Abn logo
Sep 25 2021 @ 00:23AM

పార్టీలు మారినా దక్కని ఫలితం

 - పదవులపై ఎన్నో ఆశలు

- ఏళ్లు గడుస్తున్నా అధినేత నుంచి అందని పిలుపు

- టీఆర్‌ఎస్‌లో ఆదరణకు నోచుకోని సీనియర్‌ నేతలు 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

‘వ్రతం చెడినా దక్కని ఫలితం’ అన్న సామెత వీరికి అక్షరాల సరిపోతుంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో క్రియాశీలక పదవుల్లో ఉండి ఒక వెలుగు వెలిగిన నాయకులు ఆ పార్టీలను వీడి ఎన్నో ఆశలతో అధికార టీఆర్‌ఎస్‌ చేరినా వారికి ఫలితం మాత్రం దక్కడం లేదు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నజర్‌ తమపై ఎప్పుడు పడుతుందో ఎపుడు పదవులు అందుకుంటామోనని ఎదురుచూస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సందర్భాల్లో కాంగ్రెస్‌, బీజేపీ నేతలను ఆనాటి అవసరాల దృష్ట్యా అధికారపార్టీ కోరి వెంటపడి మరీ చేర్చుకున్నది. అధికార పదవులు వారికి అందుబాటులోకి వచ్చినట్టే వస్తూ ఏదో ఒక కారణంతో మళ్లీ దూరం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు అత్యంత వేగవంతమవుతూ ఇప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు వెలువడుతుండడంతో సీనియర్‌ నేతలంతా కరివేపాకులుగా మారిపోతారా లేక కాలం కలిసివచ్చి అధికార పదవులను అలంకరిస్తారా అన్నది ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో మాజీ శాసనసభ్యుడు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు కోడూరి సత్యనారాయణగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ ఆరెపల్లి మోహన్‌, మాజీ శాసనసభ్యుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్‌ ఉన్నారు. ఉమ్మడి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా వ్యవహరించి ఆ పార్టీ రాజకీయాలను సమర్థవంతంగా నిర్వహించిన కొత్త శ్రీనివాస్‌రెడ్డి, తాజాగా టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కూడా ఆ చర్చలో నానుతున్నవారిలో కలిసిపోయారు. 

  గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లాలో గౌడ సామాజికవర్గం బలమైనదిగా ఉన్నది. టీఆర్‌ఎస్‌లో జిల్లాకు సంబంధించినంత వరకు ఆ సామాజికవర్గాన్ని మెప్పించగలిగిన సీనియర్‌ నేతలెవరూ లేరు. దీనితో చొప్పదండితో పాటు కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రభావం చూపించగలుగు తారన్న కోణంలో ఆలోచించి సత్యనారాయణగౌడ్‌ను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఆయనకు రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్‌ పదవిగానీ, ఎమ్మెల్సీ పదవిగానీ వస్తుందని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. రెండేళ్లు గడిచినా ఆయనకు ఏ పదవీ దక్కలేదు. తాజాగా ఆయనను వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థాన కమిటీ చైర్మన్‌గా నియమిస్తారని, రాష్ట్రస్థాయిలో ఏదైనా కార్పొరేషన్‌ పదవి కట్టబెట్టవచ్చని, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వవచ్చనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే రెండేళ్లుగా ఇలాంటి చర్చలు ఎన్నో జరిగినా పదవి మాత్రం రాకపోవడంతో సత్యనా రాయణగౌడ్‌ ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. 

  రాష్ట్ర శాసనమండలిలో కాంగ్రెస్‌ ఉనికి లేకుండా చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్లాన్‌ అమలులో క్రియాశీలకంగా మారి ఆయన అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు దోహదపడ్డ మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్‌ కూడా ఇప్పుడు త్రిశంకు స్వర్గంలోనే ఉన్నారు. సంతోష్‌కుమార్‌ కంటే ముందు ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ ఫోల్డ్‌లోకి రాగా సంతోష్‌కుమార్‌ నిజామాబాద్‌కు చెందిన మరో ఎమ్మెల్సీ ఆకుల లలితతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ నలుగురు కలిసి తామంతా కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిపోతున్నామని మండలి స్పీకర్‌కు లేఖ ఇవ్వడంతో శాసనమండలిలో కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపు రద్దయిపోయింది. సంతోష్‌కుమార్‌కు తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ పదవులను వేరేవారికి ఇవ్వడానికి హామీ ఇచ్చారని, సంతోష్‌కు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అదిగో..ఇదిగో ఆర్డర్‌ రెడీ అయిందంటూ కూడా వార్తలు వచ్చినా ఇప్పటి వరకు ఆ ఊసే లేకుండా పోవడంతో ఆయన పూర్తిస్థాయిలో నిరాశలో ఉన్నారని చెబుతున్నారు. 

   అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్‌ నియోజకవర్గంలో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల మధ్య జరుగగా ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ పోటీలో తలపడ్డారు. పోటీతీవ్రంగా ఉందని భావించిన ఆ సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొత్త శ్రీనివాస్‌రెడ్డిని ఆకర్షించడానికి ప్రయత్నించి ఆయనను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అనుకున్న విధంగానే బీజేపీపై ఇక్కడ టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. అయితే అందుకు దోహదపడిన పలు కారణాల్లో శ్రీనివాస్‌రెడ్డి చేరిక కూడా ప్రధానమైనదే. అయితే ఆయనకు కూడా ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌లో ఏ పదవి దక్కలేదు. ఆయనకు కూడా రాష్ట్రస్థాయిలో ఏదో ఒక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకైతే  అధినేత నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో ఆయన నిరాశలో ఉన్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనకు జిల్లాలో విస్తృత సంబంధాలు ఉండడంతోపాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం కలిసివచ్చే అంశాలు. అయితే ఆయన ఏ పదవి లేకపోవడంతో ఆ భార్య చిగురుమామిడి మండల పరిషత్‌ అధ్యక్షురాలు కావడంతో ఆ మండల రాజకీయాలకే పరిమితమై పనిచేస్తున్నారు. 

  పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు మాజీ శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్‌, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌ మధ్య పోటీ ప్రతిష్టాత్మకంగా జరుగనున్న నేపథ్యంలో మానకొండూర్‌ నియోజకవర్గానికి చెందిన మోహన్‌ను, హుస్నాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ప్రవీణ్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌ ఓటమికి బాటలు వేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. అయితే ఆ ప్రయత్నంలో సఫలమైనా అనూహ్యంగా బీజేపీ వేవ్‌ రావడంతో పరాజయం కాక తప్పలేదు. ఆరెపల్లి మోహన్‌ స్థానిక సంస్థల్లో సర్పంచు స్థాయి నుంచి జడ్పీ చైర్మన్‌ వరకు, చట్టసభల్లో ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర ఎస్సీసెల్‌ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 

ప్రవీణ్‌రెడ్డి హుస్నాబాద్‌ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడే కాకుండా ముల్కనూర్‌ సొసైటీ అధ్యక్షుడిగా రైతుల్లో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ కోసం కొంత ఉపయోగపడ్డ ఇప్పటి వరకు పార్టీలో ఆయనకు ప్రాధాన్యం లభించలేదనే ప్రచారం జరుగుతున్నది. 

  పెద్దపల్లి నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరి బీసీల ఓట్లను టీఆర్‌ఎస్‌కు మళ్లిచేందుకు కృషిచేశారన్న పేరు ఉంది. ఆ ఎన్నికల తర్వాత ఆయన పాత్ర కూడా టీఆర్‌ఎస్‌లో క్రమేపీ మసకబారిపోయింది. 

తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీచేసి పరాజయం పాలై మళ్లీ పోటీచేసే అవకాశాన్ని వదులుకొని టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి దక్కక త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. పాడి కౌశిక్‌రెడ్డిని హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని ఆయనకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సిఫారసు చేస్తూ రాష్ట్ర కేబినెట్‌ గవర్నర్‌కు ప్రతిపాదన పంపించింది. అయితే గవర్నర్‌ ఆ ప్రతిపాదనపై సమగ్ర పరిశీలన జరుపాలని భావించడంతో పెండింగ్‌లో పడిపోయింది. 

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ నెలక్రితమే తన అధ్యక్ష పదవికి, టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్రంలో పద్మశాలి సామాజిక వర్గానికి రాజకీయంగా మంచి బలం ఉండడం టీఆర్‌ఎస్‌లో ఆ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల సీనియర్‌ నాయకుడు లేక పోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎల్‌.రమణను ఏరికోరి పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు వారం తిరగక ముందే ఎమ్మెల్సీ పదవి వస్తుందని అందరూ ఆశించారు. అయితే కరోనా కారణంగా శాసనసభ్యులు ఎన్నుకునే ఎమ్మెల్సీల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు వాటికి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఆయనకు లైన్‌క్లియర్‌ అయినట్లు భావిస్తున్నారు. ఈకోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కక పోతే వచ్చే జూన్‌ మాసంలో రాజ్యసభకు పంపించే అవకాశమున్నదని చెబుతున్నారు. 

  అలాగే హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీకి రాంరాం పలికి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డికి కూడా ఇప్పటికైతే ఏ రకమైన పదవి దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ భవిష్యత్‌ పట్ల స్పష్టమైన హామీ ఇచ్చారన్న ప్రచారం మాత్రం జరుగుతున్నది. 

అయితే రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్న నైరాశ్యమే ఆ పార్టీ నేతల్లో నెలకొంటున్నట్లు చెబుతున్నారు.  దీనితో అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఇప్పుడు తాజాగా చేరిన మరికొందరు టీఆర్‌ఎస్‌ పార్టీలో కరివేపాకులుగా మిగిలిపోతారా లేకుంటే కాలం కలిసివచ్చి పదవులను అలంకరిస్తారా అన్న విషయంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.