తాళం చెవి

ABN , First Publish Date - 2020-06-16T05:59:53+05:30 IST

కరోనా కష్టకాలం ప్రస్తుత స్థితిగతులను సమీక్షించడానికి ప్రధానమంత్రి మంగళ, బుధవారాల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడియో సమావేశం నిర్వహించబోతున్నారు. గత మాసాంతం నుంచి...

తాళం చెవి

కరోనా కష్టకాలం ప్రస్తుత స్థితిగతులను సమీక్షించడానికి ప్రధానమంత్రి మంగళ, బుధవారాల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడియో సమావేశం నిర్వహించబోతున్నారు. గత మాసాంతం నుంచి మొదలైన ‘‘అన్‌లాక్‌–1’’ వైఫల్యసాఫల్యాలను చర్చించడమే ఈ సమావేశం ఉద్దేశ్యమని చెబుతున్నారు. వివిధ ఆంక్షలు, నియంత్రణల నుంచి దేశం క్రమంగా వెలికి వస్తున్న తరుణంలో భవిష్యత్‌ కార్యాచరణ గురించిన సంప్రదింపులు అవసరం. అయితే, లాక్‌డౌన్‌ నుంచి దేశం వెలికివస్తున్న మాట నిజమే కానీ, కరోనా ఉపద్రవం నుంచి బయటకు రావడం లేదు. పైగా, పరిస్థితి రాను రాను తీవ్రం అవుతున్నది. 


అన్ని రాష్ట్రాలలోను పరిస్థితి ఒకే రకంగా లేదు. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు మొదలైన రాష్ట్రాల పరిస్థితి తక్కినవాటి కంటె తీవ్రంగా ఉన్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో పరిస్థితి రాను రాను తీసికట్టుగా కనిపిస్తున్నది. ఈ వాతావరణంలో తిరిగి లాక్‌డౌన్‌ బిగుసుకుంటుందనే ఊహాగానాలు, వదంతులు వినిపిస్తున్నాయి. తిరిగి వెనుకకు మరలడం ఉండబోదని కొన్ని రాష్ట్రాల నుంచి విస్పష్టమైన ప్రకటనలు వస్తున్నాయి కానీ, 19నుంచి చెన్నై నగరం, తమిళనాడులోని నాలుగు జిల్లాలతో సహా తిరిగి పూర్తి లాక్‌డౌన్‌లోకి వెళ్ళబోతున్నది. కాబట్టి, భవిష్యత్తులో ఏది జరగడానికైనా ఆస్కారం ఉన్నది. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నదని ప్రజలు భావిస్తే, ‘అన్‌లాక్‌’ను వారు పెద్దగా ఆహ్వానించబోరు. ఇప్పటికే, అనేక రంగాలలో ‘అన్‌లాక్‌’ ప్రభావం పెద్దగా ఉండడం లేదు. ప్రజలు నిత్యావసరాలకు, ఉద్యోగావసరాలకు మించి ఆర్థిక కార్యకలాపాలలో ఆసక్తి చూపడం లేదు. కొన్ని రంగాలలో కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలు కనిపిస్తున్నప్పటికీ, అవి దీర్ఘకాలం కొనసాగుతాయన్న నమ్మకం లేదు. ఇంటి నుంచి పనిచేయగల ఉద్యోగరంగాలలో మినహా మరెక్కడా, నిలకడైన ఉత్పాదకత జరగడం లేదు. స్వల్ప ఆదాయాలను ఆర్జించే దినకూలీల వారు, చిన్న చిన్న స్వతంత్ర వృత్తులు చేసుకునేవారు, చిన్న–మధ్య తరహా వ్యాపారాల మీద ఆధారపడి పనిచేసే చిరుద్యోగులు – వీరి కుటుంబాలకు రోజు గడవడం రానురాను కష్టం అవుతున్నది. గ్రామాలలో వ్యవసాయాదాయం కారణంగా, డబ్బు బాగానే చేతులు మారుతున్నదని వార్తలు వస్తున్నాయి కానీ, అక్కడ కూడా పరిమిత అవసరాలకే వినిమయం జరుగుతున్నది. కాబట్టి, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం అన్నది ప్రభుత్వాలు తలచుకున్నంత మాత్రాన కాదు. కరోనా తీవ్రత ఈ తీరుగా ఉన్నప్పుడు, ఇంకా మిగిల్చిన ఆంక్షలను కూడా సడలించడానికి పాలకులు సంకోచిస్తారు. అట్లా కాక, వ్యాధి వ్యాప్తిని అనుమతించే సడలింపులు ఇస్తే ప్రజలు సమ్మతించరు. 


క్రియాశీలంగా వ్యాధిని నియంత్రించలేము, మనం చేయగలిగేది పరిమితమే అన్న నిర్ధారణకు ప్రభుత్వాలు వచ్చినా, వ్యాప్తి తీవ్రమవుతున్న కొద్దీ సమస్త జీవనరంగాలు, ఆరోగ్యవ్యవస్థ అన్నీ ఒత్తిడికి లోనయి తీవ్రమయిన సంక్షోభం ఏర్పడుతుంది. అట్లాగని, అత్యధికుల ఉపాధిని, కనీస అవసరాలను కాదని, పూర్తి లాక్‌డౌన్‌కు తిరిగి వెళ్లలేము. ఈ స్థితిలో సమతూకాన్ని, కనీస నష్టంతో గట్టెక్కే ఉపాయాన్ని అన్వేషించడం సులువేమీ కాదు. ఈ సమయంలో అందరూ రాజకీయాలను కట్టిపెట్టి ఒక్కటిగా ఉందామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపునిస్తున్నారు కానీ, కేంద్రప్రభుత్వపు తీరే, ఏకపక్షంగా ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకపోవడం సరే, రాష్ట్రాలను, ముఖ్యంగా ప్రతిపక్ష రాష్ట్రాలను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్రం వైఖరి ఉంటున్నదన్న ఆరోపణలను వింటున్నాము. నిజానికి రాష్ట్రాలకు తగిన ఆర్థిక సహాయం చేయకుండా ముందరి కాళ్లకు బంధాలు వేసింది కేంద్రమే. చివరకు రుణసమీకరణకు ఏదో అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి, అనేక షరతులు జోడించారు. జిఎస్‌టి వసూళ్లు తగినస్థాయిలో లేనప్పుడు రాష్ట్రాలకు ఇవ్వవలసిన పరిహారం విషయంలో కూడా కేంద్రం అడ్డుపుల్ల వేసింది. బీమా కంపెనీలు వాదించినట్టు, కరోనా అన్నది దైవ చర్య కాబట్టి, పరిహారం ఇవ్వనక్కరలేదు అంటున్నది. పన్ను పరిహారం చెల్లించడం కంటె ఆర్థిక వ్యవస్థ ఉద్దీపనకు మరో అవకాశం ఏముంటుంది? ఎవరికీ అందని ఆ 20లక్షల కోట్ల ప్యాకేజీ ఏమి సాధించేట్టు? 


కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొనడంలో పూర్వానుభవం లేని మాట నిజమే అయినప్పటికీ, బలహీనులకు అండదండలు, ముందుచూపుతో వ్యూహరచన, ఆరోగ్యవ్యవస్థ దృఢీకరణ– ఈ మూడు అంశాల విషయంలో రాష్ట్రప్రభుత్వాలు కట్టుబాటుతో ఉండాలి. కొన్ని విధివిధానాల విషయంలో వైవిధ్యం ఉన్నప్పటికీ, కనీస ప్రాతిపదికలు అందరివీ ఒకటే కావాలి. ఇది అసంఖ్యాక ప్రజానీకంతో ముడిపడిన అంశం కాబట్టి, సమాచారం పారదర్శకంగా ఉండాలి. అభద్రతతోనో, అనుమానంతోనో, అవసరంతోనో ప్రజల నుంచి, సమాజం నుంచి ప్రశ్నలు వస్తాయి. వాటికి ఓపికగా సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే, ఇది ప్రాణాలతో ముడిపడిన సమస్య. పూర్తి లాక్‌డౌన్‌, అధికసంఖ్యలో పరీక్షలు, వ్యాధివ్యాప్తి క్రమంపై నిరంతర నిఘా– ఈ మూడింటి సమన్వయం ద్వారానే వూహాన్‌లో చైనా విజయం సాధించింది. రాజకీయాలకు తావులేని విధంగా, ప్రజారోగ్యమే పరమ ప్రాతిపదికగా రాష్ట్రాలు, కేంద్రం ఈ రెండు రోజులు చర్చలు జరపాలని, ఏది మంచిదయితే అది– ప్రాతిపదికన అంతిమ నిర్ణయం జరగాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Updated Date - 2020-06-16T05:59:53+05:30 IST