గురుతర బాధ్యత!

ABN , First Publish Date - 2020-09-04T05:30:00+05:30 IST

ఉపాధ్యాయుడు అంటే ఏదో ఒక పాఠాన్ని చదివేసి వెళ్ళిపోయే టేప్‌ రికార్డర్‌ కాదు. విద్యార్థుల్లో ప్రేరణ కలిగిస్తూ వారి జీవితాలను ఒక నిర్దిష్ట మార్గంలో తీర్చిదిద్దే వ్యక్తి. అతనికి ప్రత్యేక అధికారాలున్నాయి. ఎనలేని బాధ్యత కూడా ఉంది...

గురుతర బాధ్యత!

ఉపాధ్యాయుడు అంటే ఏదో ఒక పాఠాన్ని చదివేసి వెళ్ళిపోయే టేప్‌ రికార్డర్‌ కాదు.  విద్యార్థుల్లో ప్రేరణ కలిగిస్తూ వారి జీవితాలను ఒక నిర్దిష్ట మార్గంలో తీర్చిదిద్దే వ్యక్తి.  అతనికి ప్రత్యేక అధికారాలున్నాయి. ఎనలేని బాధ్యత కూడా ఉంది. 


ఈ రోజుల్లో ఉపాధ్యాయుడికి పెద్ద ప్రాధాన్యం లేదన్న భావన చాలామందిలో కనిపిస్తోంది. ఎందుకంటే ఈతరం వారికి  టీచర్‌ చెప్పగలిగేదంతా ఇంటర్నెట్‌లో దొరుకుతోంది మరి! నా దృష్టిలో మాత్రం ఉపాధ్యాయుల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఎందుకంటే వాళ్లకి ఇక సమాచారాన్ని అందించవలసిన భారం తీరిపోయింది. ఇప్పుడు వారు చేయవలసిన పని... విద్యార్థుల్లో స్ఫూర్తి కలిగించడం, వారిని మెరుగైన మానవులుగా రూపొందించడం. నిజానికిది ఎల్లప్పుడూ వారి ప్రాథమిక కర్తవ్యమే!   మన జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని మన సంప్రదాయం ఎప్పుడో గుర్తించింది. ‘ఆచార్య దేవోభవ’ అంటాం. గురువును దేవుడితో సమానంగా చూస్తాం. మన దేశ రెండో రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టిన రోజైన సెప్టెంబరు అయిదో తేదీని ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా నిర్వహించుకుంటున్నాం. ఒక ఉపాధ్యాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగడం మనకు గర్వకారణం.


ఏ దేశాన్నయినా యోగ్యంగా  నిర్మించాలనుకుంటే అత్యుత్తమ సామర్థ్యం ఉన్నవారు స్కూల్‌ టీచర్లుగా ఉండాలి. ఒక పిల్లవాడు అతడి జీవితంలోని మొదటి పదిహేను సంవత్సరాల్లో ఎలాంటి ప్రభావాలకు లోనవుతున్నాడనే అంశం అతని భావిజీవితంలో ఎన్నో విషయాలను నిర్ణయిస్తుంది. కాబట్టి, ఉన్నత శ్రేణికి చెందిన మేధావులు, అత్యుత్తమమైన నిబద్ధత కలిగి, ఎంతో ఉల్లాసంగా, స్ఫూర్తిమంతంగా ఉండే వ్యక్తులు ఉపాధ్యాయులుగా ఉండాలి. అలా లేనప్పుడు నాణ్యమైన సమాజాన్ని నిర్మించలేము. 


మనిషిని తీర్చిదిద్దడంలో, మంచి సమాజాన్ని తయారు చేయడంలో, ఒక మంచి దేశాన్ని, మొత్తం ప్రపంచాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. ఒక అంశంపై ఆసక్తిని కల్పించడంలో, పిల్లల శక్తిసామర్థ్యాలను పెంపొందించడంలో టీచర్‌ ఎంతో పెద్ద పాత్ర పోషిస్తాడు. చాలామంది పిల్లలకు ఒక సబ్జెక్ట్‌ అంటే ఇష్టం లేదా అనిష్టం బోధించిన ఉపాధ్యాయుడి ద్వారానే కలుగుతుంది. పిల్లలకు ఆ ఉపాధ్యాయుడు నచ్చి, వారిని ప్రభావితం చేయగలిగితే ఆ సబ్జెక్టుపై వారికి ఉన్నట్టుండి ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతం తయారవుతున్న భవిష్యత్‌ సమాజమే పిల్లలు. వారు మన చేతుల్లో ఉన్నప్పుడు మనం వారిని తీర్చిదిద్దడం ఒక గొప్ప బాధ్యత. మనం చేసే పని  మరొక జీవితాన్ని స్పృశించగలిగినప్పుడే అర్థవంతమవుతుంది. మరొకరి జీవితాన్ని తీర్చిదిద్దగలగడం గొప్ప అదృష్టం. సొంత పిల్లల ద్వారా ఆ అవకాశం దొరకదు. కానీ ఒక ఉపాధ్యాయుడికి ఆ అదృష్టం తప్పకుండా ఉంటుంది. అలాంటి గొప్ప అవకాశాన్ని మనం ఒకరి చేతుల్లో ఉంచుతున్నప్పుడు వారు మేధావులు, చిత్తశుద్ధి కలిగిన వారు, స్ఫూర్తిని ఇవ్వగలిగేవారు కావడం ఎంతో ముఖ్యం.


- సద్గురు జగ్గీవాసుదేవ్‌



Updated Date - 2020-09-04T05:30:00+05:30 IST