స్టాంపు ఓట్లతో ఫలితం స్టాప్‌!

ABN , First Publish Date - 2020-12-05T08:46:21+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొన్ని చోట్ల చెల్లని ఓట్లపై గందరగోళ పరిస్థితి నెలకొంది. స్వస్తిక్‌ మార్క్‌ పడని ఓట్లు, పెన్నుతో రాసిన ఓట్లు, వేలిముద్రలు వేసిన ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదు.

స్టాంపు ఓట్లతో ఫలితం స్టాప్‌!

నేరేడ్‌మెట్‌లో తాత్కాలికంగా ఆగిన ఫలితం

ఆ డివిజన్‌లో చెల్లని ఓట్ల సంఖ్య 544

తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి


హైదరాబాద్‌ సిటీ, నేరేడ్‌మెట్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొన్ని చోట్ల చెల్లని ఓట్లపై గందరగోళ పరిస్థితి నెలకొంది. స్వస్తిక్‌ మార్క్‌ పడని ఓట్లు, పెన్నుతో రాసిన ఓట్లు, వేలిముద్రలు వేసిన ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదు. రెండు చోట్లా మెజారిటీ కంటే చెల్లని ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఓడిన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రీ కౌంటింగ్‌కు పట్టుబట్టారు. ఆ రెండు డివిజన్లలో ఒకటి నేరేడ్‌మెట్‌ కాగా.. రెండోది రాంగోపాల్‌ పేట. రెండు చోట్లా కొందరు ఓటర్లు వేలికి ఇంకు రాసుకుని బ్యాలెట్‌పై వేలిముద్ర వేశారు. మరికొందరు తమకు నచ్చిన అభ్యర్థి పేరుపై సంతకం చేశారు. నేరేడ్‌మెట్‌ డివిజన్‌లోని పోలింగ్‌ బూత్‌ నంబరు 50లో ఓటర్లు స్వస్తిక్‌ ముద్ర ఉన్న స్టాంపు వేయడానికి బదులుగా డివిజన్‌, పోలింగ్‌ బూత్‌ నంబరుతో ఉన్న 136 బై 50 స్టాంపుతో ఓట్లు వేశారు. ఆ బూత్‌లో అలా 544 ఓట్లు పోలయ్యాయి.


చివరి వరకూ ఉత్కంఠగా కౌంటింగ్‌ సాగిన నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డికి మెజారిటీ వచ్చిందని అధికారికంగా ప్రకటించేందుకు ఆర్‌వో ప్రయత్నించారు. కానీ,బీజేపీ అభ్యర్థి కె.ప్రసన్ననాయుడు అభ్యంతరం తెలుపుతూ ధర్నాకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని.. ఆర్‌వోతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలిగానీ, ధర్నా చేయడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. స్వస్తిక్‌ గుర్తు లేకుండా వేసిన ఓట్లను లెక్కించడానికి వీలు లేదని, హైకోర్టు ఆర్డర్‌ ప్రకారం నడుచుకోవాలని ఆర్‌వోను కోరారు. దీంతో ఆ డివిజన్‌ ఫలితాన్ని తాత్కాలికంగా ఆపామని, విషయాన్ని ఈసీకి తెలిపామని ఆర్‌వో లీనారెడ్డి, అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి దశరథ్‌ వెల్లడించారు.


కాగా.. ఈ డివిజన్‌లో రీపోలింగ్‌ నిర్వహించాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బీజేపీ అభ్యర్థి ప్రసన్ననాయుడు హెచ్చరించారు. దీనిపై ఆమె స్థానిక పోలిసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఇక.. రాంగోపాల్‌పేటలో గెలిచిన అభ్యర్థి చీర సుచిత్ర శ్రీకాంత్‌ (బీజేపీ) మెజారిటీ 310. అక్కడ చెల్లని ఓట్లు సంఖ్య 600కు పైగా ఉన్నట్లు వెల్లడించిన అధికారులు.. బీజేపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరుణ శ్రీనివాస్‌ గౌడ్‌ కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.


కొంప ముంచిన టీఆర్‌ఎస్‌ డమ్మీ అభ్యర్థి

బీఎన్‌రెడ్డి నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేసిన ఓ ఎత్తుగడ ఆయనకే చేటు చేసింది. కేవలం 32 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీకి 11,438 ఓట్లు, టీఆర్‌ఎ్‌సకు 11,406 రాగా, టీఆర్‌ఎస్‌ నుంచి ‘డమ్మీ’గా పోటీ చేసిన అభ్యర్థికి 39 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్ల వల్లే టీఆర్‌ఎస్‌ ఓటమి పాలైంది. గ్రేటర్‌లో అతి తక్కువ ఓట్లతో అభ్యర్థి ఓడిపోయింది ఈ డివిజన్‌లోనే. పత్తర్‌ఘట్టీలో ఎంఐఎం అభ్యర్థి 18,909 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇదే అత్యధిక మెజారిటీ. కాగా, పది చోట్ల అధికార పార్టీ కేవలం 200లోపు ఓట్ల తేడాతో పరాజయం పాలైంది. జాంబాగ్‌లో బీజేపీ అభ్యర్థికి 8,547 ఓట్లు రాగా, ఎంఐఎంకు 8,365 ఓట్లు వచ్చాయి. అక్కడ కమలం పార్టీ కేవలం 182 ఓట్లతో బయటపడింది.

Updated Date - 2020-12-05T08:46:21+05:30 IST