Abn logo
Jul 7 2021 @ 00:43AM

సరైన నిర్ణయం!

మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో, పదహారు ప్రజాసంఘాలపై ఏడాది పాటు నిషేధం విధించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దానిని ఎత్తివేసింది. తప్పు సరిదిద్దుకోవడం మంచిదే. నిషేధిత ఉత్తర్వులు జారీచేసిన మూడునెలల్లో ఏ కారణాలవల్లనైతేనేమి ప్రభుత్వం వాటి ఉపసంహరణకు సిద్ధపడింది. మార్చి 30న పదహారు ప్రజాసంఘాలపై విధించిన నిషేధాన్ని రెండువారాల క్రితం విడుదల చేసిన 122జీవో ద్వారా ఎత్తివేసిన విషయాన్ని ప్రభుత్వం ఇప్పుడు వెల్లడించింది. ఆయా ప్రజాసంఘాల, మేధావుల, పౌరహక్కుల నాయకుల ఒత్తిళ్ళతో పాటు, రాజకీయ అవసరాలు, ఎత్తుగడలు, న్యాయపరమైన అంశాలు కూడా ప్రభుత్వాన్ని ఇందుకు పురిగొల్పి ఉండవచ్చు.


విప్లవరచయితల సంఘం, పౌరహక్కుల సంఘం ఇత్యాది పదహారు సంఘాలూ మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం ఆరోపణ. బీమాకోరేగావ్‌ కేసులో ‘ఊపా’ కింద అరెస్టయిన వరవరరావు, సాయిబాబా వంటివారి విడుదలకు ఈ సంఘాలు పట్టుబట్టడాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రజా‍స్వామ్యప్రియులంతా ఈ నిషేధాన్ని నిరసించడం, ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు అభ్యర్థనలు చేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు సైతం వినతిపత్రం ఇచ్చారు, హైకోర్టులోనూ పిటిషన్‌ దాఖలైంది. మార్చి 31న ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు చోట్ల పలువురు ప్రజాసంఘాల నేతల ఇళ్ళల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించి, హైదరాబాద్‌, చుట్టుపక్కల జిల్లాల్లోనూ వాటిని కొనసాగించిన నేపథ్యంలో, ఆ తేదీకి ఒకరోజు ముందునుంచీ నిషేధం అమల్లోకి వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీచేయడం విశేషం. సాధారణ పరిపాలనాశాఖ మార్చి 30వతేదీతో ఈ జీవో జారీ చేసిన విషయం ఏప్రిల్‌ 23వరకూ బాహ్యప్రపంచానికి తెలియచేయలేదు. చట్టవ్యతిరేకమని ప్రకటించే అధికారం ప్రజాభద్రతాచట్టం ప్రకారం ప్రభుత్వానికి ఉండవచ్చుకానీ, తదనుగుణంగా పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన ప్రక్రియలూ కొన్ని ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో పలు సెక్షన్లను ఉల్లంఘించిందన్న విమర్శలూ ఉన్నాయి. ముందుగా నోటీసులు ఇవ్వడం, పత్రికల్లో ప్రకటనలు ప్రచురించడం, అభ్యంతరాలకు అవకాశం కల్పించడం, ఆయా సంస్థల వాదనలు వినేందుకు న్యాయమూర్తుల కమిటీ వేయడం వంటివి అనేకం అందులో ఉన్నాయి. ప్రభుత్వం ఇవేమీ పాటించలేదు. 2005లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విప్లవరచయితల సంఘాన్ని నిషేధిస్తే, ముగ్గురు న్యాయమూర్తుల సలహామండలి విచారణ జరిపి నిషేధం చెల్లదని ప్రకటించడంతో ప్రభుత్వం రెండునెలల్లోనే మరో జీవో తెచ్చి నిషేధాన్ని ఉపసంహరించుకున్నది. ఇప్పుడు అదే సెక్షన్‌ కింద మరోమారు ఆ సంఘాన్ని తెలంగాణ నిషేధించింది. 


ఆదివాసులు, రైతుకూలీలు, మహిళలు, కార్మికులు, విద్యార్థులు తదితరుల పక్షాన వేర్వేరు ఆశయాలతో పనిచేస్తున్న సంఘాలన్నింటినీ ఏకగాటన కట్టడం, అవి హింసకు పాల్పడుతున్నాయనడం నిషేధానికి సహేతుకమైన కారణాలు కాబోవు. ప్రదర్శనలు చేయడం, ప్రశ్నించడం, క్రూర చట్టాలను నిరసించడం, వ్యవసాయచట్టాలు, సీఏఏ, ఎన్‌ఆర్‌సి వంటివి వద్దనడం దేశద్రోహమేమీ కాదు. బీమా కోరేగావ్‌ కేసులో, బెయిల్‌ కూడా దక్కని స్థితిలో తొమ్మిదినెలలు విచారణ లేకుండా జైల్లో మగ్గి, కరోనా దుష్ప్రభావంతో స్టాన్‌స్వామి కన్నుమూసిన ఘటన ఊపావంటి క్రూరచట్టాల నిషేధం అవసరాన్ని మరోమారు విస్పష్టంగా తెలియచెప్పింది. టాడా, పోటాలను మించిన రాక్షసత్వం, నిరంకుశత్వం దీనిలో ఉన్నాయి. స్టాన్‌స్వామి మరణం మిగల్చిన విషాదవాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం కాస్తంత ఓదార్పునిచ్చింది. ప్రజలపక్షాన నిలుస్తున్న గొంతులను నులిమివేయాలనే ప్రయత్నం మాని, ప్రజాసంఘాలు స్వేచ్ఛగా పనిచేసుకోగలిగే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత.