గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోయిన రోడ్డు

ABN , First Publish Date - 2020-02-20T09:13:07+05:30 IST

మహాశివరాత్రి భక్తుల కోసం ఏర్పాటు చేసిన దారి గోదావరిలో కొట్టుకుపోయింది. నదికి అడ్డుకట్టవేసి రోడ్డు

గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోయిన రోడ్డు

వంగలపూడివద్ద పట్టిసం వెళ్లడానికి తాత్కాలిక రోడ్డు నిర్మాణం

వైసీపీ నాయకుల అత్యుత్సాహం..  రహదారి వంకతో అక్రమంగా ఇసుక రవాణా

రోడ్డు మార్గం రద్దు పంటు ఏర్పాటు చేయాలని సబ్‌కలెక్టర్‌ ఆదేశం


సీతానగరం, ఫిబ్రవరి 19: మహాశివరాత్రి భక్తుల కోసం ఏర్పాటు చేసిన దారి గోదావరిలో కొట్టుకుపోయింది. నదికి అడ్డుకట్టవేసి రోడ్డు మార్గం ఏర్పాటు చేయడానికి అధికారులు రూ.9లక్షలు మంజూరు చేశారు. ఓ పక్కన ఈ పనులు జరుగుతున్నాయి. ఎక్స్‌కవేటర్‌, ఇసుక అందుబాటులో ఉన్నాయి. ఇంకేం సందట్లో సడేమియా అన్నట్టుగా వైసీపీ నాయకులు కొంతమంది అత్యుత్సాహంతో అక్రమంగా 18 లారీల ఇసుక రవాణా చేసేశారు. రోడ్డుపనులు గాలికి వదిలి ఇసుక రవాణాపై ఆసక్తి చూపారు. ఇంతలో వేసిన రోడ్డు కాస్త గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోయింది.


మహాశివరాత్రి సందర్భంగా వంగలపూడి ఇసుక ర్యాంపు నుంచి గోదావరి నది మధ్యలో ఉన్న పట్టిసం వీరభద్రస్వామి ఆలయానికి వేలా దిమంది భక్తులు తరలివెళ్తుంటారు. ఇందుకోసం ప్రతిఏటా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే శుక్రవారం జరగబోయే పట్టిసం తీర్థానికి ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో వేసిన దారి కొట్టుకుపోవడంతో రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ వంగలపూడి ర్యాంపును సందర్శించి గతంలో లాంచీ ప్రమాదాలు జరిగి జన నష్టం జరిగినందున దారి ఏర్పాటు చేయడం మానేసి పంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శివమ్మ పాల్గొన్నారు.


వంగలపూడి ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక రవాణా

వంగలపూడి ఇసుక ర్యాంపు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. మూడురోజులుగా రాత్రిపూట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. మహాశివరాత్రి సందర్భంగా రోడ్డు ఏర్పాటు నెపంతో ఎక్స్‌కవేటర్లతో పట్టపగలు ఇసుక లోడింగ్‌ చేసి ఇసుక అక్రమ రవాణా చేశారు. యథేచ్ఛగా భారీలారీల్లో ఇసుక రవాణా జరుగుతున్నా మార్గ మధ్యంలో కూడా ఎవరూ పట్టించుకోవడంలేదు. అధికార పార్టీ పేరుతో కొందరు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కాటవరం ఇసుక ర్యాంపులో 7 అనుమతులు, మునికూడలి 4, వెదుళ్లపల్లి 2 అనుమతులతో ఇసుక రవాణా జరుగుతోంది. ప్రతిచోట ఏపీఎండీసీ ప్రతినిధులు ఉన్నా అడిగితే తమకు ఏమీ తెలియదని చెబుతున్నారు. 

Updated Date - 2020-02-20T09:13:07+05:30 IST