వెయ్యి కోట్ల ‘వూ’మన్‌!

ABN , First Publish Date - 2020-07-01T05:30:00+05:30 IST

24 ఏళ్ళ వయసులోనే తండ్రికి చెందిన ప్రముఖ సంస్థను వదిలేసి, స్వతంత్రంగా ఒక కంపెనీకి నాయకత్వం వహించాలనుకుంది. పురుషాధిక్యత అధికంగా ఉండే రంగంలోకి అడుగిడి, అంచెలంచెలుగా ఎదుగుతూ సత్తా చాటుకుంది...

వెయ్యి కోట్ల ‘వూ’మన్‌!

24 ఏళ్ళ వయసులోనే తండ్రికి చెందిన ప్రముఖ సంస్థను వదిలేసి, స్వతంత్రంగా ఒక కంపెనీకి నాయకత్వం వహించాలనుకుంది. పురుషాధిక్యత అధికంగా ఉండే రంగంలోకి అడుగిడి, అంచెలంచెలుగా ఎదుగుతూ సత్తా చాటుకుంది. అమెరికాలోని లగ్జరీ టెలివిజన్‌ పరిశ్రమలో ‘వూ’ టెక్నాలజీస్‌ ఇప్పుడొక బ్రాండ్‌. ఆ కంపెనీకి ఛైర్మన్‌, సీఈవో అయిన దేవితా సరాఫ్‌ ‘వూ’ టెక్నాలజీస్‌ను 14 ఏళ్లలో వెయ్యి కోట్ల రూపాయల విలువైన కంపెనీగా నిలబెట్టి, ప్రసిద్ధ ‘హలో’ మ్యాగజైన్‌ తాజా సంచిక (జూన్‌) కవర్‌పేజీపై ఠీవీగా పోజిచ్చారు. మన దేశంలోని ‘అత్యంత ధనిక మహిళా వ్యాపారవేత్త (40 ఏళ్ల లోపు)’లలో ఒకరిగా ఉన్న దేవిత 


వ్యాపార ప్రయాణం ఎలా సాగిందంటే...

కంప్యూటర్లు మన దేశంలోకి ప్రవేశిస్తున్న సమయంలో... అంటే 90వ దశకంలో ‘జెనిత్‌’ కంప్యూటర్స్‌ అంటే తెలియని వారుండరు. ఆ కంపెనీని స్థాపించింది దేవిత తండ్రి రాజ్‌కుమార్‌ సరాఫ్‌. ముంబైలోని వ్యాపార కుటుంబంలో పుట్టిన దేవిత స్థానిక క్వీన్‌ మేరీ స్కూల్‌, హెచ్‌.ఆర్‌. కాలేజీలో చదివింది. కాలేజీలో చదువుతున్నప్పుడే అంటే 16 ఏళ్లకే ఆమె తండ్రి వ్యాపారంలో చురుకైన పాత్ర పోషించింది. మార్కెటింగ్‌ విభాగానికి డైరెక్టర్‌గా ఉండి పర్సనల్‌ కంప్యూటర్‌ అమ్మకాలు చూసేది. మరోవైపు క్యాలీఫోర్నియాలో ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌’ పూర్తిచేసింది. కొన్నాళ్లకు కంపెనీకి ఆర్థికపరమైన చిక్కులు తలెత్తాయి. కోర్టులు, సెబీ జోక్యం చేసుకోవడంతో ‘జెనిత్‌’ ప్రభ క్రమక్రమంగా మసకబారింది. అప్పటికే తనకున్న అనుభవంతో 2006లో దేవితా సరాఫ్‌ సరికొత్త మార్గాన్ని ఎంచుకుని ‘వూ’ టెలివిజన్‌కు రూపకల్పన చేసింది. ‘‘సాధారణంగా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలంటే ఫ్యాషన్‌ రంగాన్నే ఎంచుకుంటారు. కానీ నేను మాత్రం పురుషాధిక్యత అధికంగా ఉండే టెక్నాలజీ రంగాన్ని ఎంచుకున్నా. 24 ఏళ్ల వయసులో ‘వూ’ టెక్నాలజీస్‌ను స్థాపించా. చిన్నప్పటి నుంచి నాయకత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి బిజినెస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ‘నేను మహిళను’ అనే విషయాన్ని మర్చిపోవాలి. రిస్క్‌ తీసుకునే గుణం, గట్స్‌ ఉంటేనే బిజినెస్‌లోకి రావాలి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ క్రమక్రమంగా నిలదొక్కుకున్నా’’ అన్నారు దేవిత. 


మహిళాశక్తిని గుర్తించాలి...

క్యాలీఫోర్నియా కేంద్రంగా దేవిత కంపెనీ తయారుచేసే ‘వూ’ లగ్జరీ టీవీలకు ప్రస్తుతం అమెరికాలో మంచి డిమాండ్‌ ఉంది. ‘ఓటీటీ కంటెంట్‌కు ఈ హైఎండ్‌ టీవీలే సరి’ అనే గుర్తింపు వచ్చింది. దాంతో 14 ఏళ్లలో ‘వూ’ టెక్నాలజీస్‌ విలువ వెయ్యి కోట్ల రూపాయలకు చేరుకుంది. ‘‘మన దేశంలో కూడా లగ్జరీ టీవీల విభాగంలో సోనీ, శాంసంగ్‌, ఎల్జీ తర్వాత మా టీవీలే అధికంగా అమ్ముడవుతున్నాయి. రానున్న కాలంలో 10 వేల కోట్ల రూపాయల బిజినెస్‌ చేయాలనేది నా కోరిక. అయితే గమ్మత్తేమిటంటే మన దగ్గర టెక్నాలజీకి సంబంధించినవారు చాలా తక్కువ మందికి తెలుస్తారు. ఉదాహరణకు అమెరికాలో పిల్లలకు స్టీవ్‌జాబ్స్‌, బిల్‌గేట్స్‌ ఎవరో తెలుసు. అదే మన పిల్లలకు సినిమా స్టార్స్‌, క్రికెటర్స్‌ పేర్లు మాత్రమే తెలుస్తాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అలాగే మహిళా శక్తిని అంతా గుర్తించాలి. వారికి స్త్రీత్వంతో పాటు అపారమైన తెలితేటలు కూడా ఉన్నాయనే విషయాన్ని మగవాళ్లు తెలుసుకోవాలి’’ అంటున్న దేవిత కంపెనీలో 300 పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. తనకున్న 11 ఆఫీసుల పని చక్కబెట్టేందుకు ముంబై, క్యాలీఫోర్నియాల మధ్య తిరుగుతూ బిజీగా ఉండే దేవిత ప్రయాణాలో ్లనే సరికొత్త ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. 


మరికొంత...

  1. దేవితా సరాఫ్‌ ‘ఫిక్కీ’ యంగ్‌లీడర్స్‌ ఫోరమ్‌కు నేషనల్‌ కో ఛైర్‌, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా ఉన్నారు.
  2. ప్రసిద్ధ ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’కు కాలిమిస్ట్‌ కూడా. 
  3. బాంబే ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉన్న ‘యంగ్‌ బాంబే ఫోరమ్‌’ వ్యవస్థాపకురాలు.
  4. 2016లో బిజినెస్‌ ఉమన్‌ కేటగిరీలో ‘ఇండియా లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌’ అవార్డు అందుకున్నారు.  

Updated Date - 2020-07-01T05:30:00+05:30 IST