ఫలించిన జ్ఞానాన్వేషణ

ABN , First Publish Date - 2021-06-25T05:30:00+05:30 IST

చియోనో అద్భుతమైన సౌందర్యవతి. ఆమె అందచందాలకు ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుమారులు

ఫలించిన జ్ఞానాన్వేషణ

చియోనో అద్భుతమైన సౌందర్యవతి. ఆమె అందచందాలకు ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుమారులు ఆకర్షితులయ్యారు. ఆమెను వివాహం చేసుకోవాలని ప్రయత్నించారు. అయితే చియోనో మనసు భగవంతుడిపైనే లగ్నమయింది. వారి కోర్కెలను తిరస్కరించి, అవివాహితగానే ఉండిపోయింది. భగవంతుణ్ణి చేరుకొనే మార్గాన్ని సూచించాలంటూ పేరున్న జెన్‌ గురువులూ, మఠాధిపతులు, పీఠాధిపతుల చుట్టూ తిరిగింది. ఎంత మొరపెట్టుకున్నా ఆమెను శిష్యురాలుగా స్వీకరించడానికి ఏ గురువూ అంగీకరించలేదు. దానికి కారణం ఆమె అందం.


ఆ గురువులందరూ చెప్పిన మాట ఒక్కటే... ‘‘ఎందరో యువ సన్న్యాసులున్న మా మఠంలో ఇంత అందంగా, ఆకర్షణీయంగా ఉన్న నిన్ను చేర్చుకొని... భగవంతుణ్ణి చేరే మార్గాన్ని సూచించలేం. సాధన చేయించలేం. నీ మూలంగా వారు దారి తప్పి, పతనం కావచ్చు. కాబట్టి మరో చోటు చూసుకో’’ అని.


కానీ చియోనో ఆధ్యాత్మిక తపన సాధారణమైనది కాదు. ఆమె అసలు సిసలైన జిజ్ఞాసి. చివరకు ఎవరో ఒక గురువును ఒప్పించాలనుకుంది. ‘నన్ను శిష్యురాలుగా అంగీకరించడానికీ, మఠంలో ఆశ్రయం కల్పించి తగిన శిక్షణ ఇవ్వడానికీ ప్రతి గురువుకూ ఉన్న అభ్యంతరం నా అందమే కదా! దాన్నే తొలగించుకుంటే సరిపోతుంది’ అని భావించింది. మండే కొరివితో తన ముఖాన్నీ, కనిపించే దేహ భాగాన్నీ కాల్చేసుకుంది. అది ఎంత తీవ్రంగా అంటే... ఆమె ముఖాన్ని చూసి... పురుషుడి ముఖమో, స్త్రీ ముఖమో గుర్తుపట్టలేనంతగా!



ఆ తరువాత మళ్ళీ తనను అంగీకరించే గురువు కోసం కాళ్ళు అరిగేలా తిరిగింది. శిష్యురాలుగా తనను స్వీకరించి, దైవాన్ని చేరే మార్గం సూచించాలని ఎంతో దీనంగా వేడుకుంది. చివరకు ఒక గురువు సమ్మతించాడు. తనను ప్రశ్నించకుండా... తాను చెప్పే పనులన్నీ శ్రద్దగా చెయ్యమన్నాడు. చియోనో ఎంతో సంతోషించింది. గురువు చెప్పిన పనులన్నీ చేసేది. అతను సూచించిన గ్రంథాలను ఎంతో శ్రద్ధగా అధ్యయనం చేసింది. అతను సూచించిన వేళల్లో ధ్యానం చేసింది.  ఇలా ముప్ఫై, నలభై ఏళ్ళు గడిచిపోయాయి. దైవదర్శనం కోసం ఆమె తపన, తపస్సు మరింత తీవ్రమయ్యాయి.


ఒక వెన్నెల రాత్రి... దూరాన ఉన్న బావికి నీటి కోసం చియోనో వెళ్ళింది. వెదురు కర్రలతో చేసిన చేదలాంటి పాత్రతో నీరు తోడి, ఆ పాత్రను చంకన పెట్టుకుంది. ఆ పాత్రలోని నీటిలో వెలుగుతున్న చంద్రబింబాన్ని తదేకంగా చూస్తూ నడుస్తోంది. ఆ దృశ్యం ఆమెలో అపారమైన మానసిక సంచలనాన్ని కలిగించింది. ఆ భావోద్వేగంలో ఆమె కొట్టుకుపోతూ ఉండగా... హఠాత్తుగా ఆ పాత్ర అడుగుభాగం ఊడిపోయింది. చుట్టూ ఉన్న కర్రలు కూడా పడిపోయాయి. నీరు, నీటిలోని చంద్రబింబం చెల్లాచెదురైపోయాయి. ఆమె మానసిక ఉద్వేగం కూడా మాయమైంది. సర్వం స్తంభించిపోయినట్టయింది. ఆ ఆకస్మిక సంఘటనతో... చియోనోకు భ్రమలన్నీ తొలగిపోయినట్టనిపించింది. అజ్ఞానం అంతరించింది. ఆమె జ్ఞానాన్వేషణ ఫలించింది. అనంతమైన ఆనందం ఆమెను ఆవరించుకుంది. 


ఈ కథ గురించి ఓషో వ్యాఖ్యానం చేస్తూ ‘‘జ్ఞానోదయం ఎప్పుడూ అకస్మాత్తుగానే కలుగుతుంది’’ అంటారు. అలాంటి స్థితిని ‘సమాధి’ అంటారు. బాల్యంలో... మరమరాలు తింటూ, పొలం గట్టున నడుస్తున్న రామకృష్ణ పరమహంస ఒక నల్లటి మేఘాన్నీ, దాని అంచున ఎగురుతున్న తెల్లని కొంగల బారును చూసి తన్మయత్వం చెందారు. సమాధి స్థితిని పొందారు. ఆ సంఘటనను ఫ్రెంచి రచయిత రోమారోలా తన ‘ది లైఫ్‌ ఆఫ్‌ రామకృష్ణ’ అనే గ్రంథంలో వివరించారు. శరీరంతో, మనసుతో తీవ్రమైన సాధన చేయగా, చేయగా... ఆకస్మికంగా ఏదో ఒక వేళలో జ్ఞానం ఉదయిస్తుంది. అలాంటి స్థితిని సాధించిన చియోనో ఎందరికో మార్గదర్శకురాలుగా నిలిచింది.



 రాచమడుగు శ్రీనివాసులు


Updated Date - 2021-06-25T05:30:00+05:30 IST