నిజామాబాద్‌అర్బన్, జనవరి 25: రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన ఓటు హక్కు గొప్ప ఆయుధమని జిల్లా జడ్జీ సునీత అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జీ మాట్లాడుతూ మనల్ని చక్కగా పరిపాలించే, మనకు నచ్చిన పాలకులను ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఓటింగ్ నమోదవుతుందని ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ భిన్నత్వంతో కూడుకుని ఉన్న మన దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలే పాలన సాగించేందుకు ఓటు హక్కు దోహదపడుతుందని పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ వంటి దేశాలలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయని ఆయన అన్నారు. జిల్లాలో 5200 మంది కొత్త ఓటర్లకు ఓటరు కార్డులు అందించామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కొత్త ఓటర్లకు జిల్లా జడ్జీ, కలెక్టర్‌లు ఓటరు కార్డులను అందజేశారు. ఉత్తమ బీఎల్‌వోగా సేవలు అందించిన అనితకు రూ. 10వేల నగదుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్, చిత్రమిశ్రా, ట్రైనీ కలెక్టర్ మకరంద్, టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు కిషన్, ఇతర జిల్లాల అదికారులు పాల్గొన్నారు.