దారులు.. దారుణం!

ABN , First Publish Date - 2022-07-05T06:00:52+05:30 IST

జిల్లాలో అడపాదడప కురిసిన వర్షాలకే రోడ్లన్నీ ధ్వంసమైపోయి అధ్వా నంగా కనిపిస్తున్నాయి. గుంతల రోడ్లతో ప్రయాణికులు ప డరాని పాట్లు పడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. అధికారులు రోడ్ల నాణ్యతపై అంతగా పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యంగా మారింది.

దారులు.. దారుణం!
తలమడుగు నుంచి మహారాష్ట్రకు వెళ్లే అంతర్‌రాష్ట్ర రహదారి ఇలా..

జిల్లాలో అతుకుల బొంతగా మారుతున్న రోడ్లు

అడుగడుగునా గుంతలు.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

ఏడాదికే ధ్వంసమైపోతున్నా.. మరమ్మతులు కరువు

కార్యాలయాలకే పరిమితమవుతున్న అధికారులు

జిల్లావ్యాప్తంగా రూ.200 కోట్లతో కొనసాగుతున్న రోడ్ల అభివృద్ధి పనులు

ఆదిలాబాద్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అడపాదడప కురిసిన వర్షాలకే రోడ్లన్నీ ధ్వంసమైపోయి అధ్వా నంగా కనిపిస్తున్నాయి. గుంతల రోడ్లతో ప్రయాణికులు ప డరాని పాట్లు పడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. అధికారులు రోడ్ల నాణ్యతపై అంతగా పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యంగా మారింది. దీంతో ఏడాదిలోనే రోడ్లన్నీ తారుమారవుతూ నాణ్యత నగుబాటుగా మారుతోంది. జిల్లాలో రోడ్డు భవనాల శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు, కల్వర్టుల నిర్మాణ పనులను చేపడుతున్నా.. మూన్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కొత్తవి, పాతవి కలుపుకొని ప్రస్తుతం రూ.200 కోట్లకు పైగానే రోడ్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మారుమూల గ్రామీణప్రాంతాల రోడ్లన్నీ తొలకరి వర్షాలకే అతుకులబొంతగా మారి దారుణంగా కనిపిస్తున్నాయి. ఏదైనా ఆపద వస్తే ప్రయాణం చేయడానికి పడరాని పాట్లు పడాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. అధ్వానంగా తయారైన రోడ్లపై ప్రయాణం చేసేందుకు జంకుతున్నారు. జిల్లాలోని 18 మండలాల పరిధిలో ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇచ్చోడ మండల కేంద్రంలో పాత నేషనల్‌ హైవే రోడ్డు అడుగడుగునా గుంతలుపడి అధ్వానంగా మారిం ది. అలాగే తలమడుగు మండలం నుంచి మహారాష్ట్రకు వెళ్లే అంతరాష్ట్ర రోడ్డుపై భారీ గుంతలు పడడంతో ప్రయాణికులు అటువైపు వెళ్లేందుకే జంకుతున్నారు. అయితే వేసిన రోడ్లనే పదేపదే వేస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడు భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ ధ్వంసమై  పోయాయి. ఇప్పటి వరకు కొన్ని రోడ్లకు మాత్రమే మరమ్మతులు చేపట్టి.. మిగితా రోడ్లను వదిలేశారు. మళ్లీ వానాకాల సీజన్‌ మొదలు కావడంతో పరిస్థితి మొదటికే వచ్చినట్లు కనిపిస్తోంది. క్వాలిటీ విభాగం ఉన్నా.. నామమాత్రంగానే పని చేయడంతో నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. జిల్లాలో ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పత్తా లేని గ్యాంగ్‌మన్‌లు

రోడ్ల నిర్మాణాలలో అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యమే కనిపిస్తోంది. నెలల తరబడి మరమ్మతులు కరువవుతున్నాయి. రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే పది కాలాల పాటు రోడ్డు పనులు పదిలంగా ఉంటాయి. ప్రధానంగా వర్షాకాలంలో రోడ్లపై నిలిచే వర్షపు నీటిని దిగువకు వెళ్లే విధంగా గ్యాంగ్‌మన్లు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలో ఏ ఒక్క గ్యాంగ్‌మన్‌ రోడ్లపై మరమ్మతులు చేపట్టిన దాఖలాలు కనిపించకపోవడం గమనార్హం. కేవలం కార్యాలయ విధులకే పరిమితమవుతున్నారు. జిల్లాలో ఎక్కువగా నల్ల రేగడి నేలలే కావడంతో రోడ్డు నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. చిన్నపాటి వర్షాలకే రోడ్లన్నీ గుంతలుపడి ప్రమాదకరంగా మారుతున్నాయి. అలాగే రోడ్డుపై నుంచి వర్షపు నీరు వెంటనే కిందికి జారిపోయే విధంగా రోడ్లను నిర్మించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తారురోడ్లపై కేజ్‌వీల్స్‌ వాహనాలు, పరిమితికి మించిన భారీ వాహనాలను నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి వర్షాలకే రోడ్లన్నీ అధ్వానంగా మారి కనిపిస్తున్నా యి. యేటా రోడ్ల నిర్మాణం చేపట్టడం.. వర్షాకాలంలో గుంతలు పడడంతో మళ్లీ మరమ్మతులు చేసి బిల్లులు జేబులో వేసుకోవడం అధికారులకు అలవాటుగా మారిందంటున్నారు. 

నిబంధనలు గాలికి..

పనులు పూర్తయిన తర్వాత క్వాలిటీ విభాగం అధికారులు నామమాత్రంగానే పర్యవేక్షణ చేస్తూ కాంట్రాక్టర్లతో కుమ్మకై తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలను గాలికి వదిలేయడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యత బాగుందని రి పోర్టులు ఇస్తున్నా.. యేడాది తిరుగక ముందే గుంతలు పడి రోడ్లన్నీ అ ధ్వానంగా మారడం ఏమిటో అధికారులకే తెలియాలి మరి. రోడ్డు నిర్మాణం పనుల్లో అధికారులు నికచ్చిగా వ్యవహరించి నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉండదంటున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు వివిధ దశల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ, పనులు పూ ర్తయిన తర్వాతనే తూతూమంత్రంగా రోడ్డు షాంపుల్లు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపుతున్నారు. ఒకవేళ నాణ్యత లేదని తెలిసినా.. ఆ వెంటనే గుట్టు చప్పుడుకాకుండా కాంట్రాక్టర్లు అధికారులను మేనేజ్‌ చేస్తున్నారు. నాణ్యత లేకుండా పనులు చేస్తే సదరు కాంట్రాక్టర్‌ నుంచి నిధులను రికవరీ చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు జిల్లాలో ఏ ఒక్క కాంట్రాక్టర్‌పై ఇలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలే కనిపించడం లేదు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. యేటా కోట్ల రూపాయల నిధులు నేలపాలవుతున్నా.. నాణ్యత ప్రమాణాలతో రోడ్డు నిర్మాణ పనుల ను చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదు. నెలల తరబడి మరమ్మతులు చేయక సమస్య తీవ్రమవుతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

మరమ్మతులు చేపడుతున్నాం

: నర్సయ్య, ఈఈ, ఆర్‌అండ్‌బీ శాఖ ఆదిలాబాద్‌

జిల్లాలో గుంతలమయంగా మారిన దారులను గుర్తించి మరమ్మతుల ను చేపడుతున్నాం. నిబంధనల ప్రకారమే రోడ్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఎక్కడైనా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేపడితే ఫైనల్‌ బిల్లులను నిలిపి వేస్తున్నాం. మరమ్మతు పనుల కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది. నిధులు మంజూరైన వెంటనే మరమ్మతు పనులను చేపడుతాం. గతేడు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల తాత్కాలిక మరమ్మతులను చేపట్టడం జరిగింది. ఎక్కడైనా ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటే తాత్కాలిక మరమ్మతు చేపట్టి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తాం.  

Updated Date - 2022-07-05T06:00:52+05:30 IST