో చెరువులో మునిగిన రెండు విద్యుత్‌ స్తంభాల నుంచి విద్యుత్‌ సరఫరా అవుతోందా అని ఆరా తీశారు. మ ల్కాపురం చెరువు నుంచి వచ్చే అలుగునీటికి అడ్డుకట్ట వేసి మూసీకి మళ్లించామని, లక్కారం చెరువు నుంచి చౌటుప్పల్‌ చెరువులోకి అలుగు నీరు వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు వెళ్తోందని దీంతో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేద ని తహసీల్దార్‌ గిరిధర్‌రావు ఆమెకు వివరించారు. చౌటుప్పల్‌ చెరువు అలుగు నీ రు హైవే సర్వీస్‌ రోడ్డు వెంట కాల్వల ద్వారా పట్టణంలోని రాంనగర్‌ నుంచి దిగువ వెళ్తోందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల వద్ద అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. వలిగొండ మండలంలోని కమ్మగూడెం, ఇంద్రపాలనగరం గ్రామాల మధ్య కల్వర్టుల వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాల ని అధికారులను అదేశించారు. అనంతరం టేకులసోమారం, వలిగొండ, నాగారం నెమలికాల్వ గ్రామాల్లో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, పీహెచ్‌సీలను సందర్శించారు.  ఆమె వెంట చౌటుప్పల్‌ మునిసిపల్‌ కమిషనర్‌ నర్సింహారెడ్డి, ఆర్‌ఐ సురేందర్‌శర్మ, భరత్‌గౌడ్‌, లింగస్వామి, వలిగొండ ఎంపీపీ నూతి రమే్‌షరాజు, డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, మండల అధికారులు, సర్పంచ్‌లు ఉన్నారు.

Updated Date - 2021-09-29T05:56:46+05:30 IST